పల్లె ముచ్చట్లకు నిలయం.. చరిత్రకు సాక్ష్యం...
x

పల్లె ముచ్చట్లకు నిలయం.. చరిత్రకు సాక్ష్యం...

ఈ పచ్చారిచెట్టు బతుకుపాఠాలు నేర్పిందంటున్న వారి మాటలు ఇవి...


ఇంటికి ఒక ఆవు. వీధికి ఓ చెట్టు. ఊరికి ఒక చెరువు. ఇది పల్లె జీవనానికి పట్టుగొమ్మ. ప్రతి ఊరి వెనుక ఒక కథ ఉంటుంది. అలాంటి కథే ఇదీనూ.. చిత్తూరు జిల్లా పడమటి తాలూకాలో కరువు తాండవించిన వేళ బతుకు చిత్రానికి అద్దం పట్టిన ఈ చెట్టు కథేంటో ఓసారి చదవండి..

హలో... ఏమప్పా యాడుండావు. చెట్టు కింద ఉండా సామీ. ఏమప్పా పొద్దటి నుంచి ఈడనే ఉండావు. మా వాడు కోసం చూస్తాండబ్బా. ఏ యాలకైనా వస్తాడని చూస్తా ఉండా. ఏంబ్బా రాజకీయం ఎలా ఉండాది! ఈసారి మా పార్టీ గ్యారెంటీ. ఏంది యా మాట్లాడతావు. ఈసారి ఆ వ్యక్తి గెలుస్తాడబ్బా. తంబళ్లపల్లి సంగతి ఏంది బా. యో.. పీలేరు గురించి చెప్పుయ్యా. అవును పుంగనూరు కూడా అట్లా ఉండదంట కదా. లేదులే చిత్తూరులో పరిస్థితి వేరుగా ఉంది. ఇంతకీ సీఎం ఎవరుకో. ముందు మీ పార్టీ గెలనీయబ్బా. ఇలాంటి ముచ్చట్లకు ఈ పచ్చారి చెట్టు సాక్ష్యం.
మదనపల్లెకు ల్యాండ్ మార్క్ టౌన్ బ్యాంకు సర్కిల్ లో ఉన్న పచ్చారిచెట్టు. ఎందరికో జీవిత పాఠాలు నేర్పించింది. చరిత్రలో ఎన్నో సంఘటనలకు ఇది మూగ సాక్షిగా దాదాపు 150 ఏళ్లుగా నిలిచి ఉంది.

మదనపల్లె డివిజన్లోనే కాదు. రాష్ట్ర రాజకీయ మొత్తం ఇక్కడ కనిపించేది. వినిపించేది. ఇప్పటికీ అదే పరిస్థితి. మదనపల్లెను వరదలు ముంచెత్తినప్పుడు ఈ చెట్టు ఇచ్చిన ఆసరాతో చాలామంది ప్రాణాలు నిలిచాయి. వరదలో వాహనాల కొట్టుకుపోకుండా ఆపగలిగింది. చరిత్రను గాలి ఊసులతో ఆలకించిన ఈ పచ్చని చెట్టు ఎన్నో సంఘటనలకు, జీవితాలకు బాట చూపించింది అని చెప్పడంలో సందేహం లేదు. దీనిపై స్థానికులు ఏమంటున్నారో వాటి మాటల్లోనే వినండి.

చరిత్రపుటల్లో
మదనపల్లె అనగానే మనకు గుర్తుకు వచ్చేది హార్స్లీ హిల్స్. క్షయ వ్యాధి నివారణలో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (Arogyavaram medical centre) ప్రధానమైంది. దీనికి టీబి శానిటోరియం అని పేరు కూడా పేరు.. ఆ తర్వాత బీటీ కాలేజీ, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
( Jiddu Krishnamurti ) పుట్టిన ప్రదేశంగా, జాతీయగీతం సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకు వస్తారు. వీటి కంటే ముందు విదేశీ వనిత ఐరిష్ మహిళ అనిబిసెంట్ చరిత్ర పుటల్లో నిలిచిన వ్యక్తులు.
మదనపల్లె చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పచ్చారిచెట్టు అనేది జనానికి నీడ ఇస్తోంది. ఎంతటి వారైనా చెట్టు నీడ కిందికి రావాల్సిందే. అందులో జమిందార్ల వంశానికి చెందిన వారైనా, రాజకీయ నేతలైనా.
మాజీ ఎమ్మెల్యే ఆవుల మోహన్ రెడ్డి, గంగారపు వెంకట నారాయణరెడ్డి, రాటకొండ కృష్ణసాగర్ రెడ్డి, దొమ్మలపాటి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బి నరేష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వాయల్పాడు ప్రాంతానికి చెందిన నల్లారి అమర్నాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీఫ్ హుస్సేన్ లాంటి వారు మచ్చుకు కొందరు మాత్రమే.
ఎంతటి ప్రముఖులైనా సరే. పార్టీలు ఏవైనా కానీ, జనాల్ని చూసి, అభిమానులు కనిపించగానే. ఈ చెట్టు కింద నిలిచేవారు.
టీ రుచి చూస్తూ..
ఈ పచ్చారిచెట్టు కింద ఇప్పటికి టీ దుకాణం ఉంది. దీని పక్కనే ఉన్న పాన్ డబ్బాలో కూర్చునే షేక్ మొహమ్మద్ రఫీ అనే వ్యక్తి అందరినీ పరికించేవాడు. మంచి టీ తయారు చేయడం ఆయనకు అలవాటు. వీళ్ళ నాన్న కూడా ఇక్కడ చెట్టు కింద దుకాణం నిర్వహించిన వ్యక్తి.
ఈ పచ్చారిచెట్టు ఎన్నో సంఘటనలు, రాజకీయాలు, విడిపోయిన వ్యక్తులను కలుసుకునేందుకు, కొందరి యువకులకు బతుకు పాఠాలు నేర్పడానికి నీడ ఇచ్చింది. ఇప్పటికీ శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ పచ్చారిచెట్టు అందరిని ఆదరిస్తూనే ఉంది.
Read More
Next Story