తిరుమల దర్శనం: సెంటిమెంట్ వదిలి యుద్ధానికి సిద్ధం అంటున్నారు..
ఆధ్మాత్మిక నగరం రాజకీయంగా వేడెక్కుతోంది. సెంటిమెంట్ గాలికి వదిలేశారు. జగన్ తిరుమల పర్యటనపై కత్తులు నూరుతున్న అధికారపక్షం డిక్లరేషన్ వివాదం తెరపైకి తెచ్చింది.
రుపతిపై రాజకీయ యుద్ధమేఘాలు ఆవరిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్. జగన్ తిరుమల పర్యటనకు రానున్నట్లు ప్రకటించారు. ఆయనకు అధికార టీడీపీలోని భాగస్వామ్య పార్టీలు ఘాటు హెచ్చరికలు జారీ చేశాయి. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను గాలికి వదిలేసిన వారంతా రాజకీయ ఆధిపత్యం చాటుకోవడానికి తహతహలాడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని ఒకరు, తిరుమలలో వివాదాలు సృష్టిస్తాంని బీజేవైఎం బహిరంగంగానే హెచ్చరిస్తోంది. దీనికి ప్రధాన కారణం..
"తిరుమల శ్రీవారి లడ్డు లో వాడిన నెయ్యి కల్తీ అయింది" అని సీఎం చంద్రబాబు రగిల్చిన చిచ్చు దావానలంలా వ్యాపిస్తూనే ఉంది. వారం నుంచి రాష్ట్ర రాజకీయాలను ఈ అంశం కుదిపేస్తోంది. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
"ఈ నెల 28వ తేదీ అన్ని ఆలయాల్లో పూజలు చేయండి" అని మాజీ సీఎం వైఎస్. జగన్ వైసీపీ శ్రేణులను ఆదేశించారు. అదే రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా అంటే ఒకరోజు ముందు 27వ తేదీన ఆయన తిరుపతికి చేరుకుంటారు. అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళతారు.
"చేసిన తప్పులు ఒప్పుకుని, లేంపలేసుకుంటే సరే. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అని ఒకరు, డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని మరోపార్టీ నేత జగన్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
వైఎస్. తిరుమల పర్యటనకు రావడానికి జగన్ కు ఇలాంటి అభ్యంతరాలు ఉండవు. అలా కాదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం. స్థానికులు సహించరు అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. స్థానికతను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వారు కూడా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్. జగన్ రాక నేపథ్యంలో ఎవరు ఎలా స్పందించారంటే...
నిరసనలకు పిలుపు
"వైఎస్. జగన్ తిరుమలకు రావడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. తప్పులు ఒప్పుకుని చెంపలు వేసుకోండి" అని దీనిపై టీడీపీ కార్యదర్శి జీ. నరసింహయాదవ్ ఘాటుగా హెచ్చరించారు. అలా కాదని ప్రజల రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. "అదే రోజు నిరసనలు కార్యక్రమాలు నిర్వహించండి" అని కూడా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి సుధాకర్, టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో నరసింహ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిక్లరేషన్ ఇవ్వాల్సిందే...
"తిరుమలకు వచ్చే మాజీ సీఎం వైఎస్. జగన్ కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే" అనే వివాదాన్ని బీజేపీ రాష్ట్ర కమిటీ తెరపైకీ తీసుకువచ్చింది. "తిరుమల శ్రీవారిపై విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పే డిక్లరేషన్ ఇచ్చాక స్వామి వారిని దర్శించుకోవాలి" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. బ్రిటీష్ హయాం నుంచే అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే, డిక్లరేషన్ పై సంతకాలు చేసే సంప్రదాయం ఉందనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 1933 ముందు వరకు బ్రిటీషర్లు అమలు చేసిన ఈ పద్ధతిని మహంతులు పర్యవేక్షించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
"హిందూ సంప్రదాయాలు,తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉంది. అందువల్ల దర్శనానికి అనమతించండి" అని డిక్లరేషన్ లో ఉంటుంది.
వివాదాలు సృష్టిస్తాం
తిరుమలకు రావాలంటే వైఎస్. జగన్ అలిపిరి వద్దే డిక్లరేషన్ పై సంతకం చేయాలనే కొత్త విషయాన్ని కడప జిల్లా రాజంపేటకు చెందిన బీజేవైఎం రాష్ట్ర నేత నాగోతు రమేష్ నాయుడు ప్రస్తావించారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ వైసీపీ, ఎన్డీఏ ప్రభుత్వానికి ట్యాగ్ చేశారు. ఆయన ఏమంటారంటే.. "భార్యతో కలిసి వైఎస్. జగన్ దర్శనానికి వెళ్లడానిక సంతకం చేయాలి" అని డిమాండ్ చేశారు. లేకుంటే "హిందువులుగా మేమే అడ్డకుంటాం. తిరుమల సాక్షిగా వివాదాలు సృష్టిస్తాం" అని బహిరంగంగా హెచ్చరించారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా బీజేపీ డిమాండ్ ను పునరుద్ఘాటించారు. వైఎస్. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే అన్నారు. ఈ తరహా పద్దతులు మీ హయాంలో (వైసీపీ పాలన)లో తుంగలో తొక్కారు. ఇప్పుడైనా సంప్రదాయాలను పాటించడానికి, పునరుద్ధరించండి" అని సూచించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒకపక్క, వైసీపీ మరోపక్క తిరుపతి, తిరుమల వేదికను చేసుకుని రగడ చేయడానికి సన్నద్ధం అవుతున్నాయి. బీజేపీ శ్రేణులకు ఈ పాటికే సంకేతాలు వెళ్లాయని తెలుస్తున్నది. టీడీపీ కూడా తిరుపతికి సమీప ప్రాంతాలుగా ఉన్న చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు ప్రాంతాలతో పాటు భారీగా జనసమీకరణకు సమాయత్తం అవుతున్నట్లు వినికిడి.
దీనిని వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం లేకపోలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైఎస్ఆర్ ఆత్మాహుతి దళసభ్యులు అన్నట్లు వారి కుటుంబానికి త్యంత సన్నిహితులైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉం దని భావిస్తున్నారు. దీంతో తిరుపతి చుట్టుపక్క ప్రాంతాల నుంచే కాకుండా, జిల్లాలోని పొరుగు ప్రాంతాల నుంచి కూడా వైసీపీ మద్దతుదారులు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు సమీకరణకు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదని ఓ నేత 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
వైసీపీ నేర్పిన విద్యలే..
వైఎస్. జగన్ తిరుమల పర్యటన మరింత సున్నితంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో గతంలో వైసీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్ష టీడీపీ నేతలను ముందస్తు నోటీసులతో కట్టడి చేశారు. అదే అస్త్రం అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ప్రయోగించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ప్రతిపక్ష నేత పర్యటనకు అవరోధాలు అనడం కంటే, నిరసనలు, అడ్డకునేందుకే టీడీపీ కూటమి పార్టీల శ్రేణులను సంసిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ ప్రధాన నేతలు అటుంచి, కనీసం ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కనిపించని స్థితి.
అనుమతి ఇస్తారా
ఈ పర్యవసానాల నేపథ్యంలో అసలు వైఎస్. జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందా? "శాంతిభద్రతల సమస్య తలెత్తే సమస్య ఉంది. మీరు వెళ్లడం వల్ల మరింత సున్నితంగా మారుతుంది" అనే సన్నాయి నొక్కులతో కూడా ఆయన పర్యటనకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఓ నేత అభిప్రాయపడ్డారు.
ఇవన్నీ ఎలా ఉన్న ఆధ్మాత్మిక తిరుపతిలో రాజకీయ రణరంగానికి అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ వేదికగా ఎంచుకుంది. ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందనేది వేచిచూడాలి.
Next Story