
తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం
టీటీడీలో 60 ఇంజినీర్ల పోస్టుల భర్తీ..
పలమనేరు వద్దే దివ్యవృక్షాల ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని తీర్మానించామన్న టీటీడీ చైర్మన్ నాయుడు
సన్నిధిగొల్ల ఆచారానికి ప్రాధాన్యం
పోటులో కొత్త ఉద్యోగాల సృష్టి
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
డిగ్రీ కాలేజీ, హాస్టళ్లలో సీట్లు పెంపుదల
Also Read:పలమనేరులో టీటీడీ దివ్య వృక్షాల ప్రాజెక్ట్
టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో 60 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ విభాగం మరింత పటిష్టం చేయడానికి డైరెక్టు రిక్రూట్‌మెంట్ చేయడానికి టీటీడీ పాలక మండలి అనుమతి ఇస్తూ, తీర్మానం చేసింది. టిటిడి ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన బోర్డు సమావేశం మధ్యాహ్నం వరకు జరిగింది. అజెండాలోని 60 అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
"టీటీడీ ఇంజినీరింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయించాం" అని బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరితో పాటు బోర్డు సభ్యులు, జెఈఓ వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.
విద్యాసంస్థలు పటిష్టం
తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా విద్యా సంస్థలను కూడా నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు, అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదించినట్టు టీటీడీ చైర్మన్ నాయుడు వెల్లడించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయించారు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో ఆ పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో టీటీడీ ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో డే స్కాలర్లకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్యం
టీటీడీ ఆరోగ్య సేవలు కూడా అందిస్తోంది. చిన్నపిల్లలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వసతులో కూడిన ఆస్పత్రిని తిరుపతిలో నిర్వహిస్తోంది. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు.
కొత్త పోస్టులు సృష్టి
తిరుమల శ్రీవారి ప్రసాదాలు తీయారు చేసే పోటు (వంటశాల)లో నిబంధనల మేరకు నూతనంగా 18 పోటు సూపర్‌వైజర్ (పాచక) పోస్టులు భర్తీ చేయాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఈ పోస్టులు సృష్టించడానికి అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి, తిరుమలలో...
టీటీడీ తిరుపతిలో నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి, తిరుమలలో యాత్రికులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించే దిశగా కూడా మంగళవారం తిరుమలలో నిర్వహించిని పాలక మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వివరించారు.
"భక్తుల సౌకర్యార్థం కోసం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తాం. దీని నిర్మాణం, ప్లానింగ్ కోసం ఆర్కిటిక్ట్ నియమిస్తాం" అని చైర్మన్ నాయుడు చెప్పారు. ఆర్కిటెక్ట్ నియమించేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆమోదం తెలపామని ఆయన వివరించారు. తిరుమలలో దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన చెప్పారు.
తిరుమల, కాలిబాటలో ఉన్న పురాతన ప్రాశస్త్యం కలిగిన నిర్మాణాల పరిరక్షణకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి, అనుభవం కలిగిన అధికారుల నియామకానికి ఆమోదం.
ఆలయాల నిర్మాణం
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట మండలంలోని తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనుల్లో భాగంగా రెండవ దశలో పనులు చేపట్టడానికి రూ.14.10 కోట్లు మంజూరు చేస్తూ బోర్డులో ఆమోదం తెలిపారు. మొదటి దశలో ఇప్పటికే రూ.4 కోట్లు మంజూరు చేశారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కోసం వసతి సముదాయం నిర్మాణానికి నిర్ణయం.
రహదారులకు ఆళ్వార్ల పేర్లు
తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేశామరి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
"ఈ కమిటీలో జాతీయ సంస్తృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ డి.ప్రభాకర్ కృషమూర్తిలతో కమిటీ ఏర్పాటు చేశాం" అని చైర్మన్ నాయుడు వివరించారు.
సన్నిధి గొల్ల సాంప్రదాయానికి ప్రాధాన్యం
తిరుమల శ్రీవారి మొదటి దర్శనం దక్కేది యాదవ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే. ప్రస్తుతం తిరుమలలో ఇద్దరు అన్నదమ్ములు ఈ వందల సంవత్సరాల నాటి సంప్రదాయానికి వారసులుగా ఉన్నారు. శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టు ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం తెలిపినట్టు చైర్మన్ నాయుడు చెప్పారు.
వేతనాల పెంపుదలం
టీటీడీ అనుబంధ ఆలయాలలో పని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం.
అర్చకులకు రూ.25 వేల నుంచి 45 వేలు
పరిచారకులకు రూ.23,140 నుంచి 30 వేలు
పోటువర్కర్లకు రూ.24,279 నుంచి 30 వేలు
ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు రూ.23,640 నుంచి 30 వేల రూపాయలకు పెంచాలని టీటీడీ బోర్డులో తీర్మానించారు.
Next Story

