సంతకమే ఆలస్యం...  మారనున్న జిల్లాల స్వరూపం!
x

సంతకమే ఆలస్యం... మారనున్న జిల్లాల స్వరూపం!

జిల్లాల స్వరూరం మారనుంది. ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చినట్లు మదనపల్లె, మార్కాపురం జిల్లాలుగా మారతాయా?



రాష్ట్రంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది. గత పాలనలో రాజకీయ వివక్ష చూపించారు. చెప్పిన మాటకు విరుద్ధంగా వ్యవహరించారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు. వారందికీ సాంత్వన దొరికింది. ఎలాగంటే..

"అధికారంలోకి రాగానే జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్షిస్తా. మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేస్తా."
ఎన్నికల ప్రచారంలో టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. "ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణాన్ని కూడా జిల్లాగా చేస్తా" అని కూడా ప్రకటించారు.

గత వైఎస్ఆర్ సీపీ పాలనలో మాజీ సీఎం వై.ఎస్. జగన్ చెప్పిన దానికి భిన్నంగా "పాత రెవెన్యూ డివిజన్ కేంద్రాలను జిల్లా కేంద్రాలు"గా ఏర్పాటు చేయడంలో రాజకీయ వివక్ష ప్రదర్శించారనే విషయంలో తీవ్రస్ధాయిలో పోరాటాలు కూడా జరిగాయి. అందుకు సాక్ష్యం..

1. కడప జిల్లాలో బ్రిటీషర్ల కాలంలోనే ఏర్పాటైన రాజంపేట పార్లమెంట్ స్థానం. రెవెన్యూ డివిజన్. ఆసియాలోనే పెద్దదైన మదనపల్లెను వదిలేశారు. వీటి రెండింటి మధ్యలో ఉన్న రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం.
2. అనంతపురం జిల్లా హిందూపురం కాకుండా పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయడం.
3. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కాకుండా, అద్దంకి, పరుచూరుతో కలిపి బాపట్లను కేంద్రంగా చేశారు.
4. ప్రకాశం జిల్లా కందుకూరును నెల్లూరులో కలిపారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే..


వీటిల్లో వైఎస్ఆర్ సీపీ నేతల స్వార్థం, పక్షపాతం ఉందని నిరసిస్తూ, "మదనపల్లె, రాజంపేట, హిందూపురం జిల్లా సాధన సమితి" పేరిట రాజకీయ వైషమ్యాలు పక్కన ఉంచి, అన్ని పక్షాలు ఒకే గొడుగు కింద ఉద్యమాలు సాగించాయి. విపక్షాలే కాకుండా, అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. వారందరిపై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అందులో..
"నాపై 20 కేసులు పెట్టారు" అని జిల్లా సాధన సమితి సమన్వయకర్త, సామాజిక ఉద్యమకారుడు, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ప్రస్తుత మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషాపై కూడా రెండు కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఇదిలావుంటే,


నిర్ణయం కోసం నిరీక్షణ
అనుకున్నట్లుగానే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా ఎన్. చంద్రబాబునాయుడు బాధ్యతలు కూడా స్వీకరించారు. మొదటి క్యాబినెట్ లో తీసుకునే నిర్ణయం కోసం జిల్లాల సాధన కోసం ఉద్యమించిన విభిన్నవర్గాలు నిరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితిలో రెండు రోజుల క్రితం మదనపల్లెలో " జిల్లా సాధన సమితి " ఏర్పాటు చేసిన అభినందన సభలో టీడీపీ మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
"మదనపల్లెలో ఎన్ని కేసులు నమోదు చేశారో వివారాలు తీసుకోండి. వాటన్నింటిని ఎత్తి వేయించడానికి జీవో తీసుకుని వస్తా" అని అన్నారు. "మదనపల్లె జిల్లా కేంద్రం కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు చొరవ తీసుకుంటా" అని చెప్పడం ద్వారా తమ బాధ్యతలు మరిచిపోలేదనే విషయం స్ఫష్టం చేశారు.
గతాన్ని స్పర్శిస్తే...
2014లో రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిగా 13 జిల్లాలతో నవ్యాంధ్ర ఏర్పటైంది. సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత
2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అంతకుముందు జరిగిన ప్రచార సభల్లో "పార్లమెంట్ కేంద్రాలుగా జిల్లాలను ఏర్పాటు చేస్తాం" అని ప్రకటించారు. ఆ మేరకు 13 జిల్లాలను 2022 ఏప్రిల్ నాల్గవ తేదీ 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి కార్యాచరణ అమలు చేశారు. 51 రెవెన్యూ డివిజన్లకు అదనంగా తొలివిడతలో 22 కొత్తవి ఏర్పాటు చేశారు. ఆ తరువాత
చంద్రబాబు ఖిల్లాలో...

రాజకీయ లబ్ధికోసం కడప జిల్లాలో పులివెందుల, చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. టీడీపీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ రెవెన్యూ డివిజన్ చేశామంటూ, పదేపదే వైఎస్ఆర్ సీపీ కీలక నాయకులు ప్రచారం సాగించడం గమనార్హం. ప్రారంభదశను పరిశీలిస్తే..
లాజిక్ ఏమి చెప్పారంటే..
కడప జిల్లాలో రాజంపేట రెవెన్యూ డివిజన్. పార్లమెంట్ స్థానం కూడా. దీనిని వదిలేసి వసతులు అటుంచి తాగునీటికి కూడా కటకటలాడే "రాయచోటిని జిల్లా కేంద్రంగా " ప్రకటించారు. ఆ జిల్లాకు అన్నమయ్య అని కూడా నామకరణం చేశారు. వాస్తవంగా శ్రీవేంకటేశ్వరస్వామి సేవకుడు, పదకవితా పితామహుడైన అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక గ్రామం రాజంపేటకు కూతవేటు దూరంలో ఉంటుంది. అలాంటిది రాయచోటికి ఆయన పేరు పెట్టడంపై మాజీ సీఎం వైఎస్. జగన్ విమర్శలకు గురయ్యారు. అప్పటి అధికార పార్టీ శ్రేణులే ఈ చర్యను నిరసిస్తూ, రోడ్లపైకి వచ్చారు. ఇందుకు చెప్పిన కారణం ఒకటే..
"అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలు.. మిగతా పట్టణాలతో సమానంగా తీర్చిదిద్దడం కోసమే.." అని సమర్ధించుకున్నారు. దీని వెనుక అసలు కథే వేరే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు, కడప జిల్లాల వైఎస్ఆర్ సీపీ నేతలు ముందస్తుగానే రాయచోటి ప్రాంతంలో విపరీతంగా భూములు కొనుగోలు చేసి, జిల్లా కేంద్రం ఏర్పాటు ద్వారా విలువ పెంచుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ పరిస్థితి ఇలా ఉంటే..


ఆంధ్రా ఊటీ
మదనపల్లెకు చారిత్రక నేపథ్యం ఉంది. అసియాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. 1860లోనే మద్రాసు రాష్ర్టంలోనే కడప జిల్లా కేంద్రంగా ఉండేది. "సెకెండ్ అడినిస్ట్రేటివ్ కేంద్రం" మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యం, అందుబాటులోని వనరులు సమృద్ధిగా ఉన్నాయి. వీటన్నింటిని వదివేసి మదనపల్లెను రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై "మదనపల్లె జిల్లా సాధన సమితి" ఉద్యమంచింది. నెలల పాటు సాగించిన పోరాటంలో పార్టీలకు అతీతంగా అందరు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు.
"మా భావప్రకటనా స్వేచ్ఛకు అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీ సంకెళ్లు వేసింది. అంతటితో ఆగక వివిధ సెక్షన్ల కింద ఉద్యమకారులపై 20 కేసులు కూడా పెట్టించింది" అని మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ తెలిపారు.
"నాపై కూడా రెండు కేసులు పెట్టారు. ప్రజల అభీష్టాన్ని గత ప్రభుత్వం గౌరవించలేదు" అని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా ( ఆ పోరాటాల కాలంలో ఆయన టీడీపీలో లేరు.) ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. "మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వందల సంవత్సరాలుగా 17 ఎకరాల్లో ఉంది. మాది పరిచయం అవసరం లేని ఊరు" అని షాజహాన్ బాషా చెప్పారు. "మదనపల్లె జిల్లా చేసే బాధ్యత నాది. వెనకాడేది లేదు. సొంత ఇల్లు, ఊరి కోసం, పుట్టిన గడ్డకు ఏమి చేయలేని వ్యక్తి వృథా. అలాంటి వ్యక్తి సమాజానికి పనికిరాడు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
లాజిక్ మిస్సయ్యారే...
కడప జిల్లా రాయచోటి జిల్లా కేంద్రంగా అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా చెప్పిన లాజిక్ అనంతపురం జిల్లా హిందూపురానికి వర్తింప చేయడంలో మిస్సయిందా..
"వెనుకబడిన పట్టణంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం అంటే. అభివృద్ధిలో ముందుకు తీసుకురావడమే" అన్నారు. కర్ణాటకకు సమీపంలో ఉండడం, వ్యాపార లావాదేవీల్లో ప్రముఖంగా ఉన్న హిందూపురం బదులు ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్నపుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వెనుక మతలబు ఏమిటనేది సమాధానం దొరకని ప్రశ్నమీ కాదు. ఎందుకంటే..
అది రాజకీయ వివక్షే....
హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ 2014, 2019 ఎన్నికలతో పాటు 2024 తాజా ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎన్.టీ. రామారావు కుమారుడు ప్రస్తుత సీఎం ఎన్. చంద్రబాబు బామర్ది, వియ్యంకుడు అనేది జగమెరిగిన సత్యం. అయితే, 2022లో జరిగిన జిల్లాల పునర్ విభజనలో రాజకీయం వివక్షతోనే హిందూపురం బదులు, పుట్టపర్తిని జిల్లా చేశారని అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.
"ఇందులో వాస్తవం ఉంది" అని అనంతపురం జిల్లాకు చెందిన వెటరన్ జర్నలిస్ట్ మహ్మద్ షఫీ అన్నారు. "రాజకీయ విరోధమే అలా చేయించి ఉండవచ్చు" అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే. జిల్లా కేంద్రం కానుందనే ఆశతో జిల్లాలోని టీడీపీ కీలక నేతలు ముందస్తుగానే వందలాది ఎకరాలు కొనుగోలు చేశారనేది విశ్వసనీయ సమాచారం. వారికి అడ్డుకట్టడానికే అప్పటి ప్రభుత్వం పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసినట్టు చెబుతున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ కొత్త జిల్లాలను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉంది. గతంలో మాదిరే అధికార పార్టీల్లోని కొందరు ఎమ్మల్యేలకు తలనొప్పులు తప్పేలా లేవు. సీఎం ఎన్.చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story