దృశ్య కావ్యంగా మారిన తిరుమల
x

దృశ్య కావ్యంగా మారిన తిరుమల

తిరుమల చరిత్రను కళ్లముందు ఆవిష్కరించిన కళాకృతులు.


తిరుమల ఇల వైకుంఠం ఓ దృశ్య కావ్యంగా మారింది. సంస్కృతీ, సంద్రదాయాలను ప్రతిబింబించే జానపద కళలు ఆధ్యాత్మిక క్షేత్రంలో కొలువయ్యాయి. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే కళాకృతులు, భారత, రామాయణ, భాగవత ఘట్టాలను కళాకారులు కనువిందుగా తీర్చిదిద్దారు.


తిరుమల శ్రీవారి యాత్రికులను అలరించే విధంగా టీటీడీ గార్డెన్ విభాగం ఈ కళాకృతులను శోభాయమానంగా అలంకరించింది. తిరుమలలో రాంబగీచా గెస్ట్ హౌస్ (RB GH)లో టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు బుధవారం మీడియా సెంటర్ ప్రారంభించారు.
తిరుమలలో కల్యాణ వేదిక సమీప ప్రాంతంలో ప్రదర్శనశాలలను టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, శాంతారామ్, నరేష్ కుమార్, జంగా కృష్ణమూర్తి, టీటీడీ చీఫ్ పీఆర్వో డాక్టర్ తలారి రవి, గార్డెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఎస్వీ శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తోకలిసి చైర్మన్ బీఆర్. నాయుడు ప్రారంభించారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంటే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమై రెండో తేదీ చక్ర తల్వార్ కు శ్రీవారి పుష్కరణలో చక్రస్నానం చేయించడం ద్వారా బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు. ఆధ్యాత్మిక వాతావరణంలో సేదదీరడానికి వీలుగా టీటీడీ గార్డెన్ విభాగం 60 మెట్రిక్ టన్నుల పుష్పాలతో ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందని తెలిపారు. తిరుమలలో రవాణా, క్యూ లైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయుర్వేద, అటవీ శాఖ, శిల్పకళాశాల స్టాల్స్‌ను ఆయన అభినందించగా, టీటీడీ పబ్లికేషన్స్, అగరబత్తి స్టాల్‌ను కూడా సందర్శించారు.

"ఆధ్యాత్మిక లోగిలిలో యాత్రికులు మానసిక ఆనందం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం" అని ఈ ఫల పుష్ప ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి చైర్మన్ బీఆర్. నాయుడు వ్యాఖ్యానించారు.
తిరుమలలో ఏర్పాటుచేసిన ఫల పుష్పాలతోనే కాకుండా ప్రత్యేక వస్తువులతో తయారుచేసిన జానపద, సాంఘిక నేపథ్యాన్ని వివరించే భారత భాగవతాలను వివరించే విధంగా కళాకృతులు కనివిందు చేస్తున్నాయి.

ఎడ్ల బండిలో తీసుకువెళ్లిన ఆహార పదార్థాలను బకాసురుడు ఆరగించే విధానం కళ్ళకు కట్టే విధంగా ఉంది.
మహాభాగవతం ఘట్టాన్ని ఆవిష్కరించిన కళాకారులు అర్జునుడు బాణంవిల్లు ఎక్కు పెట్టగా శ్రీకృష్ణుడు సారధిగా ప్రధానికి సారథ్యం వహించే దృశ్యం ఆనాటి చరిత్రను ఆవిష్కరిస్తుంది.

అలిపిరి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి చేరడానికి ఉన్న బాటలో అద్భుత దృశ్య కావ్యాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించారు.

తిరుమల ఆలయంలో శ్రీవారు కొలువైన ప్రదేశాన్ని ఆనంద నిలయంగా పరిగణిస్తారు. ఆలయ గోపురం పై కూడా విమాన వెంకటేశ్వరుడు దర్శనమిస్తారు. ఆ ప్రదేశం నుంచి సన్నిధిలోకి శ్రీ వెంకటేశ్వరుడు ప్రవేశించారనేది చారిత్రక నేపథ్యంతో కూడిన కథనం.

శ్రీవారి వాహనమైన గరుత్మంతుడు ఆనంద నిలయాన్ని తిరుమలకు తీసుకువచ్చే దృశ్యాన్ని ఇక్కడ యధాతధంగా ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన కళాకారిణి గౌరి ఈ సైకత శిల్పాన్ని తీర్చిద్దారు.

దేవతామూర్తుల విగ్రహాలు విభిన్న రకాల కూరగాయలతో తయారుచేసిన కళాకృతులు యాత్రికులను మరింతగా ఆధ్యాత్మిక లోకంలో విహరించేందుకు ఆస్కారం కల్పించాయి.

వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే పాట జానపద సినిమాల్లో మనం విని ఉంటాం.. అంటే విభిన్న రకాల తినుబండారాలు అందులో ప్రధానంగా తీపి కారం తో కూడిన వస్తువులు చూసి ఘటోత్కచుడు ఆలపించే ఆ పద్యాన్ని ఆవిష్కరిస్తూ బొమ్మలతో వివిధ రకాల వంటకాల. ప్రదర్శన భరింత ఆకర్షణయంగా కనిపిస్తోంది.
ఇది ఒక ఎత్తు అయితే, ద్రౌపది స్వయంవరం ఘట్టం కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించడంలో కళాకారుల నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
పాత తిరుమల

రవాణా ఆధునిక వస్తువులు లేని రోజుల్లో తిరుమల ప్రయాణం అనేది ఒక విధంగా సాహసంతో కూడుకున్నది. ప్రస్తుతం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న ఘాట్ రోడ్డు మాత్రమే ఉండేది. ఈ మార్గం నుంచే తిరుపతి నుంచి తిరుమలకు కూడా వాహనాల రాకపోకలు సాగించేవి. ఆ రోజుల్లో ఎడ్ల బండ్లను వాహనాలుగా చేసుకొని తిరుమలను సందర్శించేవారు.

రాజుల కాలం నాటి కట్టడాలు ఆధునికరించారు. అనేక వసతి సదుపాయాలను మెరుగుపరిచారు. అయితే నాలుగు ఐదు దశాబ్దాలకు కిందటి వరకు తిరుమల ఎలా ఉండేది అనే విషయాలను వివరించే ఆనాటి ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన తిరుమల చరిత్రను కళ్ళ ముందు ఉంచు తోంది. టీటీడీ సమాచార విభాగంలోని ఫోటోగ్రఫీ విభాగం ఈ ప్రదర్శనను తిరుమలలో ఏర్పాటు చేసింది.
Read More
Next Story