మాలాగే మీరు  ఆచరించండి.. బుల్లెట్టు బైకెక్కిన తిరుపతి ఎస్పీ, కలెక్టర్
x
బుల్లెట్ బండి నడుపుతున్న తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, వెనుక కలెక్టర్ వి. వెంకటేశ్వర్

మాలాగే మీరు ఆచరించండి.. బుల్లెట్టు బైకెక్కిన తిరుపతి ఎస్పీ, కలెక్టర్

తిరుపతిలో నో హెల్మెట్, నో పెట్రోల్


ట్రాఫిక్ నిబంధనలు మేము పాటిస్తున్నాం. మీరు కూడా ఆచరించండి. మా కోసం కాదు. మీ విలువైన ప్రాణాలు కాపాడుకోవడానికి అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు కోరారు. హెల్మెట్ ధరించిన వారిద్దరు సోమవారం ఉదయం బుల్లెట్ బైక్ ఎక్కారు. ఎస్పీ సుబ్బారాయుడు రైడ్ చేస్తుంటే, వెనక కూర్చొన్న కలెక్టర్ వెంకటేశ్వర తిరుపతి వీధుల్లో దాదాపు 700 మంది పోలీసు కానిస్టేబుళ్లు, అధికారులు ద్విచక్ర వాహనాల్లో అనుసరిస్తుండగా సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది.


క్రిటికల్ జాబితాలో రాయలసీమ
రాయలసీమలోని నాలుగు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ప్రమాదాల్లో క్రిటికల్ జాబితాలో ఉన్నట్లు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 400 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 200 మంది లోపు మరణాలు జరిగిన జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతంలో కూడా సగటున 600కు పైగానే ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2012 నుంచి ఈ సంవత్సరం నవంబర్ వరకు సుమారు 19 వేల ప్రమాదాలు జరిగితే, వాటిలో ఎనిమిది వేల మంది మరణిస్తే, దాదాపు 20 వేల మందికి పైగానే క్షతగాత్రులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ప్రమాదాల్లో కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య 11,867 ప్రమాదాలు జరిగితే, వేకువజామున ఆరు నుంచి తెల్లవారిన తరువాత జరిగిన ప్రమాదాలు దాదాపు ఆరు వేల వరకు ఉన్నాయి. అర్థరాత్రి నుంచి వేకువజామున మూడు గంటల మధ్య 8,500 వరకు జరిగినట్లు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 400 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారనేది ఆ నివేదిక సారంశం. రాష్ట్రంలో నవంబర్ వరకు సగటున రోజుకు సుమారు 50 ప్రమాదాలు జరిగితే, 23 మంది మరణించారు. 50 వరకు గాయాలపాలయ్యారు.
హెల్మెట్ వాడితేనే...

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పరిస్థితి పక్కన ఉంచితే, రాయలసీమ జిల్లాల్లో పెద్ద ప్రమాదాలు జరిగాయి. అందులో ఎక్కువగా పగలే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు గుర్తించారు. దీంతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం వారం నుంచి తీవ్ర కసరత్తు చేసింది. జిల్లాలోని అన్ని పోలీస్ డివిజన్ స్థాయి అధికారులతో ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సమీక్షించారు. సిబ్బందిని సంసిద్ధం చేశారు.
జిల్లాలో వాహనదారులకు "హెల్మెట్ లేకుంటే బంకుల్లో పెట్రోల్ పోయరు" అని బలమైన సంకేతాలు ఇచ్చారు. అన్ని మండలాలు, నియోజవవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెట్రోల్ బంకుల వద్ద ఏకంగా హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకుల్తో కూడా యజమానులే రికార్డెడ్ అనౌన్స్ మెంటు ప్రసారం చేస్తున్నారు.
తిరుపతి నగరంలోని అలిపిరి బైపాస్ రోడ్డు, రేణిగుంట మార్గంలోని అనేక ప్రదేశాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి స్వయంగా పరిశీలించారు.
హెల్మెట్ బదిలీ పథకం
"హెల్మెట్ ధరించి వచ్చిన రైడర్ ద్విచక్ర వాహనానికి మాత్రమే పెట్రోల్ పోశారు. హెల్మెట్ లేని వారి వెనక్కు పంపించడం" కనిపించింది. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్లు బదిలీ చేసుకోవడం కనిపించింది. అలిపిరి బైపాస్ రోడ్డులోని శ్రీవారి సన్నిధి అతిథి గృహాల వద్ద హెల్మెట్ లేకుండా వచ్చిన ఓ టీటీడీ విజిలెన్స్ గార్డు బైక్ కు కూడా పెట్రోల్ పోయలేదు. ఇదే పరిస్థితిని సామాన్యులు కూడా ఎదుర్కొన్నారు.
పకడ్బందీగా అమలు చేస్తాం..

హెల్మెట్ పెట్టుకుంటున్న ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్



నో హెల్మెట్.. నో పెట్రోల్ (No helmet, no petrol) నినాదం పోలీసు సిబ్బంది బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ముందుగా చెప్పినట్లుగానే 15వ తేదీ తెల్లవారుజాము నుంచి ఈ పద్దతి అమలులోకి వచ్చింది. దీనిపై నగరంలో మరింతగా తెలియజేసేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ను బుల్లెట్ వెనుక కూర్చోబెట్టుకున్న ఎస్పీ సెబ్బారాయుడు సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ సాగించారు.
తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఉదయం ఈ ర్యాలీ ప్రారంభించారు. ప్రకాశం రోడ్డులోని జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు జెండా ఊపి ప్రారంభించారు.
అంతకుముందు కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, యువకులు వేగంగానే కాకుండా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ద్విచక్రవాహన ప్రమాదాల్లో ప్రాణ నష్టం అధికంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల తీవ్రమైన ప్రమాదాల్లోనూ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
"మీ నిర్లక్ష్యం మీ తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణం కావచ్చు. మీ ఒక్క మంచి నిర్ణయం వారి జీవితానికే భరోసా అవుతుంది" అని యువతకు కలెక్టర్ సూచించారు. హెల్మెట్ చట్టం అనే భయంతో కాకుండా, కుటుంబ భవిష్యత్తు కోసం ధరించాలి అని స్పష్టం చేశారు.
మీ కోసం ధరించండి
ద్విచక్ర వాహనదారులు భయంతో కాకుండా, భద్రత కోసం హెల్మెట్ ధరించాలని అని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హితవు పలికారు.
"హెల్మెట్ ధరించడం పోలీసుల కోసం కాదు. అది పూర్తిగా మీ ప్రాణాల రక్షణ కోసమే" అని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో అత్యధికంగా 18 నుంచి 35 సంవత్సరాల యువతే ఉంటున్నారని గుర్తు చేశారు. వీరిలో చాలామంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. పోలీసుల లక్ష్యం జరిమానాలు విధించడం కాదని, రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు), నాగభూషణం (క్రైమ్) శ్రీనివాసులు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, శాంతి భద్రతల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Read More
Next Story