The girl disappearance | తిరుమల:బాలిక అదృశ్యంతో కలకలం
x

The girl disappearance | తిరుమల:బాలిక అదృశ్యంతో కలకలం

పోలీసులు అప్రమత్తమయ్యారు. గంటల్లోనే ఆచూకీ కనిపెట్టారు. బాలికను తీసుకుని వెళ్ళిన మహిళ చిక్కుల్లో పడింది.


తిరుమల యాత్రికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఓ రకంగా, సమీపంలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద మరింత రద్దీ ఉంటుంది. దీనికి దగ్గరలోని ఆస్థానం మండపం వద్ద యాత్రికుల సంచారం అధికంగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో నాలుగేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. సుమారు నాలుగు గంటల పాటు సాగిన పోలీసు బృందాలు పాప ఆచూకీ తెలుసుకున్నారు. బాలికను తీసుకుని వెళ్లిన మహిళను విచారణ చేస్తున్నారు. బాలికను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు అభినందనలు అందుకున్నారు.


సోమవారం సాయంత్రం 6 గంటలు :

ఆస్థానమండపం వద్ద టోపీలు, అలంకరణ వస్తువులు విక్రయించే హాకర్స్ కే. కరుణశ్రీ, కే. నరసింహులు యాత్రికులతో వ్యాపారం చేయడంలో బిజీగా ఉన్నారు. తమ నాలుగేళ్ల పాప పక్కనే ఆడుకుంటూ ఉందనే భావించారు. చాలా సేపటి తరువాత కానీ, వారు బిడ్డ కనిపించకుండా పోయిందనే విషయం పసిగట్టలేకపోయారు.
రాత్రి 7 .30 గంటలు : ఎక్కడ వెదికినా కనిపించని స్థితిలో తమ బిడ్డ కనిపించడం లేదని ఆందోళన చెందారు. కన్నీరు మున్నీరుగా తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
పోలీసుల అప్రమత్తం
తిరుమల ( Tirumala )లో కూడా గతంలో పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనలతో కలకలం చెలరేగింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న తిరుమల పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. బాధిత తల్లిదండ్రుల నుంచి సమాచారం తెలిసిన వెంటనే వన్ టౌన్ స్టేషన్ సీఐ ( Tirumala Circle Inspector) విజయకుమార్ కమాండ్ కంట్రోల్ (Command Control ) ను అప్రమత్తం చేశారు. టూ టౌన్ సీఐ రాయుడు సారధ్యంలో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ టీవీ పుటేజీ (CCTV footage) పరిశీలించడంతో పాటు, శ్రీవారి మెట్టు, అలిపిరి కాలిబాటలు, తిరుమల బస్టాండ్ తో పాటు రాంబగీచా గెస్ట్ హౌస్ (RBGH) సమీపంలోని ఆర్టీసీ పరిసరాలను సునిశితంగా పుటేజీ పరిశీలించారు.
"ఇక్కడే ఓ మహిళ వెంట బాలిక ఉండడం గమనించాం" అని తిరుమల టూ టూన్ సీఐ రాముడు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఓ మహిళ తన వెంట తీసుకువెళుతున్న ఫోటో తీయడంతో పాటు దానిని అన్ని స్టేషన్లకు పంపించి, పోలీస్ శాఖను అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా ( Social media ) లో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజు కూడా స్పందించారు. వీలైనంత త్వరగా పాప ఆచూకీ కనుగొనాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. తిరుమలలో వన్ టౌన్ సీఐ విజయకుమార్ మానిటర్ చేస్తున్నారు. ఐదు పోలీసు బృందాలను రంగంలోకి దించిన టూటౌన్ సీఐ రాముడు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రాత్రి 9 గంటలు: బాలిక కోసం సెర్చ్ ఆపరేషన్ రాత్రి తొమ్మది గంటల వరకు సాగింది. అదే సమయంలో పాపను ఎవరు తీసుకుని వెళ్లింది కనిపెట్టారు.
మహిళ ఎవరంటే..
పాపను తనవెంట తీసుకుని వెళుతున్న ఫొటో చూసిన తిరుమలలో పనిచేసే వారు ఆమె చైతన్య జ్యోతి మ్యాన్ పవర్ సంస్థ ( Chaitanya Jyoti Manpower Company ) ద్వారా తిరుమలలో సులభ్ వర్కర్ (Sulabh Worker) గా నిర్ధారించారు. ఆమె శ్రీవారిమెట్టు ( Srivarimettu ) సులభ్ క్లాంప్లెక్స్ వద్ద పనిచేసే వర్కర్ నాగవెంకటరమణమ్మగా గుర్తించినట్లు తిరుమల టూటౌన్ సీఐ రాముడు చెప్పారు. సులభ్ సంస్థలో పనిచేసే వారి ద్వారా పాపను తీసుకుని వెళ్లిన మహిళ ఎవరనేది తెలిసింది. వెంటనే "ఓ బృందం ఆమె నివాసం ఉంటున్న తిరుపతి (Tirupati ) నగరం సంధ్య థియేటర్ కు సమీపంలోని పీకే లేవుట్ వద్దకు చేరుకుంది" అని సీఐ రాముడు చెప్పారు. ఆమె నుంచి పాపను తిరుమలకు తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.
అంతకుముందు ఏమి జరిగింది?
తిరుమల ఆస్థాన మండపం సమీపం నుంచి నాలుగేళ్ల పాప తప్పిపోవడంలో జరిగిన ఎపిసోడ్ అలా ఉంటే.. అంతకుముందు ఏమి జరిగిందనేది విచారణలో తెలిన విషయాలను టూ టౌన్ సీఐ రాముడు వివరించారు.
"తల్లిదండ్రులు వ్యాపారంలో బిజీగా ఉన్నారు. వారి నాలుగేళ్ల పాప ఆడుకుంటూ ఆస్థాన మండపం దాటి రాంబగీచా గెస్ట్ హౌస్ ప్రాంతానికి వెళ్లిపోయింది. అక్కడ ఏడుస్తూ ఉండడం గమనించిన నాగ వెంకటరమణమ్మ తన వెంట తిరుపతికి తీసుకుని వెళ్లింది" అని చెప్పారు.
తిరుమలలో పనిచేసే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఐ రాముడు సూచించారు. " ఆ పాపను తన వెంట కాకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి, అప్పగించి నాగ వెంకటరమణమ్మకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోగా, ప్రశంసలు అందేవి. అని ఆయన చెప్పారు. వెంట తీసుకుని వెళ్లిన ఆమె పొరబాటు చేసింది. ఆమెను విచారణ చేసిన తరువాత అధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం అని సీఐ రాముడు స్పష్టం చేశారు.

ఎస్పీ అభినందన

బాలిక ఆచూకీ కనుగొనడానికి విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసులను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజు అభినందించారు. మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న ఎస్పీ హర్షవర్థనరాజు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో పిల్లలకు రక్షణ కల్పించడానికి, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలు పెంచాలని సూచించారు. అధికారులు, స్థానికులకు సమన్వయం చేసుకుని విధులు నిర్వహిస్తే, ప్రతిష్ఠ మరింత పెరుగుతుందన్నారు. ఫలితాలు కూడా మెరుగ్గానే ఉంటాయని ఎస్పీ అధికారులకు సూచించారు.
Read More
Next Story