తిరుమలలో శ్రీవారికి ఆ సేవలు రద్దు
x

తిరుమలలో శ్రీవారికి ఆ సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులు ఆర్జితసేవలు ఉండవు. ప్రత్యేక కారణాల రీత్యా ఈ సేవలు రద్దు చేశారు.


తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యం సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. టికెట్ బుక్ చేసుకున్న యాత్రికులను ఈ సేవా కార్యక్రమాలకు అనుమతిస్తుంటారు. ఏడాదిలో కొన్ని రోజులు ఆ సేవా కార్యక్రమాలను రద్దు చేయడం ఆనవాయితీ. అందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి.

ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉదయాస్తమాన సేవల్లో కొన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీ తిరుప్పావడ సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
ఆ మూడు రోజులపాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమాలు ఎందుకు
శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా శ్రీవేంకటేశ్వర స్వామి వారికి నిత్యం ప్రతిరోజు అర్చనలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చే యాత్రికులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తిరుమల ఆలయం, భక్తులను కటాక్షించే స్వామివారికి యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా మూడు రోజులపాటు ప్రత్యేక సేవా కార్యక్రమాలను రద్దుచేసి, కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Read More
Next Story