ISRO | నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరితే.. చిక్కవా చుక్కలు..
x

ISRO | నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరితే.. చిక్కవా చుక్కలు..

రాకెట్ విజయవంతమైంది. నా చిన్నతనం గుర్తు వచ్చింది. ఈ మధురానుభూతికి శ్రీహరికోట ప్రయాణం సాక్ష్యంగా నిలిచింది.


ఒకామె ఇంగ్లీషులో ఒకటి, రెండు లెక్కిస్తున్నారు. 9, 8, 7... 1,0 అంతే.. ఆమె మాటలు ఆగాయి.

నీలగిరి చెట్ల మధ్య అల్లంత దూరంలో సముద్రానికి దగ్గరగా ఉండే ప్రదేశం అది. జీరో పాయింట్ (లాంచ్ పాడ్) ఉంది. భూమిపై ఏదో వెలుగు స్వల్పంగా కనిపిస్తోంది. క్షణాల్లోనే ఆరంజ్ కలర్లో నిప్పులు కురుస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఢమఢమ శబ్దం. కింది భాగంలో ఉన్న మోటార్ల నుంచి నిప్పులు కక్కుతూ ఉంటే, రాకెట్ పైకి లేచింది. అంతే, అప్పటి వరకు ఆకాశంలో కమ్ముకున్న అంధకారం స్థానంలో ఓ కాంతిపుంజం విరిసింది. కనుచూపుమేర ఆకాశంలో పెద్దలైటు వెలిగించారా? అని అనుభూతి. మంచు ఎక్కువగా ఉంది. ఓ పక్క సముద్రం. అక్కడి నుంచి అల్లుకున్న అడవి. ఓ దీవిలోని ప్రదేశమే. శ్రీహరికోట ( Sriharikota) రాకెట్ కేంద్రం. అంతటా చీకటి. భారీ కరెంటు దీపాల వెలుగు చీకటిని చీలుస్తోంది. రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోతున్న దృశ్యం అద్భుతం.


నిజంగా చెప్పాలంటే ఓ దృశ్యకావ్యం కళ్లముందు కనిపించింది. భీకర శబ్దాలు చేసుకుంటూ కొన్ని మీటర్ల పొడవు ఉన్న రాకెట్ ఏటవాలుగా నిశీధి ఆకాశంలోకి దూసుకుపోతూ, కొద్దిసేపటికి అదృశ్యమైంది. అంతే, శ్రీహరికోట కంట్రోల్ రూంలో మాటలు ఊపిరి పోసుకున్నాయి. షీట్స్ విడిపోయాయి. అని ప్రకటన, కొద్దిసేపటికే రాకెట్ ఫస్ట్ స్టేజ్ సక్సెస్. వెంటనే కరతాళ ధ్వనులు. ఆ గొంతులో మరింత ఉత్సాహం తాండివిస్తోంది. సెకండ్ స్జేజ్ ఆల్సో సక్సెస్. మళ్లీ చప్పట్లు. స్ట్రాపాన్ మోటర్స్ ఆన్, మిషన్ సక్సస్. విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. అని మైకులో చెబుతున్న మాటలు నా చెవికి సోకుతున్నాయి. కానీ, నా అంతరంగం 45 ఏళ్ల వెనక జ్నాపకాల్లోకి వెళ్లింది..
అదే రాకెట్ అనుకునే వాళ్లం..
ఆకాశంలో మేఘాలచాటున పొగ వదులుతూ ఓ వస్తువు దూసుకుపోతుంటే చూశా. అప్పుడు అనుకునేది. చూడరో రాకెట్ ఎంత జోరుగా పోతాండాడో అనేది బషీర్ గాడి మాట. ఒరేయ్ దీపావళి రోజు సెలైన్ గాజు సీసాలో రాకెట్ పెట్టి, కింద ఒత్తి ఎలిగియ్యగానే సుర్రుమని ఆకాశంలో పోతాండ్లా అనేది డేవిడ్ చెప్పినట్లు గుర్తు. రాకెట్ కూడా అట్నే పోతాదేమో కదుబ్బీ. అవున్రో బాబుగాడి (అంటే నేనే) చెప్పింది నిజమేరో. వాళ్ల నాయిన డాక్టర్ సుబ్బన్న చెప్పి ఉంటాడు అనిమహ్మద్ షఫీ (Rat) ముక్తయింపు. కాదురా... వాళ్ల చిన్నక్క చెప్పి ఉంటాది. ఆమె సైన్స్ బాగా చెబుతా ఉంటాది కదా. అనేది మాహబూబ్ బాషా మాట. కాదురో వాళ్ల నాయన డాక్టర్ సుబ్బన్న ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతాడు. ఇంగ్లీష్ పేపర్ కూడా చదువుతా ఉంటాండ్లా. అట్టా తెలిసి ఉంటాది. అందుకే వాడికి బాగా తెలుసులే. గొడవ పడితే అందరికి అప్పుడు నేనే వాళ్లకు లీడర్. జోబీలో ఎప్పుడు చిల్లర ఉండేది. నేను వాళ్లకు బటాఠాలు, చాక్లెట్లు ఎక్కడ ఇవ్వనో అనేది కూడా అప్పుడు వాళ్లకు సందేహం ఉండవచ్చు. కానీ, అందరూ నాకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆకాశంలో దూసుకుపోయేది జెట్ విమానం అని తెలియని వయసు. చెప్పినోళ్లు కూడా లేరు. అదే రాకెట్ అనుకునే వాళ్లం. అలాంటిది.
మరువలేని జ్ణాపకం
జర్నలిస్టు కావడం వల్ల ఏకంగా రాకెట్ దగ్గరగా చూసే అవకాశం కలిగింది. గతంలో చాలాసార్లు శ్రీహరికోటకు వెళ్లడం, రావడం మామూలుగానే సాగింది. కానీ, ఈసారి ఓ మధురజ్ణాపకం. మా కుటుంబంలో ఒకరిగా ఉన్న మా అక్కకు (షార్ ఉద్యోగి) దగ్గర చేసింది. మా చిన్నక్క తిరుపతిలో డీ.ఫార్మసీ చదివేటప్పుడు సుగుణక్క క్లాస్ మేట్. నన్ను మా అక్కవాళ్లకంటే ప్రమేగా చూసుకునేది. సెల్ ఫోన్ రాకముందు అక్కకు జాబులు (letters) రాసేవాడిని. ఒకసారి ఇంటికి వెళ్లి, నిస్సీ, బ్లెస్సీతో రెండు రోజులు ఆడుకున్నా. పోతా అక్కా అంటే రెండు రోజులు ఉండు తమ్ముడూ, మళ్లీ పోదువులే అనే ఆమె మాటలు నన్ను కదలచ్చేవి కావు. ఆ తరువాత ఆమె ఇల్లు మారడం, కమ్యూనికేషన్ కట్ అయింది. ఆ తరువాత చాలాసార్లు ప్రయత్నించా. నా రిపోర్టింగ్, ఇంటి వ్యవహారాలతో బయటికి వెళ్లలేని స్థితిలో ఆ అక్కను ఎలాగైనా కలవాలని ప్రయత్నాలు ప్రారంభించా.
మూడేళ్ల ప్రయత్నం
పీఎస్ఎల్వీ సీ 60 పుణ్యామా అని మూడేళ్లుగా సాగిస్తున్న అన్వేషణ ఫలించింది. నేను ఊహించని విధంగా జరిగింది. మామాలుగా రెకెట్ ప్రయోగానికి కొందరు జర్నలిస్టులు నిలయ విధ్వాంసులు. వెళ్లి, వస్తుంటారు. తిరుపతికి దగ్గరలోని ఎన్ఏఆర్ఎల్ ( Narl )లో హిందీ ట్రాన్స్లేటర్ గుప్తా. పూర్వాశ్రమంలో ఆయన జర్నలిస్టుగా నాకు సీనియర్. రిపోర్టర్ గా కూడా పనిచేశారు. రాకెట్ ప్రయోగం ఉందంటే నాకు మెసేజ్ చేశారు. ఓకే సర్. నేను వస్తున్నా. పాస్ మంజూరు చేయండి అని చెప్పగానే. అటు నుంచి తప్పకుండా అని సందేశం.
అనుకున్నట్లు షార్ (SHAR) ji వెళ్లే సమయం వచ్చింది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాలి. నేను ఎక్కడికి వెళ్లాలన్నా ఎడిటర్ గారికి చెప్పాలి. అది నియమం. బాధ్యత. బస్సులో సరదాగా వెళ్లిరావాలనేది నా కోరిక. ఎడిటర్ జింకా నాగరాజు గారికి చెప్పినా సరే. డిప్యూటీ ఎడిటర్ ఆకుల అమరయ్య చెప్పినా కానీ, వెంటనే వారికి బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. ఏదో ఒకటి పురమాయిస్తారు. రాయక తప్పదు. ఏమి చేద్దామని ఆలోచించా. మధ్యాహ్నం అమరయ్యగారికి కాల్ చేశా. "సార్ శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి వెళ్లడానికి పాస్ వచ్చింది. అలా వెళ్లి చూసొస్తా" ఇది నా వినతి.
ఆయన మాటలు సుతిమెత్తగానే ఉంటాయి. సూదుల్లా దించడంలో దిట్ట. "ఓకే భాస్కర్ వెళ్లిరా. దానికేముంది. మంచి అవకాశం" అనగానే చాల్లే సామి, అని సంబరం. "ఓ పనిచెయ్" అనగానే
ఏదో ఫిట్టింగ్ పెడతాడురా సామి అనుకున్నా. అనుకున్నదే అయింది.
"వెళ్లి, మంచి స్టోరీ రాసెయ్. ఆ మార్గంలో మీరు ఏమి చూశారు. ఎలా సాగింది. ఈ విషయాలు చక్కటి స్టోరీ రాసేయ్. అలాగే లాంచింగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా. ఓకే" అనేది ఆయన సూచన. ఫిట్టింగ్ పెట్టినాడు సామీ అనుకున్నా. మనసులో మాత్రం ఒకటే అనిపించింది. స్వతంత్రంగా రాసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోెవాలి.
సరే సాయంత్రం అయింది. అదరాబాదరా సిద్ధమై, దిఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చిన లాప్ టాప్ బ్యాగ్ సంకకు తగిలించుకుని ఇంటి నుంచి బయలేదేరా. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు వెళితే.. అన్నా.. ఇస్రో బస్సు లీలామహల్ సర్కిల్ దగ్గరికి వస్తుందంట అని చెబితే. మళ్లీ బైక్ తీసి, అక్కడికి చేరుకున్నా. అప్పటికో మనోడు గునకల దినేష్ అక్కడ స్నేహితులతో వాలిపోయి ఉండాడు. వాడితో కొంచెం సేపు మాట్లాడుతూ ఉంటే.

సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ఇస్రో బస్సు వచ్చింది. డోర్ తీసిన వెంటనే ఎన్ఏఆర్ఎల్ National Atmospheric Research Laboratory - NARL ) పీఆర్ఓ గుప్తా.. భాస్కర్ సార్ నమస్తే, వెల్ కం టు షార్ అని స్వాగతించి, బస్సులో సీటిచ్చారు. మెడలో ది ఫెడరల్ ఐడీకార్డు ట్యాగ్ చూడగానే.. సార్... ఫెడరల్ కు వచ్చారా? కంగ్రాట్స్ అని శుభాకాంక్షలు. బస్సులో పది మందికి మించి లేరు.
ఏం సార్.. ఇంతతక్కువ మంది ఉండారంటే.. వెయిట్ చేయండి. చూస్తారుగా అనేది గుప్తా మాట. రేణిగుంట మూడు నాలుగు రోడ్ల కూడలి వద్ద బేకరీ వద్ద బస్సు ఆగింది. పీఆర్ఓ గుప్తా ఒక ఎగ్ పఫ్, కప్పు టీ ఆఫర్ చేశారు అప్పటికే కొందరు యువ జర్నలిస్టులు బిలబిలమంటూ వచ్చారు. కొద్ది సేపటికి బస్సు బయలుదేరింది. మొదటిసారి శ్రీకాళహస్తి జర్నలిస్టులు మాతో కలవబోతున్నారని పీఆర్ఓ గుప్తా ఫోన్ సంభాషణతో అర్థమైంది.
చూడండి సార్, తూర్పు, ఉత్తరం దిక్కులు నాకు తెలియవు. మీరు బైపాస్ రోడ్డులో ఉండండి. చేయ్యి ఎత్తండి బస్సు ఆపుతా. అనేది ఆయన సమాధానం. అక్కడికి వెళ్లగానే బిలబిలమని మరో పది మంది మాతో జత కలిశారు.
దగ్గర ఉంటే, ఏమి పనిచెబుతాడో అని మా రిపోర్టర్ దినేష్ అనుకున్నాడేమో బస్సు వెనకసీటులో వాలిపోయాడు. నాకేమో ఒకపక్క ఆందోళన. మా డిప్యూటీ ఎడిటర్ అమరయ్య సార్ స్టోరీ రాయమన్నారు. ఎలా మొదలు పెట్టాలి అనేది ఒకపక్క. ఎలాగూ వెళుతున్నాం కదా. అని వెంట తీసుకుని వెళ్లిన లాప్ టాప్ ఓపన్ చేశా. పీఎస్ఎల్వీ ప్రత్యేకతలు చదివా. స్టోరీ రాయడంలో మునిగి ఉన్నా...
బస్సులో ఎక్కినోళ్లు సామాన్యులా. అంత యువ జర్నలిస్టులు. మనలో మాట. రాయడం కంటే, చూద్దాం అని వచ్చే వాళ్లే ఎక్కువ. నా పనిలో నేను ఉంటే, సార్... తీసుకోండి అని తినడానికి ఏవో ఓ జర్నలిస్టు తెల్లటి తినుబండారం ఇవ్వబోయారు.సారీ.. సర్ ... పనిలో ఉన్నా అంటే.. సార్ ఇవన్నీ మనకు ఎప్పుడు ఉండేవే. ఇవి రుచి చూడండి అనేది ఆయన అభ్యర్థన, ఆయన పిడికిలి నిండుకు ఏవో తెల్లటివి కనిపించాయి. మొహమాటానికి నాలుగు చేతిలోకి తీసుకున్నా. ఒక్కొక్కటి వేలెడు పొడుగు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. ఎందుకో సందేహం వచ్చి " సార్ ఏంటివిఇవి. అడిగితే.." ఇవి బొరుగులు అని చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది. ఇంతపొడుగు ఉన్నాయే అంటే, ఇవి. బాస్మతి బియ్యంతో చేసినవి అని చెప్పగానే గమ్మత్తు అనిపించింది. చాలా రుచిగా ఉన్నాయి.
ఇక నా పనిలో నేను స్టోరీలో ఉండగానే.. నాయుడుపేట వచ్చింది. అప్పుడే సూళ్లూరుపేట షార్ సిబ్బంది నుంచి పీఆర్ఓ గుప్తాకు ఫోన్ కాల్ రావడం గమనించా.
సార్.. మీరు కేఆర్. పాలెం. (పులికాట్ నగర్) క్వార్టర్స్ వద్ద ఆగండని చెబుతుండగానే సూళ్లూరుపేటలోకి బస్సు ప్రవేశించడం, డీఓఎస్ కాలనీ (షార్ ఉద్యోగుల క్వార్టర్స్ లో ఇది ఒకటి) దాటినట్టు గమనించా. "సార్, గుప్తా గారు .. చిన్న రిక్వెస్ట్.. మా అక్క ఆచూకీ తెలుసుకోవడానికి మీ సహకారం.. అనగానే డోంట్ వర్రీ అదే కాలనీ వాళ్లు బస్సు ఎక్కుతారు. మీకు పరిచయం చేస్తా" అనేది గుప్తా అభయం. కొద్దిసేపటికే ఓ ఉద్యోగి బస్సు ఎక్కగానే పరిచయం చేశారు. పిలిచి మరీ నా పక్క సీట్ లో కూర్చోబెట్టుకున్నా. ఆయనతో పరిచయం అయ్యాక. నా వివరాలు చెప్పా, మా అక్క సుగుణమ్మ కోసం వాకబు చేశా. ఆయన ఎవరికో ఫోన్ చేయడం. నంబర్ తెప్పించడం నిమిషాల్లో జరిగిపోయింది.
మాటల మౌనం...
మా అక్కకు కాల్ చేశా. అటు వైపు నుంచి హలో అనే స్వరం వినబడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. గొంతు ఏమీ మారలేదు. నన్ను నేను సంభాళించుకున్నా. కావాలనే తమిళంలో మాట్లాడా? అక్కా నల్ల ఇరుక్కుమా (ఇక్కా బాగున్నారా?) హా తంబి (తమ్ముడు బాగున్నా), అక్కా వుంగళ్ కి నాన్ యారో తెరియుమా? ఎన్న కండిపుర్చియా? ( అక్కా నేను ఎవరో తెలుసా? నన్ను గుర్తు పట్టారా?) అనగానే కొద్దిసేపటికి ఆమె ఊ.. అంటున్న శబ్దం వినిపిస్తోంది. ఆలోచనలో ఉన్నారు. అక్కా సీగ్రమే సొల్లుంగో, ఇల్లన నాన్ త సొల్ర (అక్కా త్వరగా చెప్పండి. లేదంటే నేను చెబుతా) ఇలాగే సంభాషణ సాగింది. వెంటనే ఆమె భాస్కర్... తమ్ముడు ఎలా ఉన్నావు మా? ఎక్కడ ఉన్నావు. ఇక ప్రశ్నలు ఆగలేదు. ఆమె నవ్వూ ఆగలేదు. ఆమె కూడా ఊహించి ఉండరు. అక్క పాటలు బాగా పాడతారు. స్వరం కూడా బాగుంటుంది. ఈ సంభాషణ జరుగుతుండగానే.. ట్రూ కాలర్ చూసి కనుక్కున్నావు కదక్కా.. అంటే.. లేదు. తమ్మడు నీ గొంతు మారలేదు. అక్కా బాగున్నావా అని అడిగేది నువ్వు ఒక్కడివే నాకు తెలుసు కదా. (ఎందుకంటే ఆమెకు తమ్ముళ్లు లేరు) ఇలా మాటలు సాగుతుండగానే...
రాత్రి 8.05 గంటలకు శ్రీహరికోట ముఖద్వారా వద్దకు మా బస్సు చేరుకుంది. అప్పటికే ఇస్రో ( ISRO) పీఆర్ఓ నుంచి అందిన పేర్లతో ఢిల్లీ నుంచి అనుమతి ఇచ్చిన వారందరికీ తాత్కాలిక గుర్తింపుకార్డులు ఇస్తున్నారు. బస్సు దిగడమే ఆలస్యం. పోలోమంటూ అక్కడి సిబ్బందిపైకి దండయాత్ర చేస్తున్నట్లు పోటెత్తారు. మిమ్మల్ని తీసుకుని వెళ్లిన పీఆర్ఓ గుప్తా తన వద్ద ఉన్న లిస్టులోని పేర్లు ఉన్నవారికి ఐడీకార్డులు తీసిస్తున్నారు.
ది ఫెడరల్ (TheFederal) పుణ్యమాని నాకు లాప్ టాప్ వాడే భాగ్యం కూడా దక్కింది. ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి తీసుకుని వెళ్లడానికి అనుమతి తీసుకోెవాలి. కొన్ని ఫారాలు నింపి, అక్కడి సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force- CISF) కమాండోల నుంచి అనుమతి తీసుకోవాలి. మొదటిసారి ఈ పనిచేశా. ఫారంలో నా పేరు, అడ్రస్ రాయలేదని ఓ జవాన్ అభ్యంతరం చెప్పడం. నేను ఏదో సమాధానం ఇచ్చోలోపు. కుచ్ బీ నై హోతా. బాద్ లిఖో (ఏం కాదు. తరువాత రాయండి) అని సీల్ వేసి, సంతకం చేశారు. ఎందుకబ్బా అంత ఉదారంగా వ్యవహరించారనే సందేహం వచ్చింది. అయినా వారు చెప్పింది. చేయాలి. సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. రాస్తుండగానే ఓ సీనియర్ కమాండోతో మాటలు కలిపాను. నా గురించి చెబుతుండానే.. "నేను తెలుగువాడినే సార్. మాది అనంతపురం జిల్లా అని బాబు అనే సీఐఎస్ఎఫ్ జవాన్"తో పరిచయం ఏర్పడింది. వెంటనే కోరిందే తడవుగా ఆయనతో ఫొటో తీసుకునేందుకు కూడా ఓకే అన్నారు. ఎంతైనా రాయలసీమ మమకారం వదులుకోలేదనిపించింది.
ఈ లాంఛనాలు పూర్తి చేసుకుని,
రాత్రి 8.45 గంటలకు షార్ మొదటి గేట్ నుంచి లోపలికి చేరుకున్నాం. బస్ పార్కింగ్ చేయగానే, జర్నలిస్టు సైనికులు ఉరుకులపై ఉన్నారు.
ఎందబ్బా అని చూస్తే, డైనింగ్ హాల్ పైకి దండయాత్ర చేశారు. అప్పటికి నిండిపోయినట్లు కిటికిలో నుంచి కనిపిస్తూనే ఉంది. పంచభక్ష పరమాన్నానికి ఏమాత్రం తీసిపోకుండా కప్పులో జామూన్, రోటీ, ఉర్లగడ్డ ఖుర్మ, వేడిదోసే, గట్టి చట్నీ, చిక్కటి పెరుగు పచ్చడి, ముంతమామిడి పప్పుతో తయారు చేసిన వెజిటబుల్ రైస్, ఒకపక్క,
అన్నం, వేడివేడి సాంబార్, రసం, వడియాలు, మామిడి ఊరగాయ, గడ్డ పెరుగు మరో పక్క. దండయాత్ర మామూలుగా లేదులే.
8.50 నిమిషాలకు నేను నిమ్మళంగా శ్రీహరికోటలోని మీడియా సెంటర్ ప్రధాన ద్వారా వద్దకు చేరుకున్నా. ముందు మావాడు దినేష్ (రిపోర్టర్) గంతులు వేసుకుంటూ వెళ్లి తమాషా చూస్తున్నాడు. అబ్బాయ్ మంచి ఫోటోలు తీయరా నాయనా అని వాడికి చెప్పడమే తప్పైంది. నేను లాప్ టాప్ బ్యాగ్ తీసి చూపిస్తున్నా. ఆప్ కా ఐడీ కార్డ్ కహా (మీ గుర్తింపు కార్డు ఎక్కడ) అని ఓ జవాన్ ప్రశ్న. ఓ చేత్తో బ్యాగ్ పట్టుకుని, జేబులో నుంచి కార్డు చూపిస్తుంటే, మనోడు దినోష్ తీసిన ఫోటోతో నన్ను ఆటపట్టించడం మొదలు పెట్టాడు.సెక్యూరిటీ లాంఛనాలు పూర్తయ్యాక. నేను చిన్న మనవి అనగానే. ఓకే అంటూ, అక్కడి జవాన్లు నాతో కలిసి ఫోటోలకు సహకారం ఇచ్చారు. ముందుకు కదులుతూ వారికి సెల్యూట్ చేశా. వారంతా అటెన్షన్ గా వందనం స్వీకరించడం ముచ్చటేసింది. యూనిఫాం డిసిప్లేన్ అలాగే ఉంటుంది కదా?!
రాత్రి 9.30 మీడియా కేంద్రంలోకి చేరుకున్నాం. పెద్దహాల్. కుర్చీలో కూర్చుని, ముందు ఉన్న టేబుల్ మీద నేను తీసుకుని వెళ్లిన హార్మనీ పెట్టె (నాకు కొందరు మిత్రులు సరదాగా అలా పెట్టని పేరు) తెరిచి, రాకెట్ లాంచింగ్ కు ముందు మా రిపోర్టర్ దినేష్ సహకారంతో Thefederal AndhraPradesh, And Telangana సైట్ లో బిగ్ బ్రేకింగ్, స్టోరీ షెడ్యూల్ చేసేశాం. వెంటనే అన్ని సర్దుకుని మీడియా కేంద్రానికి పైభాగాన ఉన్న వ్యూపాయింట్ వద్దకు చేరుకున్నాం.
అప్పటికే అన్ని రాష్ట్రాల నుంచినేషనల్ మీడియా ఛానెళ్ల ప్రతినిధులు, లైవ్ ప్రోగ్రాం సాగుతోంది. దేశంలోని అన్ని భాషల మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికి తరహాలో వారు శ్రీహరికోట, షార్, ఇస్రో సాధించిన విజయాలను టీవీ ప్రేక్షకులకు అందించడానికి బిజీగా ఉన్నారు.
సమయం గడుస్తోంది.
అంత చలిలో కూడా సీఐఎస్ఎఫ్ జవాన్లు, ఇస్రో సిబ్బంది మీడియాకు సహకారం అందిస్తూ, మార్గనిర్దశం చేస్తున్నారు. అనకున్న సమయం దగ్గర పడింది. కంట్రోల్ రూంలో ఈసారి మహిళ ఉద్యోగితో పాటు, మరో అధికారి స్వరం మైకులో ఊపిరిపోసుకున్నాయి. లాంచింగ్ కౌంటింగ్ స్టార్ట్. 10, 9, 8... 3,2,1 మైనస్ వన్, జీరో అంటున్నారో లేదో...


రాత్రి 10 గంటలకు అల్లంత దూరాన భారీ చెట్ల మధ్య ఓ కాంతిపుంజం ఆరెంజ్ కలర్ లో కనిపించింది. క్షణాల వ్యవధిలోనే ఢమఢమ, ధమ..ధమ శబ్దాలు వినిపిస్తున్నాయి. కన్ను మూసి తెరిచే లోపు భారీ రాకెట్ చెట్ల మధ్య నుంచి పైకి లేచింది. ఆ దృశ్యం సెల్ ఫోన్లలో బంధించడానికి భారీగా గుమిగూడిన మీడియా మిత్రులు, కొన్ని అడుగులు పైకి ఎగిసిందో.. లేదో... అప్పటి వరకు అంధకారంతో నిండి ఉన్న ఆకాశం వెలుగులతో నిండింది. ఆకాశంలో ఏదైనా పెద్దలైటు ఏర్పాటు చేశారా? అనేపించే విధంగా కనుచూపు మేర నారింజ రంగు కాంతులు విరజిమ్మాయి. ఏటవాలుగా నిప్పులు చిమ్ముతూ రోదసీలోకి దూసుకుపోతున్న వాహకనౌక నుంచి విడిభాగాలు వేరవుతూ ఉండడం స్పష్టంగా కనిస్తోంది. ఆ భాగాలన్నీ దగ్గరలోనే ఉన్న సముద్రంలోకి జారిపోతూంటే, సరంజామా సర్దుకున్న మీడియా ప్రతినిధులు మళ్లీ మీడియో సెంటర్ లోకి వెళుతున్నారు.
నాకు మాత్రం నింగికెగసిన ఆ రాకెట్ చూస్తుంటే, చిన్నతనంలో పొగ వదులుతూ సాగిన రాకెట్ గుర్తులు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, విమానాలను చూసి, కథలు చెప్పుకున్న రోజుల నుంచి రాకెట్ ప్రయోగ కేంద్రంలోనే నిలబడి చూస్తానని అనుకోలేదు. విచిత్రంగా అనిపిచింది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మీడియో సెంటర్ లోకి రావడం. కొద్ది సేపటికి రాకెట్ గమనాన్ని పర్యవేక్షించే కంట్రోల్ రూం నుంచి ఇస్రో చైర్మన్ సోమనాథ్ తన సహచర సైంటిస్టులతో వచ్మీచారు. సుమారు గంటపాటు మీడియాతో ముచ్చటించారు.
2025లో అనేక మైలురాళ్లు అధిగమించే లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వివరించి, అందరి నుంచి వీడ్కోలు తీసుకున్నారు.

రాత్రి 11 గంటలు : తిరిగి బయలుదేరడానికి మీడియా సెంటర్ నుంచి బయటికి వచ్చే సరికి, అప్పటికే మళ్లీ దండయాత్ర సాగుతోంది. వేడి టీ కోసం కొందరు. కవర్లలో ఉంచి, ఇస్తున్న స్నాక్స్ కోసం ఇంకొందరు హడావుడి పడుతుంతే, నేను వారితో జత కలిశా. కప్పు టీ తాగి, కేక్, సాల్ట్ బిస్కెట్ ఉన్న కవర్ తీసుకుని, బస్సు ఎక్కా. ప్రయాణం మొదలయ్యాక మళ్లీ దడ పట్టుకుంది. మొదటిసారి నేను లాప్ లాప్ తీసుకుని షార్ లోకి వెళ్లా. ఆ పత్రాలు బయటికి వచ్చేటప్పుడు తిరిగి అప్పగించాలి. ఫోన్ కాల్ లో ఏమారిన నేను... గేట్ దాటేశామని అనుకున్నా. ఇదే విషయం పీఆర్ ఓ గుప్తాకు చెప్పగానే డోంట్ వర్రీ సార్. నేను మేనేజ్ చేస్తా అని అభయం. నా భయం నాది. ఇది అత్యంత సున్నితమైన ఏరియా. పేపర్లు అప్పగించకుంటే ఏ సమస్య వస్తుందో అనే భయం. ఈ లోపే షార్ వెలుపల మరో సెక్యూరిటీ పాయింట్ రావడం. మా బస్సు ఆగడం జరిగిపోయాయి. హమ్మయ్య అనుకుని, పీఆర్ఓ నుంచి ఆ పేపర్లు తీసి, సీఐఎస్ఎఫ్ జవాన్లకు అప్పగించాక గానీ నా భయం తీరలేదు.
శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి నేను వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. చివరిదీ కాకపోవచ్చు. పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం చేయడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ప్రతిష్ట ప్రపంచ యవనికపై చెరగని సంతకం చేయించిన చారిత్రక ఘట్టానికి నేనూ ఓ ప్రత్యక్ష సాక్షిని.
2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, శ్రీహరికోట నాకు జీవితంలో మరిచిపోలేని జ్నాపకాన్ని అందించిన 2024కు వీడ్కోలు తీసుకుంటోంది.
Read More
Next Story