Gali Vs Nara | బళ్లారిలో మాయని సీమ ఫ్యాక్షన్ ప్రకంపనలు..
x

Gali Vs Nara | బళ్లారిలో మాయని సీమ ఫ్యాక్షన్ ప్రకంపనలు..

అక్కడి ఘర్షణలపై అనంతపురం, చిత్తూరులో ఎందుకు చర్చ జరుగుతోంది..?


రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ (Faction ) మూలాలు చెరిగిపోయాయి. వ్యవసాయం, విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగు కావడమే దీనికి కారణం. ఈ ప్రాంతం నుంచి వెళ్లి కర్ణాటక రాష్ట్ర బళ్లారిలో స్థిరపడిన వారిలో రెండు కుటుంబాల ఆధిపత్య పోరు అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

బళ్లారిలో కాంగ్రెస్ మాజీ నారా నారాయణరెడ్డి, బీజేపీ గంగావతి ఎమ్మెల్యే, ఇనుప గనుల వ్యాపార దిగ్గజంగా మారిన గాలి జనార్థనరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు వెనుక కథేమిటి? రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కానిస్టేబుల్ గాలి చెంగారెడ్డి కొడుకు, గాలి జనార్థనరెడ్డి నేపథ్యం ఏమిటి? 1999 ఎన్నికలు బీజేపీతో ఆయన జీవితం మలుపు తిరిగింది?
బళ్లారిలో పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై గురువారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ప్రతి కాల్పుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి సహచరుడు రాజశేఖర్ మరణించగా, అనుచరుడు సతీష్ రెడ్డి గాయపడిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బిజెపి నేత గాలి జనార్థనరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా కుటుంబాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు బుసలు కొట్టింది.
కారణం ఇదీ..
బళ్లారి నగరం దేవీనగర్ సమీపంలోని ఎస్పీ సర్కిల్ వద్ద ఈనెల మూడో తేదీ మూడు కోట్ల రూపాయల ఖర్చుతో వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు చేయించడానికి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పనులు పూర్తి చేశారు. ఈ సర్కిల్ కు సమీపంలోనే బిజెపి కార్యాలయం తోపాటు మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, ఆయన స్నేహితుడు మాజీ మంత్రి శ్రీరాములు నివాసాలు కూడా ఉన్నాయి.
"మా ప్రాంతంలో బ్యానర్లు కట్టవద్దు" అని మాజీ మంత్రి, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్థనరెడ్డి అనుచరులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అదే సమయంలో గంగావతి నుంచి కార్యక్రమాలు ముగించుకుని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చిన సమయంలో బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపారు. ఇందులో ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుడైన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఘటన స్థలానికి రావడంతో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. ఇటు కాంగ్రెస్, అటు బిజెపి మద్దతుదారులు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. "గతంలో ఎన్నడూ లేని విధంగా బళ్లారిలో ఉద్రిక్తత ఏర్పడింది" అని ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పారు.
"వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు చేయనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్థనరెడ్డి కుట్ర చేస్తున్నారు" అని బళ్లారి నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే గాలి భరత్ రెడ్డి ఆరోపించారు. తాజా సంఘటనలో బళ్ళారి నగరంలో శుక్రవారం ఉదయం నుంచి పోలీసులు 144 నిషేధాజ్ఞలు విధించారు. సమీప జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసులను రప్పించారు. పట్టణంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి రాజ్యం వెళుతున్నట్లు బళ్ళారి నగర సీనియర్ జర్నలిస్ట్ కనేకల్లు రవి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
బళ్లారి జిల్లా ఎలా అయిందంటే..
కర్ణాటక రాష్ట్రం ఈశాన్యంలో బళ్లారి జిల్లా ఉంది. 20201లో అధికారికంగా బళ్లారి జిల్లా నుంచి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేసే వరకు ఇది కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్దది. ఇనుప ఖనిజాలకు ఇది నిలయం. బళ్లారి జిల్లా గతంలో మద్రాసు ప్రెసిడెంట్ లో భాగంగా ఉండేది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటులో బళ్ళారి కర్ణాటక రాష్ట్రంలోని కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో భాగమైంది. 1882లో బళ్లారి జిల్లా నుంచి అనంతపురం జిల్లా ఏర్పాటయింది. 2021లో అధికారికంగా బళ్ళారి నుంచి విజయనగరం జిల్లా వేరు చేశారు.
బళ్లారిపై ఆధిపత్య పోరు..
బళ్లారి నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నారా భరత్ రెడ్డి, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే నారా నారాయణరెడ్డితో మూడు దశాబ్దాలుగా గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు సాగుతూనే ఉంది. వారందరిదీ రాయలసీమ ప్రాంతమే.
వైఎస్. రాజారెడ్డి సాన్నిహిత్యంతో
దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి వైఎస్. రాజారెడ్డికి బళ్ళారితో అనుబంధం ఉంది. వైఎస్ఆర్ మెడిసిన్ చదివింది కూడా బళ్లారిలోనే. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట ముగ్గురాళ్ళ గనుల నుంచి (బెరైటీస్)... బళ్లారిలో గనుల వ్యాపారులతో వైఎస్. రాజారెడ్డికి సత్సంబంధాలు ఉండేవి. ఈ పరిస్థితుల్లోనే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు ముందే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎం. హనుమాపురం నుంచి నారా సూర్యనారాయణరెడ్డి బళ్లారికి వెళ్లి స్థిరపడ్డారు. ఈయనకు వైఎస్ రాజారెడ్డి తో మంచి అనుబంధం ఉంది. సూర్యనారాయణ రెడ్డి బళ్లారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వీరికి వ్యవసాయంతో పాటు వ్యాపారాలు ప్రధానంగా గ్రానైట్ గనులు బళ్లారి లోనే కాకుండా ఒంగోలు, చీమకుర్తిలో కూడా వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం.
బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అతని తండ్రి సూరి నారాయణరెడ్డి కాలం నుంచి కూడా అంటే దాదాపు కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా గుర్తింపు, పట్టు సాధించింది. ఈ కుటుంబానికి ఓబులాపురం మైనింగ్ కంపెనీ (obulapuram mainng company Omc) ప్రమోటర్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కుటుంబంతో ఆదిపత్య పోరు సాగుతోంది.
శ్రీకాళహస్తి కానిస్టేబుల్ కొడుకు..
బళ్లారిలో ఐరన్ ఓర్ (iron ore) వ్యాపార దిగ్గజంగా గుర్తింపు పొందిన గాలి జనార్దన్ రెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎండి పుత్తూరుకు చెందిన వ్యక్తి. గాలి జనార్దన్ రెడ్డి తండ్రి చెంగారెడ్డి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. ఆయన కుటుంబంలో గాలి జనార్దనరెడ్డి, తమ్ముళ్లు కరుణాకరరెడ్డి, సోమశేఖరరెడ్డి కూడా బళ్లారిలోనే పెరిగారు. ఆయన చెల్లెలు రాజేశ్వరిని శ్రీకాళహస్తి సమీపంలోని చిట్టత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. వారితో పాటు బంధువర్గం కూడా ఇక్కడ ఉంది.
గాలి జనార్థనరెడ్డి తన తమ్ముళ్లతో కలిసి మైనింగ్ వ్యాపారం లోకి ప్రవేశించడం ద్వారా రాజకీయాల్లో కూడా తమదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో బిజెపిలో పనిచేస్తూ మంత్రి పదవులు కూడా నిర్వహించిన చరిత్ర గాలి సొంతం చేసుకున్నారు ఆ తర్వాత ఆయన మైనింగ్ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని పక్కన ఉంచితే,
మలుపు తప్పిన 1999 ఎన్నికలు
శ్రీకాళహస్తి నుంచి వలస వెళ్లిన కానిస్టేబుల్ చెంగారెడ్డి కొడుకు గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ఓర్ వ్యాపారంలో ఎదిగారు. బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన జీవితాన్ని1999 ఎన్నికలు దేశంలోనే ఒక ప్రముఖుడిగా గుర్తింపు దక్కేలా చేశాయి.
యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి బిజెపి ధీటైన సవాల్ విసురుతూ వచ్చింది.
1999 ఎన్నికల్లో ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియాగాంధీ బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆఘమేఘాలపై బిజెపి అగ్ర నాయకురాల్లో ఒకరైన సుష్మాస్వరాజ్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో పారిశ్రామికవేత్త గాలి జనార్దనరెడ్డి తన సోదరులు కరుణాకర్ రెడ్డి, సోమశేఖరరెడ్డి తో కలిసి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికలే వారి రాజకీయంగా వారి ఎదుగుదల, గుర్తింపు దక్కింది. ఈ ఎన్నికల్లో బిజెపి అగ్రనేత సుష్మా స్వరాజ్ ఓటమి చెందిన గాలి సోదరులు మాత్రం కర్ణాటకలోనే కాకుండా దేశంలో ప్రముఖంగా తెరపైకి వచ్చింది.
ఈ ఎన్నికల తర్వాత కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు రాజకీయంగా చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నారు. 2001లో బిజెపి మొదటిసారి బళ్ళారి మున్సిపల్ ఎన్నికలను దక్కించుకుంది. కర్ణాటక చరిత్రలో మొదటిసారి బళ్లారి నుంచి 2004లో బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలు విజయం సాధించారు. జిల్లా పరిషత్ కూడా వరుసగా బిజెపి మూడుసార్లు దక్కించుకోవడంతో పాటు, ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడంలో గాలి జనార్దన్ రెడ్డి అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. బళ్ళారి లో అప్పటినుంచి గాలి జనార్దన్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబాల మధ్య మరింత రాజకీయ ఆధిపత్య పోరాటం ప్రారంభమైందని చెప్పవచ్చు.
2014లో జిల్లా పంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి కొడుకు నారా భరత్ రెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో కొర్ల గుండి పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన బళ్ళారి డిసిసి బ్యాంకు డైరెక్టర్ (అపెక్స్ బ్యాంక్ ప్రతినిధి) భరత్ రెడ్డి సేవలందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బళ్లారిలో రాజకీయాలు కాంగ్రెస్, బిజెపి మధ్య అని చెప్పడం కంటే, రాయలసీమలోని అనంతపురం జిల్లా మూలాలు ఉన్న నారా భరత్ రెడ్డి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మూలాలు ఉన్న గాలి జనార్దన్ రెడ్డి మధ్య ఆదిపత్య పోరు తారాస్థాయిలో జరుగుతోంది.
మరింత ఆజ్యం పోసిన ఎన్నిక
2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు నారా, గాలి కుటుంబాల మధ్య మరింత ఆజ్యం పోసిందని అక్కడి మీడియో విశ్లేషణ . ఈ ఎన్నికల్లో బళ్ళారి సిటీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నారా భరత్ రెడ్డి 37,863 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయపై పోటీ చేసిన బీజేపీ నేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి భార్య, గాలి లక్ష్మీఅరుణ ఓటమి చెందారు. దీంతో వారి కుటుంబాల మధ్య మరింత పోరాటం ప్రారంభమైనట్లు చెబుతున్నారు.
వారిదే పట్టు..
బళ్ళారి నగరంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేత అనడం కంటే గాలి, నారా కుటుంబాలు ఆధిపత్యం చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అని సీనియర్ జర్నలిస్ట్ రవి చెప్పారు.
"కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి, గంగావతి బిజెపి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి తన పట్టు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు" అనేది జర్నలిస్టు రవి చేసిన విశ్లేషణ.
బ్యానర్ తెచ్చిన వివాదం...
బళ్ళారి నగరంలో శనివారం వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమ ప్రచారం కోసం నగరమంతా అలంకరించారు. దేవీ నగర్ ప్రాంతంలోని ఎస్పీ సర్కిల్ వద్ద బిజెపి ఆఫీసు ఉంది. ఇదే ప్రదేశంలో బిజెపి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సన్నిహిత మిత్రుడు మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు నివాసం కూడా ఉంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడపై కాలు పెట్టిన కాంగ్రెస్ మతధారులు ఫ్లెక్సీ అమర్చడం వివాదానికి తెరతీసింది.
పరస్పర దాడులు
బిజెపి నేత గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. పరస్పర దాడులు సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఎక్కడికి చేరుకోవడంతో మరింత ఉద్రిక్తత ఏర్పడినట్లు తెలిసింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గాయపడ్డాడు. తూటా దెబ్బ నుంచి గాలి జనార్దనరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ జరిపిన కాల్పుల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు రాజశేఖర్ (25) మరణించాడు. ఎమ్మెల్యే గాలి భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడనేది అక్కడి మీడియా కథనాల సారాంశం.
ఈ సంఘటన పై స్పందించిన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి
"కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త రెడ్డి, అతని తండ్రి సూర్యనారాయణ రెడ్డి చిల్లరరౌడీలు" అని గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని కాదని, వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరిట ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
బళ్లారిలో జరిగే రాజకీయ పరిణామాలు రాయలసీమలో ప్రకంపనలు ప్రతిధ్వనిస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రత్యర్థులిద్దరికీ అనంతపురం జిల్లా రాయదుర్గం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్నారు. దీంతో ఈ ప్రాంతంలో అక్కడి సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి.
Read More
Next Story