Prewedding| ప్రివెడ్డింగ్ షూట్వద్దు అని వైశ్యుల పట్టు, కారణం ఏమిటి?
x

Prewedding| 'ప్రివెడ్డింగ్ షూట్'వద్దు అని వైశ్యుల పట్టు, కారణం ఏమిటి?

వివాహాలు సంప్రదాయబద్ధంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ బలపడాలి. ఇందుకోసం ప్రొద్దుటూరు ఆర్యవైశ్య మహాసభ తీర్మానం వెనుక బలమైన కారణం ఉందంటున్నారు.


వివాహ బంధం అనేది వధువు, వరుడు. వారి కుటుంబ గౌరవానికి సంబంధించింది. తల్లిదండ్రులు చూసిన సంబంధాలను పెద్ద మనుషుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకునేవారు. మారుతున్న కాలంలో ఈ వ్యవహారం పూర్తిగా గాడి తప్పంది. నిశ్ఛితార్థం, అంతకుముందు 'ప్రివెడ్డింగ్ షూట్' (Prewedding) వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అని ఆర్యవైశ్య మహాసభ భావించింది. ప్రొద్దుటూరు పట్టణంలో దీనికి దూరంగా ఉండాలని వారి సంఘంలో నియమం పెట్టుకున్నారు. ఈ నిర్ఱయం మిగతా ప్రాంతాలకు ప్రొద్దులూరు ఆర్యవైశ్య సంఘం ఆదర్శంగా నిలిచిందనడంలో సందేహం లేదు.

"రెండు కుటంబాల గౌరవం కాపాడడం. అనవసర ఖర్చు తగ్గించడం. గత అనుభవాలు నేర్పిన పాఠాల వల్ల యువతీ జీవితానికి రక్షణ ఇవ్వాలి" అనే ప్రధాన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్యవైశ్య మహాసభ కడప జిల్లా ప్రొద్దుటూరు శాఖ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ శెట్టి చెబుతున్నారు.
పెళ్లి నిశ్ఛయమైన తరువాత 'ప్రివెడ్డింగ్ షూట్' పేరిట కాబేయే దంపతులను చిత్రీకరించడంలో అశ్లీలత, అసభ్యకరమైన విన్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. ఫొటోగ్రాఫర్లు చెప్పినట్లు చేయడం ద్వారా వధూవరుల ముద్దూముచ్చట బహిరంగం కావడం వల్ల కుటుంబ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కోసం వాడడం వల్ల కూడా ఇబ్బందికర ఎదురైన ఇబ్బందులు కూడా ఉన్నాయి.
ఆ సమయంలో కాబోయే దంపతులు కౌగిలింతలు, లిప్ లాక్ వంటి సన్నివేశాలు మితిమీరుతున్నాయి. సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రొమాంటిక్ సన్నివేశాలను కాబోయే దంపతులతో 'ప్రివెడ్డింగ్ షూట్' పేరిట బహిరంగ ప్రదేశాలు, నిశ్చితార్థం సమయంలో తీస్తున్న ఫొటొలు, వీడియాలతో కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి.
"వాటి నుంచి నేర్చుకున్న అనుభవాల పాఠాల వల్లే ప్రీవెడ్డింగ్ షూట్ చేయకూడదని సంఘంలో నిర్ణయం తీసుకున్నాం" బుశెట్టి రామ్మోహన్ శెట్టి చెబుతున్నారు. నిశ్చితార్ధం, తరువాత ప్రీవెడ్డింగ్ షూట్ తరువాత వరుడు అనుకోకుండా చనిపోయాడు. ఆ వధువు పరిస్థితి ఏమిటి? "ఈ సంఘటనలో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది" దీనిని ఇప్పటికీ మరిచిపోలేని ఘటన అని బుశెట్టి రామ్మోహన్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు. ఈ సంఘనను వివరిస్తూ, ఆయన తీవ్ర కలత చెందారు.
వైశ్యుల్లో అంతా సంపన్నులే లేరు. అన్నివర్గాల్లో ఉన్నట్లే వారిలోనూ పేదలు ఉన్నారు. కాస్త స్ధితిమంతులు హంగూ ఆర్భాటాలతో వివాహాలు జరిపిస్తారు. వీటిని చూసే, తమ వారి పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా సంఘంలో చర్చకు తీసుకుని వచ్చామని బుశెట్టి రామ్మోహన్ తెలిపారు. గతంలో
పెళ్లిపెద్ద ఇచ్చే సమాచారం. లేదా, తెలిసిన వారి ద్వారా యువతి ఇంటికి పెద్దమనుషులతో వెళ్లి, సంబంధాలు కుదిర్చేవారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు పరస్పరం నచ్చడం, వారి తల్లిదండ్రుల మధ్య అభిప్రాయాలు పంచుకునే వారు. రెండు కుటుంబాల నుంచి సరే అనుకుంటే, అమ్మాయికి ఓ నగ కానుకగా సమర్పించి, నిశ్చితార్ధం చేసుకునే వారు. తరువాత మంచి రోజు ముహూర్తం నిర్ణయించి, ఆ శుభ ఘడియల్లో పెళ్లితంతు నిర్వహించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ప్రీవెడ్డింగ్ ఖర్చు రూ. లక్షల్లోనే..
సంబంధం కుదిరిన తరువాత నిశ్ఛితార్థానికి ఓ హంగామా. దీనికి కనీసంగా రూ.60 వేలు. ఆ తరువాత ప్రీవెడ్డింగ్ షూట్ దీనికి తక్కువలో తీయించుకున్నా లక్ష నుంచి 1.5 లక్షలు, పెళ్లికి భారీ కెమెరాలు, లైవ్, డ్రోన్ వాడితో తక్కువ అంటే రెండు లక్షల నుంచి 2.5 లక్షల వరకు అవుతుంది. నిర్ణయించిన ముహూర్తం వేళ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో చిత్రీకరణ. ఇవన్నీ ప్యాకేజీ కింద మాట్లాడుకుంటే తక్కువలో తక్కువగా రూ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
తిరుపతికి చెందిన ఓ ఫొటో వీడియా గ్రాఫర్ మాట్లాడుతూ, "పెళ్లి కార్యక్రమం సినిమా ట్రిక్ వీడియో గ్రఫీ, డ్రోన్, పెద్ద కెమెరాలు, లైవ్ షూట్ చేయాలంటే కనీసంగా రూ. నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది" అని చెప్పారు. ఇంతటి భారీ స్థాయిలో కాస్త స్ధితిమంతులే చేయగలరు. ఖర్చు కూడా భరిస్తారనేది ఆయన మాట. "స్థానిక వీడియో గ్రాఫర్లకంటే బెంగళూరు, చెన్నై, నెల్లూరు ప్రాంతాల వారికి ప్యాకేజీ ఇస్తున్నారు" అని వివరించారు.
అందులో కూడా ప్రీవెడ్డింగ్ షూట్ కు కెమెరామన్, అసిస్టెంట్, నలుగురు ఉంటారు. వధువు వెంట ఇద్దరు. వరుడి వెంట ఒకరు. ఇలా అందరికీ కలిసి నిర్దిష్ట ఆరుబయట ప్రదేశంలో షూట్ చేయాలంటే వాహనం పెళ్లివారు భరిస్తే, ఒక ధర. వీడియో గ్రాఫర్ తన సిబ్బంది, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తరలించుకోవడానికి సొంత వాహనం సమకూర్చకుంటే మరో రేటు ఉంటుంది. దీనివల్ల ప్యాకేజీ ఖర్చు మారిపోతుందనేది ఆ వీడియో గ్రాఫర్ చెబుతున్న వివరాలు. ఇదిలా ఉంటే..
పెళ్లిలో కూడా హంగామా...
వివాహం జరిగే సమయంలో వీడియో షూటింగ్ కీలకపాత్ర పోషిస్తుంది. కల్యాణ మండపంపై వివాహ తంతు జరిగే సమయంల వధువు ఎప్పుడు ఎలాంటి ఎక్స్ప్రేషన్ ఇవ్వాలి. హావభావాలు వీడియో, ఫోటో గ్రాఫర్ చెబుతారు. అదేవిధంగా వరుడికి కూడా. ఆ విధంగానే తమ పెళ్లితంతును ఆ వధూవరులు మళ్లీ చూసుకుని మురిసిపోయేలా చిత్రీకరణ చేయడంలో ఫొటో గ్రాఫర్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మొదడుకు బాగా పనిచెబుతుంటారు ఇందులో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీనివల్ల ఏమైంతోందంటే..
గాడి తప్పుతోంది...
హిందూ సంప్రదాయంలో వివాహ ఘట్టం అత్యంత ప్రధానమైందనేది ఆర్యవైశ్య మహాసభ ప్రొద్దుటూరు శాఖ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ అభిప్రాయం. మాంగళ్యధారణ, అంతకుముందు వధూవరులకు అడ్డంగా తెల్లటివస్త్రం అడ్డుగా ఉంచే పురోహితుడు వారిద్దరికి చెప్పే మాటలు ప్రధానమైనవి. "వైవాహిక జీవితం, దాని కట్టుబాట్లు, కుటుంబవ్యవస్థ ను వివరించే మాటలు వధూవరులు ఆలకించలేని పరిస్థితి ఏర్పడుతోంది" అని బుశెట్టి రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. వీడియో గ్రాఫర్లు చెప్పినట్లే చేయడం మినహా కాబోయే దంపతులు పురోహితుడి మాటలు చెవికి వేసుకోని పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన వివరించారు.
సమస్యలు వచ్చాయనే...
ప్రీవెడ్డింగ్ షూట్ వల్ల జరిగిన అనర్ధాలపై కొన్ని లేఖలు వచ్చాయి. సమస్యలు కూడా వచ్చాయని బుశెట్టి రామ్మోహన్ గుర్తు చేశారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని, పరిశీలించిన తరువాతే ప్రొద్దుటూరు పట్టణ ఆర్యవైశ్య మహాసభలో చర్చించామని ఆయన తెలిపారు. ఆ మేరకు "ఆర్యవైశ్యులు ప్రీవెడ్డింగ్ షూట్ కు దూరంగా ఉండాలి" అని తీర్మానించామన్నారు. ఆయన చెప్పిన సంఘటనలు ఇవి.
1. అనంతపురం జిల్లాకు చెందిన అమ్మాయి. ప్రొద్దుటూరుకు చెందిన యువకుడికి నిశ్ఛాతార్ధం జరిగింది. వారి కుటుంబాల సమ్మతితో ప్రీవెడ్డింగ్ షూట్ చేయించుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆ అమ్మాయితో వివాహం వద్దని నిర్ణయించుకున్నారు. దీంతో అనంతపురం నుంచి ఆ యువతి తల్లదండ్రులు అక్కడి సంఘం ప్రతినిధులతో కలిసి ప్రొద్దుటూరుకు వచ్చారు. అబ్బాయి తరఫు వాళ్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆ యువతి పరిస్థితి ఏమిటి?
2. ఇంకో సంఘటన నిశ్ఛితార్ధం జరిగింది. ప్రీవెడ్డింగ్ షూట్ జరిగింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ యువకుడు ప్రమాదంలో మరణించాడు. ఈ పరిస్థితిలో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
3. సంఘం పెద్దగా నన్ను ఓ కుటుంబం వివాహానికి ఆహ్వానించారు. కానీ, అప్పటికే తాము విధించుకున్న తీర్మానానికి విరుద్దంగా ప్రీవెడ్డంగ్ షూట్ చేయించారని నాకు తెలుసు. అందువల్ల నేను పెళ్లికి రాలేను. వస్తే, మన తీర్మానానికి వ్యతిరేకించిన వాడిని కాబట్టే రాలేనని చెప్పాను.

అంటే ఇక్కడ జరుగుతున్న అనర్ధాలను మాత్రమే అధ్యయనం చేశాం. ఆ తరువాత సంఘంలోని కుటుంబాలు, వారి పిల్లల గౌరవం, సనాధన ధర్మం, వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని కాపాడాలని మాత్రమే నిర్ణయాలు తీసుకున్నట్లు బుశెట్టి చెబుతున్నారు. "నేను ఆలయ కర్తను మాత్రమే కాదు. పద్ధతులు చెప్పే ధర్మం కూడా నాపై ఉంది" అని తన బాధ్యతలను కూడా గుర్తు చేసుకున్నారు.
వివాహ సమయంలోనూ ఆడంబరంగా ఆహార పదార్థాలు వృథా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పగలైతే, కొన్ని సంస్థలకు పంపించడానికి వీలుంటుంది. రాత్రిళ్లు జరిగే కార్యక్రమాల వల్ల రూ. లక్షలు పోసి తయారు చేసే వంటకాలు పారేయాల్సి వస్తోంది. వీటన్నింటిని మా సంఘంలో సుదీర్ఘంగా చర్చించాం. అనవసరమైన ఖర్చు తగ్గించుకోవడానికి వీలుగా చైతన్యం చేస్తానని బెశెట్టి ధీమా వ్యక్తం చేశారు.
సంప్రదాయాలు కాపాడాలి...
వివాహ వ్యవస్థలో సంప్రదాయాలు మరుగున పడుతున్నాయని కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జింకా సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఆధునిక పద్దతుల్లో కొట్టుకుపోతూ, రూ. లక్షలు వృథా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిశ్ఛతార్ధానికి కనీసంగా రూ.1.5 లక్షలు వెచ్చిస్తున్నారు. "కల్యాణమండపానికి రూ. 50 వేల నుంచి లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇక భోజనాల కోసం కనీసం అంటే రూ. మూడు లక్షలకు తక్కువ కాదు. అందులోనూ మిగిలినవి పారేస్తున్నారు. ఈ ఆడంబరాలకు ఇస్తున్న ప్రాధాన్యం, సంప్రదాయాలకు ఇవ్వడం లేదు" అని జింకా సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.
"సోషల్ మీడియాలో చూడడం, సంబంధాలు కుదుర్చుకోవడం. లేదంటే సగం ప్రేమ వివాహాలు. ఆర్థిక సంబంధాలు కుదిర్చే సంబంధాలు మూడు నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి" అని జింకా వివరించారు. ఆరు నెలలు కూడా తిరగనే విడాకుల కోసం కోర్టులకు వెళుతున్నారు అని ఆయన తెలిపారు. "అందుకు నిదర్శనం బెంగళూరులో ఒకే ప్రదేశంలో మూడు కోర్టులు ఉన్నాయి" అని జింకా వివరించారు.
"మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. ఈ సంస్కృతి మంచిది కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో మనసులు అర్థం చేసుకుని పెళ్లిళ్లు జరిగే రోజులు రావాలి" అని జింకా ఆకాంక్షించారు.
ప్రస్తుత కొర్పొరేట్ యుగంలో యువకుడి ఆస్తిపాస్తులు చూస్తున్నారు. పెళ్లి తరువాత యువతి మినహా యువకుడి తల్లిదండ్రులను దగ్దర ఉండకూడదనే ఆంక్షలు విధించే విష సంస్కృతి పెరిగిందని ఆయన కలత చెందారు.


Read More
Next Story