
Tirumala |శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో టీటీడీ మరో ప్రయోగం...
9 తేదీ నుంచి ఆన్ లైన్ లోనే టికెట్లు జారీ చేస్తామంటున్న టీటీడీ
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి శ్రీవాణి టికెట్లు ఈ నెల తొమ్మది తేదీ నుంచి పూర్తిగా ఆన్ లైన్ ద్వారా మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిం. నెల రోజుల పాటు ఈ ప్రయోగం అమలు చేయాలని నిర్ణయించారు. యాత్రికుల స్పందన ఆధారంగా మళ్లీ సమక్షించే అవకాశం ఉంది.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా ఒకరికి 10 , 500 రూపాయలకు ఒక టికెట్ జారీ చేస్తారు. అందులో పది వేలు, శ్రీవాణి ట్రస్టుకు వెళుతుంది. ఈ నిధులతో ఎస్సీ,ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. మిగతా రూ. 550 శ్రీవారి దర్శనానికి వీఐపీ టికెట్ చేరీ చేస్తారు శ్రీవాణి ట్రస్టు ప్రారంభం నుంచి అనేకసార్లు ప్రయోగాలు నిర్వహించారు. రోజుకు ఆ టికెట్ల సంఖ్య 1,500 నుంచి రెండు వేలకు పెంచారు.
వైసీపీ ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్టు ప్రారంభించిన తరువాత రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు తిరుమలలో 800 టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడడం వల్ల టికెట్ల సంఖ్యను పెంచారు.
2025 ఆగష్టు రెండో తేదీ నుంచి తిరుమల అన్నమయ్య భవన్ వద్ద శ్రీవాని టికెట్ల జారీకి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటల నుంచి టికెట్లు జారీ చేయడం, వారందరికీ అదే రోజు సాయత్రం దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవాణి కేంద్రంలో 800, ఆన్ లైన్ లో 500 , రేణిగుంట విమానాశ్రయంలో 200 ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నారు. ఈ పద్ధతిలో మళ్లీ మార్పు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
నెల రోజులు ప్రయోగం
తిరుమలలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లు పూర్తిగా ఆన్ లైన్ లో జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నారు. టికెట్లను రోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ తీసుకున్న యాత్రికులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
నిబంధనలు ఇవీ..
శ్రీవాణిలో ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం నలుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ విధానంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తద్వారా ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్ లో నిరీక్షించే సమస్య తొలగిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేస్తున్నారు. మూడు నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు స్పస్టం చేశారు.
తిరుపతి విమానాశ్రయంలో రోజూ భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగనుంది.
అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

