తిరుమల: శ్రీవారికి ఒకరోజు బ్రహ్మోత్సవం ఉంది తెలుసా..?
తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో ఏడాదిలో ఒకరోజు బ్రహ్మోత్సవం కూడా నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఏడాది పొడవునా ఉత్సవాలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలే కాదు. ఒకరోజు బ్రహ్మోత్సవం కూడా తిరుమలలో నిర్వహిస్తారు. ఆ తరహాలో ఇంకొన్ని కూడా ఉన్నాయి. కాగా,
2024 బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ( మంగళవారం రాత్రి) గరుడొత్సవం నేపథ్యంలో తిరుమల కొండ కిటకిటలాడు తోంది.
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కొంగుబంగారమయ్యారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా ఆరంభించిన ఈ ఉత్సవాలు కావడంతో " ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి" అని చెబుతారు. ఇంకో కారణం ఉంది. నవాహ్నిక దీక్షతో నవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు చారికత్రక పురాణాల నేపథ్యం ఉంది. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను పదసంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఏమని వర్ణించాలంటే..
"నానా దిక్కులెల్ల వానలలోనే ఒత్తులు కదిలి" అంటే అన్నమాచార్యుడు వర్ణించిన విధానం ఎలా ఉంటుందనేది పరిశీలిస్తే అన్ని ప్రాంతాల భక్తులు తండోప తండాలుగా వస్తారు. ఈ ఉత్సవాలను కనులారా దర్శించి తరించాలని భావిస్తారు. స్వామివారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకిస్తే జన్మ ధన్యమవుతుందని. శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి మాడ వీధుల్లో విహరించే దృశ్యకావాన్ని చూసి పునీతులవుతారు. ఈ జన్మకు ఇది చాలు అన్నంతగా భక్తులు తమ మదిలో మాటను ఇలా తలుచుకునే రీతిలో ఉత్సవాలు జరుగుతుంటాయి.
తిరుమలలో ఏడాదికి ఒకసారి జరిగే సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకొన్ని ప్రధానమైనవి ఉన్నాయి.
నిత్య బ్రహ్మోత్సవాలు : తిరుమలలో ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో, ఆ నక్షత్రం ప్రామాణికంగా తీసుకొని నిత్య బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు.
శాంతి బ్రహ్మోత్సవం : తిరుమలలో శాంతిబ్రహ్మోత్సవాల కూడా నిర్వహిస్తారు. అంటే దేశంలో కరువు కాటకాలు, ప్రమాదాలు ఎక్కువ జరిగినప్పుడు, దీర్ఘకాలిక వ్యాధులతో జనం బాధపడే సమయంలో పాటు వర్షం కోసం కూడా బ్రహ్మోత్సవాలు యాగాలు యజ్ఞాలు నిర్వహించడం ఓ సాంప్రదాయం. శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రలో చాలామంది రాజులు దేశం ప్రాంతం ప్రజల హితం కోసం ఐదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు కూడా ఉన్నాయని చెబుతారు. తిరుమలతో పాటు అలిపిరిలో కూడా యాగాలు నిర్వహించారు. అలాగే పాపావినాశానికి వెళ్లే మార్గంలోని పార్వేటిమండపం వద్ద కూడా యాగాలు నిర్వహించారు.
శ్రద్ధా బ్రహ్మోత్సవం : శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఇలాంటి శ్రద్ధ బ్రహ్మోత్సవాలను " ఆర్జిత బ్రహ్మోత్సవాలు" గా చెబుతారు. ఎవరైనా భక్తుడు, తిరుమల దేవస్థానంలో టికెట్ తీసుకుని దైవ సన్నిధిలో సమర్పించడం ద్వారా భక్తిశ్రద్ధలతో జరిపించుకునేదే శ్రద్ధా బ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు.
ఒకరోజు బ్రహ్మోత్సవం: తిరుమల శ్రీవారి ఆలయంలో ఒకరోజు బ్రహ్మోత్సవం కూడా నిర్వహిస్తారు. అది రథసప్తమి రోజు అంటే సూర్య భగవానుడి జన్మదినం రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఉదయం సాయంత్రం వేరు వేరు వాహనాలలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. కానీ,
రథసప్తమి రోజు మాత్రం సూర్యాస్తమయానికి ముందు నుంచే వాహన సేవలు ప్రారంభమవుతాయి. సూర్యుడు ఉదయించే సమయానికి సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఉభయ దేవరులతో పల్లకిని అధిరోహించి తిరుమల మాడవీధుల్లో విహరిస్తారు. ఆ తర్వాత చిన్న శేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు. చక్రస్థానం నిర్వహించిన తర్వాత స్వామివారిని కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలపై ఊరేగించడం ద్వారా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. సత్తా స్వరాలు, సప్తమి నాటి సప్త వారాలకు సంకేతంగా సూర్యుడు పుట్టినరోజు సందర్భంగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. అంటే బ్రహ్మోత్సవాలలో పది రోజులు స్వామి వారు ఎన్ని వాహనాల్లో విహరిస్తారు ఒకేరోజు అంటే రథసప్తమి నాడు అన్ని వాహనాలపై తిరుమలలో స్వామివారిని ఊరేగింపు జరుగుతుంది. ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తిరుమల కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోంది.
2024: బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు (అక్టోబర్ 8) రాత్రి తిరుమలలో గరుడ సేవ కనుల పండుగ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం తిలకించేందుకు ఇప్పటికే తీర్థజనంతో కొండ నిండింది. ఉదయం స్వామి వారి వాహనాన్ని దర్శించుకుని భక్తులు తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీలు స్థలాలు చూసుకుని కూర్చుండిపోయారు. సగం రాత్రి వరకు భక్తులు ఎక్కడికక్కడ అలాగే కూర్చుని గరుడ వాహనం పై వచ్చే స్వామిని చూసి తరించాలని ఈ నిరీక్షిస్తున్నారు. ఆ ఉత్సవం ఎలా జరుగుతుందనేది రాత్రి వరకు వేచి చూడాలి.
Next Story