TDP MLAS | ఆ ఊరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ప్రజావాణిలో ఏమి జరిగింది?
x

TDP MLA'S | ఆ ఊరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ప్రజావాణిలో ఏమి జరిగింది?

పక్కపక్క అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నికయ్యారు. సమస్యలపై ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు ప్రజావాణిలో విన్నవించిన ఆసక్తికర సన్నివేశం ఇది.


అనంతపురం జిల్లాలో ప్రజాసమస్యలు ఆలకించడానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజా వాణిని జిల్లా కేంద్రంతో పాటు శింగనమలలో కూడా నిర్వహించారు. ఇది సాధారణమే. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది.

అనంతపురం జిల్లాలోని శింగనమల రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి బండారు శ్రావణిశ్రీ మొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గంలోని అలంకరాయునిపేట గ్రామానికి చెందిన ఎంఎస్. రాజు కూడా పొరుగునే ఉన్న మడకశిర రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. కాగా, వారిద్దరు ప్రజలతో మమేకం కావడం, సమస్యలు తెలుసుకోవడంలో ఎవరికి ఎవరూ తీసిపోని విధంగా ప్రత్యేకత చాటుకుంటున్నారు.
ఆసక్తికర సన్నివేశం



అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు సోమవారం శింగనమలలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంపై ముందుగానే ప్రచారం చేయడం వల్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సమస్యలపై దరఖాస్తులు సమర్పించడానికి ప్రజలు హాజరయ్యారు. అదే సమయంలో..
మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్. రాజు కూడా సాధారణంగానే ప్రజలతో కలిసి వినతిపత్రం తీసుకుని వచ్చారు. దీంతో, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అధికారులు ఆశ్చర్యపోయారు. వారి మధ్య కూర్చోకుండా, సాధారణ ప్రజలతో కలిసే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్.రాజు తాను తీసుకుని వచ్చిన వినతిపత్రం శింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీకి అందించారు.
హూందాగా.. సామాన్యుడిలా..
అధికార టీడీపీ నుంచి గెలిచిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్. రాజు తనకు ఉన్న అధికారంతో శింగనమల నియోజకవర్గంలోని స్వగ్రామం అలంకరాయునిపేటలో సమస్యలు పరిష్కరించుకోవడానికి అధికారులపై ఒత్తిడి తీసుకుని రావచ్చు. తన అధికారాన్ని వినియోగించడానికి ఆస్కారం కూడా ఉంది. అలా చేయడం వల్ల సహచర ఎమ్మెల్యే శ్రావణిశ్రీని ధిక్కరించినట్లు అవుతుంది. ఆమెను అగౌరపరిచినట్లు ఉంటుందని భావించినట్లు కనిపిస్తోంది. పొరుగున ఉన్న నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, తమ ఊరికి కూడా ఎమ్మెల్యే అయిన శ్రావణిశ్రీ గైరవం, పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా హూందాగా వ్యవహరించారనే మాటలు వినిపించాయి.
అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ స్పందిస్తూ.." సొంత ఊరి అభివృద్ధికి ఎమ్మెల్యే అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక గ్రామస్తుడిలా గ్రీవెన్స్‌కు రావడం స్ఫూర్తిదాయకం" అని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఈ గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ వినోద కుమార్, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మడకశిర ఎమ్మెల్యే రాజుకు హామీ ఇచ్చారు.
సమస్యలు ఇవీ..
తమ స్వగ్రామం అలంకరాయునిపేటలో సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయని ఎమ్మెల్యే ఎంఎస్.రాజు గుర్తు చేశారు. వాటిని పరిష్కరించాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి ఆయన వినతిపత్రం ఇచ్చారు. అందులో..
అలంకరాయునిపేటలో సీసీరోడ్లు, మురుగుకాలువ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. అలంకరాయునిపేట నుంచి సలకం చెరువు వెళ్లేందుకు మధ్యలో వంక ప్రమాదకరంగా ఉంది. విద్యార్థులుఇబ్బంది పడుతున్నారు. అక్కడి వంకపై కల్వర్టు నిర్మించాలని కోరారు. గ్రామంలో బస్సు షెల్టర్ నిర్మించాలని, ఉపాధి హామీ పథకంలో ఉద్యానపార్కు ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని విన్నవించారు.
Read More
Next Story