స్టూడెంట్స్ పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ అంటే తెలుసా..? నేనే వివరిస్తా...
x
పాఠం చెబుతున్న పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్.

స్టూడెంట్స్ పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ అంటే తెలుసా..? నేనే వివరిస్తా...

బడిలో టీచర్ గా మారిన పుట్టపర్తి జిల్లా కలెక్టర్.


రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారులు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. పాలనతో పాటు సిబ్బంది సామర్థానికి కూడా పరీక్ష పెడుతున్నారు. అన్ని అంశాలపై మాకు అవగాహన ఉందనే హెచ్చరిక లాంటి సూచనలు కూడా ఇస్తున్నట్లే కనిపిస్తోంది.


సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలో మంగళవారం మండల ప్రాథమిక పాఠశాల( MPP School) , జెడ్పీహైస్కూల్ (ZP HIGH School ) ను సందర్శించిన శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఉపాధ్యాయుడి పాత్ర పోషించారు. ఆయన పాఠాలు చెప్పిన తీరు టీచర్లను కూడా ఆకట్టుకుంది. పాఠశాలల్లో జాగ్రత్తగా విధులు నిర్వహించడమే కాదు. పాఠాలు చెప్పకుంటే తిప్పలు తప్పవనే సంకేతం టీచర్లకు అందింది.

కలెక్టర్ శ్యాంప్రసాద్ బోధన ఎలా సాగిందంటే..

స్టూడెంట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటో తెలుసా?
ఇంగ్లీషులో వ్యాకరణ రచన, మాటలకు ఇది తొలి మెట్టు. ఒక వాక్యంలో ఓ పదం రాయడం లేదా మాట్లాడడానికి భాషలో భాగంగా ఉంటుంది. ఆ విధంగా ఇంగ్లీషులోని పదాలను మొత్తం ఎనిమిది భాగాలుగా విభజించారు. దీనినే ( Parts of Speech) అంటారు. ఓకే. అర్థమైంది కదా..? గుడ్.
బడిలో పిల్లలు మొదటగా నేర్చుకోవాల్సింది. చదవడం, రాయడం, లెక్కలు వంటి మౌలిక నైపుణ్యాలు పెంచుకోవాలి. ఈ సూచన గుర్తు పెట్టుకోండి.
హిందీ పాఠం ఎలా చెప్పారంటే..
స్టూడెంట్స్.. తెలుగు, ఇంగ్లీషు తోపాటు హిందీ కూడా నేర్చుకోవాలి. పిల్లలు మాట్లాడాలి అని కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, తరగతి గదిలో టీచర్ గా మారారు. చాక్ పీస్ తీసుకున్న ఆయన బ్లాక్ బోర్డుపై ఇంగ్లీషు పదాలు రాసి, గ్రామర్ చెప్పారు. హిందీ పదాలు రాసి, అర్థాలు చెప్పారు. తరగతి గదిలో బ్లాక్ బోర్డుపై ఇంగ్లీషులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గ్రామర్, హిందీ భాష విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయడం ద్వారా ఉపాధ్యాయులతో పోటీపడినట్లు పాఠాలు చెప్పారు.
"హిందీ అంటే నాకు చాలా ఇష్టం. విద్యార్థులు రోజుకు ఒక పదం నేర్చుకోండి. ఆ పదంతో వచ్చే నానార్థాలు పది రాయండి. మరుసటి రోజు మరో పదం నేర్చుకోండి" అని విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా పాఠాలు చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక సాక్షరత, సంఖ్యాజ్ఞానం (FLN) కార్యక్రమములో భాగంగా బుక్కపట్నం మండల ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పరీక్షను కలెక్టర్ శ్యాంప్రసాద్ పరీశిలించారు. పిల్లలు మొదటగా నేర్చుకోవాల్సిన చదవడం, రాయడం, లెక్కలు వంటి మౌలిక నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు.
బడి పంతులుగా కలెక్టర్
బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించారు. పదో తరగతి - విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, హింది, గణిత భాషల్లో అనేక ప్రశ్నలు అడిగారు. బోర్డుపై స్వయంగా ఆంగ్లం లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గ్రామర్, హిందీ భాష రాయడం ద్వారా విద్యార్థులకు అర్థమయ్యేలా కలెక్టర్ బోధించారు.
కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు పిల్లలు కూడా చక్కగా సమాధానాలు ఇవ్వడంతో ఆయన సంతృప్తి చెందారు. ఇంగ్లీషు, గణితంలో మెలకువలను తెలియజేశారు. Mega PTM లో భాగంగా విద్యార్థులలో విలువల విద్యను పెంపొందించడానికి "విలువల విద్య"అనే పుస్తకంలోని పద్యాలను విద్యార్థి B. హారికతో చదివించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ వెంట ఆర్డీఓ సువర్ణ, డీఈఓ కృష్ణప్ప, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ నరసింహలు, ప్రధానో పాధ్యాయురాలు వెంకటనరసమ్మ, బుక్కపట్నం MEO 1&2 గోపాల్ నాయక్, మోహన్ బాబు పాఠశాల సిబ్బంది ఉన్నారు.

వాగ్గేయకారులు ఎలా అయ్యారు..?

భగవత్ సేవలో తెలుగు వారెందరో వాగ్గేయకారులుగా చరిత్రలో నిలిచారని విద్యార్థులకు తెలుగు పాఠం చెప్పిన కలెక్టర్ శ్యాంప్రసాద్ చరిత్రను వివరించారు.

"పదకవితా పితామహుడు అన్నమయ్య, కీర్తనలతో త్యాగయ్య భగవత్ నామ స్మరణ చేశారు. అందుకే వారు జన్మసిద్ది పొందారు" అని వివరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ మానసిక ప్రశాంతత కోసం కీర్తనలు వినడంతో పాటు అందులోని సారాంశాన్ని కూడా అర్థం చేసుకుంటే, మనసు ప్రశాంతంగా ఉంటుందని సామాజికశాస్త్రాన్ని కూడా బోధించారు. మనసు నిలకడగా ఉంచుకోవడం ద్వారా అనుకున్న లక్ష్య సాధనకు మార్గం సులువుగా ఉంటుందని చెబుతూ, పిల్లలు చదువుపై దృష్టి నిలపాలని ఆయన కర్తవ్య బోధ చేశారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలు సద్వినియోగం చేసుకుని, ఉన్నత విద్యలో కూడా రాణించాలని ఆయన హితవుతో కూడిన పాఠాలు చెప్పారు.

Read More
Next Story