తిరుమల: చరిత్రలో  అరుదైన రికార్డు..?
x

తిరుమల: చరిత్రలో అరుదైన రికార్డు..?

కూటమి మధ్య కుదరని సమన్వయం టీటీడీపై ప్రభావం చూపిందా? బోర్డు లేదు. స్పెసిఫైడ్ లేక ఓ రికార్డు నమోదైందా? సీఎం దిక్కుతోచని స్థితిలో ఉండడమే కారణమని ఓ నేత అన్నారు.


దేవుడంటే భక్తి , భయం, విశ్వాసం ఉందనే మాట చెప్పడంలో టీడీపీ కూటమి నేతలు ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు. దేవదేవుని పాలనా వ్యవహారాలు పర్యవేక్షించడం, పాలనాపర నిర్ణయాలు తీసుకోవడానికి సమయం లేదన్నట్టు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల క్రీనీడలో కూటమి మధ్య సమన్వయం కుదరడం లేదు. ఇది కాస్త తిరుమలపై ప్రభావం పడడంతో అరుదైన రికార్డు నమోదైంది.


ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో తిరుమల ద్వితీయ స్థానంలో ఉండేది. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉంటుంది. రోజువారి ఆదాయం రూ. మూడున్నర నుంచి నాలుగు కోట్లకు పైబడే హుండీ కానుకల ద్వారా ఆదాయం ఉంటుంది. దీనివల్ల తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం సంపన్న కేంద్రంగా చరిత్రతో నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుమల ప్రధానంగా టీటీడీ చరిత్రలో బ్రహ్మోత్సవాలు -2024 అధికారుల పర్యవేక్షణలో సాగుతోంది. శ్రీవారి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే టీటీడీ బోర్డు నియామకం జరగలేదు. స్పసిఫైడ్ అథారిటీ కూడా ఏర్పాటు చేయలేదు.

దిక్కుతోచని స్థితిలోనే..
తిరుమల లడ్డు వ్యవహారంలో చేసుకున్న పరిణామాల వల్ల సీఎం చంద్రబాబు దిక్కుతోనే స్థితిలో ఉన్నారని సీపీఎం రాష్ట్ర నేత కందాపు మురళి అభిప్రాయపడ్డారు. "సమస్యలపై చర్చించడం. నిర్ణయాలు తీసుకోవడానికి టీటీడీ పాలకమండలి బాధ్యత. బోర్డు ఏర్పాటులో తాత్సారం చేయడం సమంజసం కాదు" అని మురళి అన్నారు." టీటీడీ బోర్డు ఉండడం వల్ల జవాబుదారీతనం. పనుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది. దీనిని విస్మరించినట్లు వ్యవహరిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఎన్నికల నాటి ప్రాధమ్యాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా కందారపు మురళి సీఎం చంద్రబాబుకు సూచించారు. టీటీడీ బోర్డు లేకున్నా, ఆ స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ఉండేది. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన దాఖలాలు లేవు అని అన్నారు.
ఇదే మొదటి సారి..?

టీటీడీ పాలకమండలి లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న తీరు చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని కూడా తెలుస్తోంది. రూ.5,100 వార్షిక బడ్జెట్ తో చిన్న రాష్ట్రాన్ని పోలిన స్థాయిలో ఆధ్యాత్మిక, ధార్మిక, విద్య, వైద్యం వంటి కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుంది. ఎంతటి ప్రాధాన్యత కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి కూటమినేతల మధ్య సమన్వయం కుదరలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేయడానికి వారికి సమయం చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో..
రాష్ట్రంలో సీఎం ఎన్ చంద్రబాబు సారధ్యంలో కొలువుతీరిన టిడిపి కూటమి పాలనాపగ్గాలు చేపట్టి వంద రోజులు దాటిపోయింది. "మంచి ప్రభుత్వం కార్యక్రమం పేరిట టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను జనంలోకి వెళ్ళాలి" అని సీఎం చంద్రబాబు సూచించడం, ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
చిన్న రాష్ట్రాన్ని తలపించే టీటీడీ బోర్డు నియామకంలో తాత్సారం చేయడం కూడా పదువులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ పెంచుతోంది.

2024: జూన్ 12: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. అదే రోజు రాత్రి కుటుంబ సమేతంగా సీఎం అండ్ చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు.
జూన్ 13: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత, మీడియాతో మాట్లాడారు."పరిపాలన వ్యవహారాల ప్రక్షాళన తిరుమల నుంచే శ్రీకారం చుడుతా"అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రోజుల వ్యవధిలోనే ఆదేశాలు జారీ చేయడంతో..
జూన్ 17: టీటీడీ ఈఓ గా సీనియర్ ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు.
జూలై 28: తిరుమల అదనపు ఈవోగా సిహెచ్ వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కేంద్ర సర్వీసులు నుంచి డిప్యూటేషన్ పి తీసుకువచ్చి నియమించారు. ఇంతవరకు బాగానే ఉంది.. కాస్త వెనక్కి వెళ్దాం...
2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్సిపీ అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి నియమితులయ్యారు. రెండేళ్ల ఆయన పదవీకాలం పూర్తి కాగానే, చాలామంది ఔత్సాహికులు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. చైర్మన్ ఎంపిక చేయడంలో జరిగిన కొద్దిరోజుల గ్యాప్ భర్తీ చేయడానికి మాజీ సీఎం వైఎస్. జగన్ టీటీడీ పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షణ కోసం "స్పెసిఫైడ్ అథారిటీ" నియమించారు. ఆ తర్వాత రెండోసారి కూడా వైవి సుబ్బారెడ్డికే చైర్మన్ పోస్టు ఇవ్వడంతో అథారిటీ రద్దయింది. తిరుమల చరిత్రలో ఈ తరహా స్పెసిఫైడ్ అథారిటీ నియమించడం ఏడోసారి..
విషయంలోకి వస్తే...
టీటీడీకి పాలకమండలి లేకుండా వ్యవహారసాగడం ఇదే మొదటిసారి. అదే సమయంలో స్పెసిఫైడ్ అథారిటీ కూడా లేకపోవడం కూడా గమనార్హం.
టీటీడీ పాలనా వ్యవహారాలు ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ధార్మిక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దేశంలో అనేక చోట్ల ఇంజినీరింగ్ పనులతో పాటు, శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. రూ. 5,100 కోట్ల అంచనా బడ్జెట్ తో రూపొందించే పనులు, కార్యక్రమాలను అమలు చేయడానికి వీలుగా నిర్ణయాలు చేసేందుకు ఒక చైర్మన్, 25 మందికి తగ్గకుండా పాలకమండలి సభ్యులను నియమిస్తారు. ఇందులో రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంత సభ్యులు ఉంటారు. ముంబై తోపాటు ఉత్తరాది రాష్ట్రాల వారికి కూడా ఇటీవల కాలంలో ప్రాధాన్య తీయడం పెరిగింది. వారిలో కొందరు ఎక్స్ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( తుడా) చైర్మన్ కూడా ఓటింగ్ అర్హత లేని సభ్యులుగా ఉంటారు.

రాష్ట్ర క్యాబినెట్ తరహాలోనే టీటీడీ బోర్డు సభ్యులు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ మేరకు టీటీడీ నిధులు విడుదల చేస్తుంది. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం, పారదర్శకంగా స్వామివారి సొమ్మును వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చర్య. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి టీటీడీ బోర్డు నియామకంలో జాప్యం జరగడానికి వెనుక బలమైన కారణం లేకపోలేదు.
గత నెలలో సీఎం ఎన్. చంద్రబాబు తిరుమల లడ్డుకు అపచారం జరిగిందని విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా తీవ్ర చర్చకు, రాజకీయ వివాదాలకు తెర తీశారు. దీంతో దేశవ్యాప్తంగా దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఫిర్యాదులు అందుకున్న సుప్రీంకోర్టు కూడా విచారణ కమిటీని నియమించడం తెలిసింది. దీనికి తోడు..
టీడీపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసే, బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఈ పరిస్థితుల్లో టీటీడీ బోర్డు కూర్పు అనేది సీఎం చంద్రబాబుకు ఓ పరీక్షలా మారినట్లు చెబుతున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయం కుదరని నేపథ్యంలోనే తాత్సారం జరుగుతోందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
"చంద్రబాబుకు టీటీడీ బోర్డు వేయాలని ఉత్సాహం ఉంది. పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. వారి మధ్య సమన్వయం లేదు. లడ్డుపై వివాదం మరింత అగ్గి రాజేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జాప్యం జరగడానికి దారి తీసి ఉంటుంది అని సిపిఎం నేత కందారపు మురళి విశ్లేషించారు. ఇదిలా ఉంటే..
స్పెసిఫైడ్ అథారిటీ అంటే..
టీటీడీ పాలకమండలి నియామకంలో జాప్యం జరిగితే, ఆ స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ నియమిస్తారు. అంటే రాజకీయ ప్రతినిధుల స్థానంలో అధికారులతో కమిటీ ఏర్పడుతుంది. టీటీడీ పాలకమండలి కాలపరిమితి ముగిసినా, ప్రభుత్వం పాలకవర్గాన్ని రద్దు చేసినప్పుడు , బోర్డు నియామకంలో జాప్యం జరిగినప్పుడు స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సారధ్యంలో టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో లేదా తిరుమల జేఈవో సభ్యులుగా కమిటీని నియమిస్తారు. ప్రస్తుతం ఆ కమిటీ కూడా లేదు.
వాస్తవానికి స్పెసిఫైడ్ అథారిటీ ఉండాలని నిబంధన కూడా లేదని చెబుతున్నారు. కార్యక్రమాల నిర్వహణ, నిధుల వినియోగంలో పారదర్శకత కోసమే ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయని టీటీడీ వ్యవహారాలను దగ్గరగా తెలిసిన వారు చెప్పే మాట.
స్పెసిఫైడ్ ఎన్నిసార్లు నియమించారు
టీటీడీ పాలకమండలి నియామకంలో జరిగిన జాప్యం కారణంగా ఇప్పటివరకు ఏడుసార్లు స్పెసిఫైడ్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో ..
మొదటిసారి 1995 ఎస్ పైడ్ అథారిటీ నియమించారు. 1999- 2002 ఆ తర్వాత , 2010-11 ఒకసారి ఏర్పాటు చేశారు. చివరగా.. 2014- 15 సంవత్సరాల మధ్యలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసిన విషయం ప్రస్తావనార్హం.
2019: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జూన్ 22న వైవీ. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా నియమితులయ్యారు. రెండేళ్ల ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఔత్సాహికుల పోటీ ఎక్కువగా ఉండడంతో టీటీడీ చరిత్రలో ఏడవసారి ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి చైర్మన్గా, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిని కన్వీనర్ గా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
2024: టీడీపీ కూటమి ఏర్పడి వంద రోజులు పైబడినా రాజకీయ పరిస్థితులు, కూటమి నేతల మధ్య కుదరని పొంతన వల్ల బోర్డు ఏర్పాటులో జాప్యానికి కారణంగా మారింది.
" పాలకమండలి లేకుండా అధికారుల సారధ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవ జరగడం మంచిదే. స్వామివారి ఉత్సవాలకి ఎలాంటి లోటు ఉండదు. రాజకీయ ఒత్తిళ్లు అసలే కనిపించవు. వాహన సేవల ముందు కూడా తొక్కిసలాట ఉండదు. సామాన్యులకు మంచి దర్శనం దొరుకుతుంది" అని తిరుమల వ్యవహారాలపై దశాబ్దాలుగా పరిశీలిస్తున్న ఓ సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.
ఏది ఏమైనా టీడీడీ బోర్డు లేకపోవడం ఓ కొరతే. దీనిపై చర్చ జరగడానికి ప్రధాన కారణం, చైర్మన్ పోస్టు, పాలకమండలి సభ్యుల వ్యవహారం పై 20 ఏళ్ల కిందటి నుంచే హైప్ క్రియేట్ చేశారు. అని కూడా కొందరు చెబుతున్నారు.
టీడీపీ కూటమి నేతల మధ్య అవగాహన ఎప్పుడు కుదురుతుందో? ఔత్సాహికుల కల ఎప్పుడు నెరవేరుతుందనేది సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆరోజు ఎప్పుడు అనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story