తిరుమల:టీడీపీ కూటిమి కీలక నిర్ణయం
తిరుమల పర్యటన కోసం ఇంకొన్ని గంటల్లో జగన్ తిరుపతికి చేరుకోనున్నారు. దీంతో టీడీపీ టీడీపీ కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ వారు ఏమి చేయబోతున్నారు?
తిరుమలకు వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ఈ రోజు సాయంత్రం రానున్నారు. ఆయన పర్యటనను అడ్డుకోవాలని టీడీపీ కూటమి నేతలు నిర్ణయించారు. అయితే, శుక్రవారం తిరుపతిలో సమావేశమైన ఆ మూడు పార్టీల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల వెనుక..
వారం కిందట..
" తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగింది" అని సీఎం చంద్రబాబు పేల్చిన మాటల తూటాలు దేశ వ్యాపిత చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తన చిత్తశుద్ధి, ఆరోపణలకు సమాధానం చెప్పాలనే లక్ష్యంగా..
వైసీపీ అధినేత వైఎస్. జగన్ ఈ రోజు సాయంత్రం ( సెప్టంబర్ 27వ తేదీ) తిరుపతికి చేరుకుంటారు. సాయంత్రం ఆయన పార్టీ నేతలతో కలిసి తిరుమలకు చేరుకుంటారు అక్కడే బసచేసి, శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే విధంగా కార్యక్రమం ఖరారైంది. ఇంకొన్ని గంటల్లో ఆయన తిరుపతికి రానున్నారు. దీనిపై
టీడీపీ కూటమి నేతలు శుక్రవారం కీలక నిర్ఱయం తీసుకున్నారు. "వైఎస్. జగన్ తిరుమలకు సతీసమేతంగా రావాలి. అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలి" అనేది అధికార టీడీపీతో పాటు బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలు చేసిన డిమాండ్లు. తిరుమలకు వెళ్లే వైఎస్. జగన్ ను తిరుమలలో అడ్డుకుంటాం అని టీపీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు జీ. నరసింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి స్థానికులు నిరసనలకు కూడా సిద్ధంగా ఉండాలని నరసింహయాదవ్ పిలుపు ఇవ్వడం గమనార్హం. ఇంకో అడుగు ముందుకు వేసిన రాష్ట్ర బీజేవైఎం నేత నాగోతు రమేష్ నాయుడు "తిరుమల సాక్షిగా వివిదాలు సృష్టిస్తాం" అని బాహాటంగా హెచ్చరించారు. దీంతో
తిరుపతి, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అలజడి చెలరేగింది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు కేంద్రాల్లో పరిస్థితి అదుపుతప్పకుండా జిల్లా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీస్ 30 యాక్టు అమలులోకి తీసుకు వస్తూ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు కూడా జారీ చేశారు. వైసీపీ, బీజేపీ, టీడీపీ నేతలకు కూడా పోలీసులు ఇళ్లు వదిలి బయటికి రావద్దని కూడా ముందస్తు నోటీసులు జారీ చేశారు.
కూటమి యూ టర్న్
ఇంకొన్ని గంటల్లో వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ తాడేపల్లి నుంచి తిరుపతికి చేరుకోనున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధికార కూటమి యూ టర్న్ తీసుకున్నట్లు కనిస్తోంది.
తిరుపతిలో ఎన్టీఏ కూటమి నేతలు శుక్రవారం మధ్యాహ్నం సమావేశయ్యారు. ఇందులో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు జీ. నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, బీజేపీ, జనసేన తిరుపతి నేతలు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా , "జగన్ పర్యటనను అడ్డుకోవద్దు" అని నిర్ణయించారు. జగన్ పర్యటించే మార్గంలో శాంతియుతంగా నిరసన తెలపాలి. దీనిని మూడు పార్టీల శ్రేణులు పాటించాలి" అని సూచన చేశారు.
కారణం అదేనా..?
దీనివెనుక కారణం కూడా లేకపోలేదని తెలుస్తోంది. "జగన్ ను అడ్డుకుంటే ఇది దేశవ్యాపితంగా ప్రచారం అవుతుంది. దీనివల్ల కొన్నివారికి సానుభూతి లభించడానికి ఆస్కారం ఉంటుంది. తామే క్రెడిట్ ఇచ్చినవాళ్లం అవుతాం" అని భావించినట్లు తెలుస్తోంది. దీనిని
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంతి శ్రీనివాస్ కూడా ధృవీకరించారు. "మాజీ సీఎంను అడ్డగించడం వల్ల ఆయనకు ఉచితంగా సానుభూతి అందించడమే. అభ్యంతరాలు లేకుంటే ఆయన వస్తారు. దర్శనం చేసుకుంటారు. వెళతారు. అంతటితో అది సమాప్తం అవుతుంది" అని శ్రీవానివాస్ వ్యాఖ్యానించారు.
మొత్తానికి టీడీపీ కూటమి నేతలు ఆలస్యంగా అయినా అసలు సూత్రాన్ని గ్రహించినట్లే కనిపిస్తోంది. కూటమి నేతల నిర్ణయం వల్ల తిరుపతి, తిరుమల ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రశాంతత కాపాడడమే లక్ష్యంగా ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. ఏమి జరుగుతుందనేది సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే.
Next Story