
తిరుమలలో పాముతో విన్యాసం చేయిస్తున్న భాస్కరనాయుడు (ఫైల్)
tirumala | స్నేక్ క్యాచర్ పై కోరలు చాచిన కోబ్రా..
పాముకాటుతో భాస్కర్ మరోసారి ఆస్పత్రిలో చేరారు.
బుసలు కొట్టే పాములను సునాయాసంగా బంధించడం, వాటితో విన్యాసాలు చేయించడంలో భాస్కర్ నాయుడు (68) నేర్పరి. తిరుమలలో పాముల భాస్కర్ గా గుర్తింపు పొందిన ఆయన మరోసారి అదే పాముకాటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి నగరంలోని కరకంబాడి వద్ద ఉన్న అమర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు మెడికల్ ఇంటెన్వివ్ కేర్ యూనిట్ (Micu)లో చికిత్స అందిస్తున్నారు.
"భాస్కర్ నాయుడుకు యాంటీ వైనం థెరపీతో పాటు పూర్తిస్థాయి వెంటిలేటర్ సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నాం" అని అమర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నియమించిన ప్రత్యేక వైద్య బృందం ప్రకటించింది.
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు
తిరుమల లేదా తిరుపతిలో భాస్కర్ నాయుడు పాముల భాస్కర్ గా పాపులర్. తిరుమలలో శుక్రవారం ఆయనను కోబ్రా పాము కాటు వేసింది. అస్వస్థతకు గురైన భాస్కర్ నాయుడుని ఆసుపత్రికి తరలించారు.
కరకంబాడి సమీపంలోని అమర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శివరామకృష్ణారెడ్డి, జనరల్ మెడిసిన్ డాక్టర్ బి లోకేష్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ వి. శంకర్, వైద్యం అందిస్తున్నట్లు అమర హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరినేని చెప్పారు.
"మరో 24 గంటల తర్వాత భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థితి పై తాజా వివరాలను అందిస్తాం" అని ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇంత ప్రాధాన్యత
తిరుమలలో ప్రాణాంతక విషపూరిత పాములు పట్టడంలో భాస్కర్ నాయుడు నేర్పరి. Snake catcher గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు దక్కింది..
చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చిన్నగొట్టిగల్లు కు చెందిన భాస్కర్ నాయుడుది వ్యవసాయ కుటుంబం. ఊర్లో పదవ తరగతి చదువుకున్నాడు. మదనపల్లిలో ఇంటర్ పూర్తి చేశాడు. వ్యవసాయం వల్ల ఆశించిన ఆదాయం లభించడం లేదని భావించిన భాస్కర్ నాయుడు నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నాడు. "1982లో టిటిడి అటవీ శాఖలో తాత్కాలిక వర్కర్ గా చేరా. తిరుమలలో మొక్కలు నీళ్లు పోసే పనులు చేశానని" అని భాస్కర్ నాయుడు గత ఏడాది నవంబర్లో ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవన గమనాన్ని పంచుకున్నారు.
"నేను కాస్త చదువుకుని ఉండడంతో మేస్త్రిగా నియమించారు. 20 మంది వర్కర్లను కేటాయించిన విషయం" ఆయన అప్పట్లో గుర్తు చేసుకున్నారు.
"2005లో తిరుమలలోని నారాయణిగిరి ఉద్యానవనం వద్ద ఒకరోజు చదను చేస్తుంటే, పొదల్లో నుంచి కొండచిలువ బయటికి వచ్చింది. అప్పటివరకు పని చేస్తున్న కూలీలందరూ ఎటుపడితే అటు పారిపోయారు. నేను మాత్రం ఇంకొకరి సహాయం తీసుకుని భారీ కొండచిలువను పట్టుకున్నాను" ఆ సంఘటన నన్ను స్నేక్ క్యాచర్ గా మార్చి వేసిందని భాస్కర్ నాయుడు గతాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆ సంఘటన నన్ను పూర్తిగా మార్చి వేయడంతో 1988లో నా సర్వీసును క్రమబద్దీకరించిన టిటిడి అటవీ శాఖ అధికారులు మజ్దూర్గా పదోన్నతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
తిరుమలలో యాత్రికులు బస చేసే గదులు, తిరుపతిలో కోదండ రామస్వామి ఆలయం, కపిలతీర్థం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి రుయా ఆస్పత్రి తోపాటు ఇతర ప్రదేశాల్లో ఎక్కడ పాము కనిపించిన భాస్కర్ నాయుడుకు వెంటనే సమాచారం అందుతుంది. క్షణాల్లో అక్కడికి చేరుకునే భాస్కర్ నాయుడు చేతికి గ్లౌజులు, ఒంపు తిరిగిన ఓ కడ్డీతో చాకచక్యంగా పామును బంధిస్తాడు. దానిని ఓ గౌతమ్ లో వేసుకొని శేషాచలం అడవుల్లోకి తీసుకువెళ్లి ఆ పామును సురక్షితంగా వదిలి వేస్తాడు.
"ఈ విధంగా నేను ఇప్పటికి18 వేలకు పైగానే ప్రమాదకరమైన పాములను బంధించి, అడవిలో సురక్షితంగా వదిలాను" అని భాస్కర్ నాయుడు వివరించారు.
2016లో ఆయన టిటిడి అటవీ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన, పాములు పట్టే పని మాత్రం మానలేదు. మొదట 20 వేలు గౌరవ తనం టిటిడి ఇచ్చేది. దాని రద్దు చేసిన తర్వాత ఒక పాము పడితే వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు.
ఆ పామే.. శత్రువు
పాములను పట్టడం అనేది ప్రమాదకరమైన వృత్తి. ఈ పని చేస్తున్న భాస్కర్ నాయుడు 2022లో జనవరి 25వ తేదీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పామును పట్టుకునే సమయంలో పడిపోయింది. దీంతో ఆయన ప్రమాదకరమైన పాము కాటుకు గురయ్యారు. మొదట స్విమ్స్ తర్వాత, ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన టిటిడి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గండం గడిచి భాస్కర్ నాయుడు ప్రాణాలతో బయటపడ్డారు.
మరోసారి కాటు..
తిరుమలలో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు శుక్రవారం మళ్లీ పాము కాటుకు గురయ్యారు. తిరుమలలో ప్రమాదకర కోబ్రా కనిపించిందని సమాచార అందడంతో భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకున్నారు. గ్లౌజ్ చేతి నుంచి జారిపోవడంతో పాము కాటు వేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య స్థితి నిలకడగానే వద్దని ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేసిన బులెటిన్ లో స్పష్టం చేశారు.
టిటిడి అధికారులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.
Next Story