తిరుమల : బ్రహ్మోత్సవానికి అంకురార్పణ... సాయంత్రం ఎలా చేస్తారంటే..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం (ఈ రోజు) రాత్రి అంకురార్పణ జరుగుతుంది. ఈ క్రతువు ఎలా నిర్వహిస్తారంటే..
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం (రేపు) నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల ప్రారంభానికి ముందు అంటే ఈ రోజు (గురువారం) రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య వేదపండితులు, ఆగమశాస్ర్తం ప్రకారం స్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ లేదా బీజవాపనం ముఖ్యమైంది.
అంకురార్పణ ఎలాగంటే..
తిరుమలలో ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు, విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారనే ప్రగాఢ విశ్వాసం. అనంతరం
నవధాన్యాలతో...
అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కావడంతో.. ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళలో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి.ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయనేది సంపూర్ణం విశ్వాసం. ఈ కార్యక్రమం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. దీని ద్వారా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది.
ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు కూడా ఆ దశగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే తమిళమాసం (తైమాసం, పెరటాసి నెల) ప్రారంభమవుతుంది. దీంతో శ్రీవేకంటేశ్వరుని మాలధారణలో ఉన్న యాత్రికులు అశేషంగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండ రద్దీగా మారింది. ఉత్సవాలు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం ఉంది.
Next Story