శ్రీవారి హుండీకి రికార్డు స్ధాయిలో ఆదాయం
x

శ్రీవారి హుండీకి రికార్డు స్ధాయిలో ఆదాయం

రెండు నెలల తరువాత రూ. 5.05 కోట్లు దక్కింది.


ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తిరుమలలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండు నెలల తరువాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం దక్కింది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసే ఎనిమిదో తేదీ లోపు ఇంకొన్నిసరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

తిరుమల శ్రీవారికి హుండీ కానుకల ద్వారా శనివారం గరిష్టస్థాయిలో 5.05 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. గత ఏడాది శ్రీవారి హుండీకి ఇదే రోజు లభించిన 4.10 కోట్ల ఆదాయంతో పోలిస్తే 1.5 కోట్ల రూపాయలు పెరిగింది. రెండు నెలల తరువాత ఇంతటి ఆదాయం లభించడం ఓ రికార్డు. తిరుమలలో
యత్రికుల రద్దీ కొనసాగుతుండడంతో సంక్రాంతి సెలవుల్లో తాకిడిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ముందస్తు ఏర్పాట్లకు సంసిద్ధమైంది.
తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు నిరాంటంగా సాగుతున్న వేళ శనివారం రాత్రికి 88,662 మంది యాత్రికులు శ్రీవారి దర్శనం కల్పించడం ద్వారా టీటీడీ మరో రికార్డు నమోదు చేసుకుంది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం అయ్యాయి. జనవరి ఒకటో తేదీ సాయంత్రం నుంచే సామాన్య యాత్రికులకు టీటీడీ సర్వదర్శనం కల్పిస్తోంది. ఈనెల ఎనిమిదో తేదీ వరకు దర్శనాలు కొనసాగించడానికి వీలుగా టీటీడీ కార్యాచరణ అమలు చేస్తోంది.
సర్వదర్శనానికి 15 గంటలు
తిరుమలకు యాత్రికులు పోటెత్తారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనాలకు 15 గంటల సమయం పడుతోంది. సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న క్యూలో యాత్రికులు శ్రీవారి ఆలయంలోకి వెళ్లడానికి వైకుంఠం 2 కాంప్లెక్స్ లోకి చేరుకుంటున్నారు.
"శిలాతోరణం ప్రాంతంలోని ఎంట్రీ పాయింట్ నుంచి యాత్రికులను క్యూలోకి అనుమతిస్తున్నాం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు. క్యూలో ఉన్న యాత్రికుల కోసం అన్నప్రసాదాల కేంద్రం వద్దకు మొబైల్ ఫుడ్ వాహనాలు, నీటి ట్యాంకులు ఏర్పాటు చేసి, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాట్లు ఆయన తెలిపారు.
పెరిగిన ఆదాయం.. యాత్రికులు
తిరుమలలో శ్రీవారికి సామాన్య యాత్రికులు సమర్పించే కానుకలతో ఆదాయం గణనీయంగా పెరుగుతోంది తాజా పరిస్ధితిని పరిశీలించే ముందు.. మూడు నెలల కిందటి లెక్కలు పరిశీలిస్తే, గరిష్ట స్థాయిలో ఐదు కోట్ల రూపాయల ఆదాయం దక్కింది.
2025 జూలై 28వ తేదీ యాత్రికుల ద్వారా శ్రీవారి హుండీకి 5.44 కోట్ల రూపాయాల ఆదాయం దక్కింది. ఆ రోజు సోమవారం కావడం వల్ల 77,044 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించున్నట్లు టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
2025 ఆగష్టు 19వ తేదీ కూడా యాత్రికుల ద్వారా హుండీకి 5.30 కోట్ల రూపాయల ఆదాయం దక్కినట్లు టీటీడీ వెల్లడించింది. 76,033 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించున్నారు.
2026లో టీటీడీ ఫలించిన ప్లాన్
శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలకు అనుసరించిన విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
"టీటీడీ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడం వల్ల సాధ్యమైంది" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. అధికారులు, సిబ్బంది కలిసి పనిచేసే ఇలాంటి ఫలితాలే ఉంటాయనే విషయం బ్రహ్మోత్సవాల తరువాత మరోసారి స్పష్టమైందని ఆయన చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని యాత్రికుల సంకల్పానికి తగినట్లు చేసిన ఏర్పాట్ల వల్ల రికార్డుస్థాయిలో యాత్రికులకు దర్శనాలు ఏర్పాటు చేయగలిగినట్లు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
తిరుమలలో శనివారం 88,662 మంది యాత్రికులు శ్రీవారిని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ శుక్రవారం రికార్డు స్థాయిలో 83,032 మందికి దర్శనం దక్కింది. గత సంవత్సర ఇదే రోజు యాత్రికుల సంఖ్య 56,550 మాత్రమే. 2024లో 73,712 మంది యాత్రికులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
రూ. ఐదు కోట్లు దాటిన ఆదాయం...
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సామాన్య యాత్రికులు హుండీ కానుకల ద్వారా మొక్కుబడి చెల్లించారు. రెండు నెలల తరువాత శనివారం శ్రీవారి హుండీ రికార్డు స్థాయిలో 5.05 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. శుక్రవారం ఆదాయం 4.10 కోట్ల రూపాయలు లభిస్తే, గత ఏడాది ఇదే రోజు 3.34 కోట్ల రూపాయలు, 2024 జనవరి రెండో తేదీ 4.97 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్లు టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగియనున్న వైకుంఠ ద్వారా దర్శనాలు, సంక్రాంతి పండుగ లోపు యాత్రికుల సంఖ్య పెరగడంతో పాటు, హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఏర్పడే రద్దీకి అనుగుణంగా మరింత విస్తృత ఏర్పాట్లకు టీటీడీ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.
Read More
Next Story