తిరుమల(Exclusive):కొండపై కరెంటోళ్లకు కోపమొచ్చిందబ్బా..!
x

తిరుమల(Exclusive):కొండపై కరెంటోళ్లకు కోపమొచ్చిందబ్బా..!

శ్రీవారి దర్శనానికి కోరిన టికెట్ ఇవ్వలేదు. దీంతో కరెంటోళ్లకు కోపం వచ్చింది. ఆ తరువాత ఏమి చేశారంటే...


తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ వచ్చే యాత్రికుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అదేవిధంగా వీఐపీల తాకిడి కూడా ఎక్కువే. ఆ తరువాత మంత్రులు, వారి పేషీలు, అధికారుల నుంచి కూడా సిఫారసు లేఖలు ఉంటాయి. ఈ సమాచారం అందుకునే ఆయా శాఖల అధికారులకు తలనొప్పి తప్పదు. శ్రీవారి దర్శనానికి టికెట్ తీసుకుని వచ్చే బాధ్యతలు నిర్వహించే ప్రొటోకాల్ ఉద్యోగులకు (ఇది అనధికార బాధ్యత) డ్యూటీ కత్తిమీదసాములా ఉంటుంది. పెద్దవాళ్లు చెప్పినట్లు జరగకుంటే మాటలు పడాలి. లేదంటే ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. గురువారం రాత్రి అదే జరిగింది. విద్యుత్ శాఖా మంత్రి సంబంధీకులు దర్శనానికి వచ్చారు. వారి కోసం టికెట్ తీసుకునేందుకు వెళితే, కోరిన టికెట్ లభించలేదు. దీంతో విద్యుత్ శాఖ ఉద్యోగులకు టెన్షన్ పట్టుకుంది దీంతో కోపం వచ్చిందంట. అంతే దాదాపు అరగంట పాటు తిరుమలలో కరెంట్ కట్ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో టీటీడీ ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది అప్రమత్తమై, జనరేటర్లు ఆన్ చేశారు. వాస్తవంగా కరెంట్ ఎందుకు కట్ అయిందనే విషయం వారికి తెలియదు. ట్రాన్స్ కో సిబ్బందికి కోపం తగ్గిన తరువాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాత్రి ఏమి జరిగింది?
తిరుమలలో గురువారం రాత్రి 10.45 నుంచి 11.05 దాదాపు 20 నిమిషాలు తిరుమలలో విద్యుత్ సరఫరా ఆగింది. ఎప్పుడూ లేనిది ఇదేంటబ్బా అని భావించారు. టీటీడీ అధికారులు ప్రధానంగా ఈ సంస్థ ఎలక్ట్రికల్ విభాగం సందేహిస్తూనే అప్రమత్తం అయ్యారు. వెంటనే జనరేటర్లు ఆన్ చేసి, విద్యుత్ వెలుగులు నింపారు. దీంతో యాత్రికులకు ఇబ్బందులు తప్పాయి.
విషయం ఏమిటంటే..

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కుటుంబానికి సన్నిహితులు శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలతో తిరుమలకు చేరుకున్నారు. ఈ విషయం ముందుగానే సమాచారం ఉండడంతో ట్రాన్స్ కో అధికారులు కింది స్థాయి సిబ్బందికి పురమాయించారు. తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉందంటూ, టికెట్ జారీ కేంద్రంలో ట్రాన్స్ కో ఉద్యోగికి సమాధానం లభించింది. కోరిన టికెట్ కాకుండా, మంత్రి సంబంధీకులకు శ్రీవారి దర్శనానికి బ్రేక్ దర్శనం టికెట్ కేటాయించారు. దీంతో...
కోపం వచ్చింది..?
మంత్రి కుటుంబీకులు దర్శనానికి వస్తే, అడిగిన టికెట్ ఇవ్వారా? అని ట్రాన్స్ కో ఇంజినీరుకు కోపం వచ్చినట్లు తెలిసింది. "మా మినిస్టర్ అడిగింది మీరు ఇవ్వరా " అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రికి ఏమి సమాధానం చెప్పాలి? అనేది కూడా ఆయన ఆందోళన. దీంతో తిరుమలలో గురువారం రాత్రి 10.45 నుంచి 11.05 గంటల వరకు కరెంట్ కట్ చేయించారని తెలిసింది. వెంటనే స్పందించిన టీటీడీ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, సిబ్బంది అప్రమత్తమై, జనరేటర్లను ఆన్ చేయించారు. దీంతో అంధకారం తొలగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. మీడియా కూడా దీనిపై ఎక్కడా చిన్న వార్త రాసిన పాపాన పోలేదు.
ఇది మొదటిసారి?
తిరుమలలో ఈ తరహా చర్యలకు పాల్పడడం మొదటిసారి అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. పవర్ కట్ చేయించి తిరుమలను అంధకారంలో ఉంచాలనుకోవడం దారుణమని కూడా అన్నారు. భగవంతుని సన్నిధిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని కూడా వ్యాఖ్యానించారు. తిరుమలలో జనరేటర్ సౌలభ్యం ఉండటంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్యవహరించారు. కాగా,
"తిరుమలలో గురువారం రాత్రి 11.43 నుంచి 11.02 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలిచింది" అనే విషయం ఓ అధికారి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి ధృవీకరించారు. ఆ మేరకు టీటీడీ ఎలక్ట్రికల్ విభాగం రికార్డులో కూడా నమోదైంది. కానీ, ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదు. టీటీడీ టికెట్ల జారీ కేంద్రంలో కూడా ఆ వాతావరణం మారాలని ఆయన అభిప్రాయపడ్డారు.

దీనిపై ఏపీ ట్రాన్స్ కో (AP Transco) తిరుపతి, తిరుమల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) చంద్రశేఖర్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో శుక్రవారం రాత్రి మాట్లాడారు. "తిరుమలలో ఈ తరహా సంఘటన జరగలేదు" అని ఈఈ చంద్రశేఖర్ తెలిపారు. "ఏదన్నా సంకేతిక సమస్య ఉన్నా, వెంటనే సమస్య లేకుండా వ్యవహరిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. తిరుమల కొండపై అలాంటి సంఘటన జరగడానికి ఆస్కారం లేదంటూనే, తన దృష్టికి ఆ సమస్య రాలేదు" అని ఈఈ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Read More
Next Story