
పోతిరెడ్డిపాడు ‘కరువుబండ’ పాదయాత్రకు 40 ఏళ్లు..
'రాయలసీమ ఎత్తిపోతల పథకం' అవసరంపై 21న తిరుపతిలో చర్చా గోష్టి.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాజలాల రాజకీయ వివాదం రచ్చకెక్కింది. దీనికి కృష్ణాజలాల తరలింపు అనే చర్చ మళ్లీ మొదలయింది. రాయలసీమ కు కృష్ణాజలాలు తరలించాలి, వరదనీరు కాకుండా నికరజలాలు కావాలనేది రాయలసీమ ప్రాంత నేతల డిమాండ్. ఈ డిమాండ్ తొలిసారి ఉద్యమం భారీ పాదయాత్ర తో మొదలయింది. కరువు బండ యాత్ర పేరుతో జరిగిన ఈ రాయలసీమ పాదయాత్ర వివిధ జిల్లాలనుంచి మొదలయి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాకా సాగింది. ఈ పాదయాత్ర జరిగి న ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. రాయలసీమకు కృష్ణా జలాలు అనగానే మొదట గుర్తుకు వచ్చే మాట పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలం రిజర్వాయర్ వెనక నుంచి తెలుగుగంగకు, రాయలసీమకు నీళ్లు మళ్లించేందుకు ఈ రెగ్యులేటర్ కట్టారు. ఈ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కోరుతూ నాటి పాదయాత్ర జరిగింది.
రాయలసీమ కరువు బండ పాదయాత్రకు 40 యేళ్లు
కాలం దూసుకుపోతున్నా, కరువు సీమ నీళ్ల కొరత తీరడం లేదు...
1976లో జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శ్రీశైలం కుడి కాలువ పేరుతో ఏర్పాటు చేసిన కాలువలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ నీరు మళ్లించేందుకు నాటి నందికొట్కూర్ తాలూకా జూపాడు బంగ్లా సమీపాన ఉన్న పోతులపాడు అనే గ్రామం సమీపాన ఒక హెడ్ రెగ్యులేటర్ కట్టటానికి అనుమతులు ఇచ్చారు. దీనినే ఇపుడుపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని పిలుసున్నారు.
హడ్ రెగ్యులేటర్ చాలా నీరు పారే వ్యవస్థ ఒక ఇంజనీరింగ్ మార్వెల్ . ఇక్కడి నుంచి కృష్ణానీరు పెన్నాబేసిన్ లోకి ప్రవహింస్తుంది. ఈరూట్ చూద్దాం. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ నుంచి ఒక అప్రోచ్ కాలువ ద్వారా కృష్ణా జలాలు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ దాకా వస్తాయి. తర్వాత బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు 16 కి.మీ మేర ప్రయాణిస్తాయి. ఈ మధ్యలో మిట్ట కందాల వద్ద డీప్ కట్ అనే తవ్వకం తవ్వాడు. ఇక్కడే కృష్ణా నీరు పెన్న బేసిన్ లోకి ప్రవేశించి బనకచెర్ల చేరుతుంది.అక్కడి నుంచి 140 కి.మీ ప్రయాణించి గోరకల్లు రిజర్వాయర్, అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరతాయి. ఇపుడు అవుకు నుంచి కృష్ణ జిలాలు పెన్నానది మీద నిర్మించిన గండికోట రిజర్వాయర్ లోకి ప్రవేశించాయి. ఇది వేరే కథ.
అంజయ్య రాయలసీమ మేలుకు సానుకూలం
రాయలసీమకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు కడప చిత్తూర్ జిల్లాలు ఇచ్చేందుకు మరొక కాలువ ఇవ్వాలని అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పట్టుబట్టారు. ఆయన ఒక టెక్నికల్ కమిటీ వేసాడు. ఆ రిపోర్ట్ వొచ్చేలోపు ఆయన పదవి నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ సంక్షోభం మొదలయింది. తర్వాత భవనం వెంకట్ రామ్ వచ్చారు. ఆ పైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పనులు ముందుకు సాగలేదు. 1983లో ఎన్టీరామారావు అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయి తెలుగు గంగపనులు ప్రారంభమయినా రాయలసీమ నీరు అందించే ఎస్ ఆర్ బిసి పనులు మందగించాయి.
అంజయ్య హయాంలో వేసిన టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం తెలుగు గంగ ద్వారా కడప,చిత్తూర్ జిల్లాలకు తాగు నీరు,సాగు నీరు ఇవ్వాలని, దీనికోసం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ తోపాటు కాలువల సామర్ధ్యం పెంచాలని రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ రాజశేఖ్ రెడ్డి, మైసురా రెడ్డి, చెంగారెడ్డి, మబ్బు రామిరెడ్డి, కుతూహలమ్మ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి ,సీనియర్ నేతల నందికొట్కూర్ ఎమ్మెల్యే శేష శయనారెడ్డి, నంద్యాల ఎంపి బొజ్జా దశరథరామిరెడ్డి తదితరులు ఎన్టీఆర్ మీద ఒత్తిడి తెచ్చారు.
కానీ పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకి అయిన ఎన్టీరామారావు వీళ్లని ఖాతరు చేయలేదు.దీనికి తోడు ఇలా అడుగున్నవాళ్లలో ప్రముఖులంతా రెడ్లే. కాబట్టి ఎన్టీరామారావుకు ఈ డిమాండ్ లో న్యాయమందని అనిపించినా దాని ముందుకు తీసుకుపోవాలనిపించలేదు. దీనికి వ్యతిరేకంగా మొదలైందే రాయలసీమ పాదయాత్ర. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, మేధావులు, విప్లవరచయితలు, జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. రాయలసీమ తొలి రాజకీయ ఉద్యమం కాబట్టి ప్రజలనుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అపుడు ఈ ప్రాంతంలో కరువులు ఎక్కువగా వచ్చేవి రాయలసీమ అంటే కనుచూపు మేర పచ్చగడ్డి కనిపించని ప్రాంతాలు, తప్పులు చెట్లు చేమలుని ఉసరక్షేత్రాలు, కొండలు, గుట్టలు, బండరాళ్లు. అందుకే రాయలసీమ కరువు స్ఫరించేలా దీనికి ‘కరువు బండ యాత్ర’ అని పేరు నాటి విప్లవ రచయిత భూమన్ ఈపేరు పెట్టారు.
ఐదు ప్రాంతాలనుంచి యాత్రలు మొదలు
ఈ కరువు బండ యాత్ర 1986 జనవరి 1 న లేపాక్షి నుంచి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో మొదలయింది. రాయదుర్గం నుంచి ఎంవీ రమణారెడ్డి నాయకత్వంలో ప్రారంభయింది. తిరుపతి నుంచి మైసూరా రెడ్డి మొదలుపెట్టారు. మదనపల్లి నుంచి చంద్రశేఖర్ రెడ్డి,భూమన్ నాయకత్వంలో, మంత్రాలయం నుంచి శేష శయనా రెడ్డి నాయకత్వంలో యాత్రలు మొదలయ్యాయి. ఈ యాత్రలన్నీ జనవరి 21 నాటికి పోతిరెడ్డిపాడుకు చేరుకొని రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు పనులను మొదలు పెడుతూ సింబాలిక్ గా నాలుగు పలుగులతో కొంచం తొవ్వాలని , సీమను కరువు నుంచి కాపాడాలను కోరుతూ “కరువు బండ” కృష్ణా నదిలో వేశారు. చిత్రం ఏమిటంటే, ఎన్టీరామారావు ఈ ఆగ్రహానికి ఆజ్యం పోయకుండా, యాత్ర నిరాటంకంగా సాగేందుకు సహకరించారు. పోతిరెడ్డి పాడును రాయలసీమ నేతలు ధ్వంసంచేస్తారేమో అనే అనుమానాలు ఉండినా, అక్కడ ఒక్క పోలీసులేకుండ చేశారు. ఆయేడాది జనవరి 22న యాత్ర విజయవంతమయింది. అక్కడే ఒక బహిరంగ సభ జరిగింది. అయితే, రాయలసీమ రైతులు కోరుతున్న నికర కృష్ణా జలాల డిమాండ్ ఇంకా నెరవేరలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే నెరవేరని ఆడిమాండ్ ఇపుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెరువేరుతుందా అనేది ప్రశ్నార్థకం. ఒక ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ప్రాజక్టును మరొక ముఖ్యమంత్రి విస్మరిస్తున్న ఈ నాటి రాజకీయాల్లో 1986 కరువు యాత్ర లక్ష్యం ఎలా నెరవేరుతుందో చూడాలి.
నాటి యాత్రలో పాల్గొన్న వారిలో చాలా తక్కువ మంది ఇపుడు జనం మధ్య ఉన్నారు. వైఎస్ ర్,బొజ్జా వెంకటరెడ్డి, శేషశయనారెడ్డి డాక్టర ఎమ్వీరమణారెడ్డి చనిపోయారు. మిగతా వారు ఇప్పటికీ అవకాశం వచ్చినపుడల్లా ఈఅంశం ప్రస్తావిస్తూనే ఉన్నారు.
భూమన్ ఎమన్నారంటే...
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూము విస్తరణ కోసం 40 సంవత్సరాల కిందట సాగించిన ఆ పాదయాత్ర ఓ చరిత్ర. యువతను చైతన్యం చేయడమే కూడా ఓ చారిత్రక అవసరాన్ని గుర్తు చేసింది" అని రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ చెప్పారు భూమన్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు.
"శ్రీశైలం నుంచి వరదనీటి జలాలను తెలంగాణకు తరలిస్తే తప్పు లేదు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తే తప్పయిందా?" అని భూమన్ ప్రశ్నించారు.
చంద్రశేఖర్ రెడ్డి ఇలా అన్నారు
"ఈ యాత్రికు అప్పుడే 40 ఏళ్ల నిండాయా? నిన్నగా క మొన్న చేసినట్టు ఉంది" అని కడప నగరానికి చెందిన రాయలసీమ కార్మిక నేత సీహెచ్. చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ ఉద్యమ స్పూర్తి రాయలసీమలోని రైతులను, సంఘాలను కదిలించిందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో కాలు కదపడం పోరాట ఉధృతిని పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఆ పాదయాత్ర ఉద్యమకారులకు స్ఫూర్తి కలిగించింది. రాయలసీమకు ఎత్తిపోతల పథకం చాలా అవసరం" అని సీహెచ్ . చంద్రశేఖరరెడ్డి అన్నారు.
రెండో తరం రాయలసీమ నాయకుడు బొజ్జా
పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి పునాది ఆ నాటి ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య కాలంలోనే పడిందని ఆయనే ఎస్ఆర్ బీసీకి 11 వేల క్యూసెక్కులు కేటాయించారని రాయలసీమ సాగునీగి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి గుర్తు చేశారు.
"శ్రీశైలం ఆపరేషన్స్ మార్గదర్శకాలు అమలు చేయాలి" అని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకోవడానికి వైఎస్. రాజశేఖరరెడ్డి తూములు వెడల్పు చేయించారు. నీటిని వాడుకునేందుకు కాలువలు విస్తరించని స్థితిలో ప్రయోజనం ఏమిటి" అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా వారసత్వంగా పోటీ పడిన మాజీ సీఎం వైఎస్. జగన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విఫలం అయ్యారని ఆయన అన్నారు.
తెలంగాణకు అత్యాశ, పోతిరెడ్డి పాడుకు ఏమి మిగులుతాయి
కృష్ణా జలాలను వాడుకొవడం ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడి ఉందని, దీనివల్ల రాయలసీమకు నష్టం జరుగుతున్నదని కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి డాక్టర్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి మట్టం 885 అడుగులు ఉంచాలి. అయితే 817.15 అడుగుల నుంచే ఎడమ కాలువ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తోపాటు పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తోంది తెలంగాణ మళ్లించుకుంటున్నదని తులసి రెడ్డి అన్నారు. తెలంగాణ ఇలా నీళ్లన్నీ తోడుకుంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో 840 అడుగులు నీరు ఎలా నిలుస్తుంది? సీమ రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని తులసి రెడ్డి ప్రశ్నించారు
"రాయలసీమలో ఎత్తిపోతల పథకాలు అనుమతి లేని పథకాలు అంటున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాల పరిస్థితి కూడా అంతే. వారికి అక్కడి అవి ఎంత అవసరమో, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అంతే అవసరం" అని తులసిరెడ్డి తేల్చిచెప్పారు.
అందుకే పోతిరెడ్డి పాడు పాదయాత్ర నెరవేరేందదుకు మరొక ఉద్యమం సాగాలని అంతా నొక్కి చెబుతున్నారు.

