అందుకేనా మళ్లీ ... కొండెక్కిన టమాట ధర
x

అందుకేనా మళ్లీ ... కొండెక్కిన టమాట ధర

సామాన్యుడికి దొరకనంతగా టమాటా ధర ఆకాశాన్ని అంటుతోంది. తరచూ ఈ పరిస్థితికి కారణం ఏమిటి? దీని వల్ల ఎవరికి మేలు జరుగుతోంది. సగటుజీవి కోసం మార్కెటింగ్ శాఖ ఏమి చేస్తోంది?


పొరుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి లేకపోవడం. స్ధానికంగా దిగుబడి తక్కువ కావడం వల్ల టమాటా కిలో ధర సెంచురీ మార్క్ దాటింది. ఈ ధరలు ఇంకా కొన్నిరోజులు కొనసాగే అవకాశం ఉంది. నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ రైతుబజార్ల ద్వారా సగం ధరకు అందుబాటులో ఉంచింది.

ఆసియాలోనే ప్రధమ స్థానంలో ఉన్న మదనపల్లె, ద్వితీయ స్ధానంలోని కర్ణాటక రాష్ట్రం కోలార్ టమాటా మార్కెట్ల పరిధిలో దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మదనపల్లె మార్కెట్లోనే కిలో రూ. 80 నుంచి 85కు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఆ ధర రూ. 100 మార్కు దాటింది. వినియోగదారులకు భారం కాకుండా, మార్కెటింగ్ శాఖ అధికారులు రాష్ట్రంలోని రైతుబజార్ల ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు.

మదనపల్లె డివిజన్లోని టమాటా ఉత్పత్తికి దేశంలోనే మంచి గిరాకీ ఉంది. సాధారణంగా ఏడాదిలో టమాట దిగుబడి మార్చి నుంచి ఏప్రిల్ లేదా మే నెల వరకు ఉంటుంది. మే, జూన్ తర్వాత దిగుబడి తక్కువగా ఉంటుంది. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాల వల్ల పంట దిగుబడి తక్కువగా ఉంటే, మాత్రం ఏడాది పొడవునా దిగుబడి ఉండే, మదనపల్లె మార్కెట్ పై పొరుగు రాష్ర్ట వ్యాపారులు దృష్టి కేంద్రీకరిస్తారు. దీంతో ఇక్కడి టమాటాలకు డిమాండ్ ఉంటుంది. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ ఊరట కొన్ని రోజులు మాత్రమే. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది.




ఆసియాలోనే ప్రసిద్ధి

ఆసియాలోనే తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి71 మార్గంలోని పల్లెలు చిన్నపాటి పట్టణాలు టమాట ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 14,588 హెక్టార్లలో సాగవుతున్న టమాట తోటల నుంచి ప్రతి సంవత్సరం 2,62,584 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఉత్పత్తికి కాశ్మీర్ ఆపిల్ కు ఎంత ప్రఖ్యాతి ఉందో.. మదనపల్లె ప్రాంతంలో టమాటాకు అంతా ప్రాధాన్యత ఉంటుంది. ఈ డివిజన్లోని మదనపల్లి, అంగళ్లు, వాల్మీకిపురం, గుర్రంకొండ, చింతపర్తి, పలమనేరు, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె ప్రాంతాలలో టమాటా తోటలు సాగు చేస్తున్నారు. వాల్మీకిపురం వ్యవసాయం మార్కెట్ కమిటీ పరిధిలో 2000 ఎకరాల్లో టమాటా తోటలు సాగులో ఉన్నాయి. ఆ టమాటాలను మదనపల్లి ఆ తర్వాత అంగళ్ళు, గుర్రంకొండ, పలమనేరు, చింతపర్తి మార్కెట్లకు తరలిస్తుంటారు.
మదనపల్లె తరువాత ప్రాధాన్యత కలిగిన మార్కెట్ వాల్మీకిపురం పరిధిలోని గుర్రంకొండ మార్కెట్కు దక్కుతుంది. "మా మార్కెట్ పరిధిలో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. గురువారం 28 టన్నులు మాత్రమే కాయలు వచ్చాయి" అని ఆ మర్కెట్ కమిటీ అధికారి శారదమ్మ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
తాజా ధరలు
చుట్టుపక్కల ఉన్న పల్లెల రైతులు మదనపల్లె మార్కెట్ యార్డ్ కు టమోటా తీసుకువస్తారు. సాధారణం కంటే ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. గురువారం 788 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినట్లు మదనపల్లె టమాట మార్కెట్ కమిటీ కార్యదర్శి తుంబూరు అభిలాష్ తెలిపారు. దీంతో ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ 10 కిలో క్రేట్ రు. 880 పలికింది. అంటే కిలో టమాటా రూ. 86 ధర పలుకుతోంది. బయటి దుకాణాలకు వచ్చేసరికి ఆ ధర రూ. వంద నుంచి 110కు విక్రయిస్తున్నారు. సెకండ్ గ్రేట్ క్వాలిటీ ఉన్న 10 కిలోల క్రేట్ ధర 750 వరకు పలుకుతోంది. ఈ ప్రాంతంలో ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ఈ ధర పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ నెల 17వ తేదీ నుంచి టమాట ధరలు మెల్లమెల్లగా ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటాల్ టమాట రూ. 6900 నుంచి ప్రారంభమై, రూ. 8000 వేలకు వెళ్లింది. గత ఏడాది నవంబర్ రూ. 1600 నుంచి ప్రారంభమై, రూ. 2,680 వరకు ధర పలికింది. ప్రస్తుతం అందుకు రెట్టింపు ధరలు రైతులకు దొరుకుతున్నాయి. దీనికి మరో కారణం కూడా ఉంది...
రైతు బజార్లలో విక్రయం
టమాట ధరలు పెరగడం వల్ల వినియోగదారులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్కడ రూ. 50కి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మార్కెట్ల నుంచి మాత్రమే టమాటాలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని గుంటారూరు, విశాఖపట్టణం, విజయవాడ, ఏలూరు, కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు పంపిస్తున్నారు. అక్కడ రైతుబజార్ల ద్వారా సబ్సిడీ ధరకు విక్రయిస్తున్నారు.
పొరుగున తగ్గిన దిగుబడి
చిత్తూరు జిల్లాకు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించి వేళ టమాట దిగుబడి దెబ్బతినింది. తమిళనాడులో తిరుచ్చి, మధురై, కుంభకోణం, చెన్నై మార్కెట్లతో పాటు ఆసియాలోనే రెండో పెద్ద మార్కెట్ కోలార్, ఆ తరువాత స్థానంలో ఉన్న కోలార్ నుంచి వ్యాపారులు విపరీతంలో మదనపల్లె మార్కెట్కు వచ్చారు. దీంతో ధరలు మరింతగా పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. ఇక్కడి మార్కెట్లోనే క్వింటాల్ టమాటాకు మదనపల్లి మార్కెట్ నుంచి వెళ్లే 60 శాతం దిగుబడిపై ఆ రాష్ట్రాల మార్కెట్ ఆధారపడి ఉంటాయి. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దిగుబడి తక్కువగా ఉండటం వల్ల మదనపల్లి ప్రాంతం నుంచి కూడా సరుకు రవాణా అవుతోంది. అంతేకాకుండా మదనపల్లెకు అత్యంత సమీపంలోనే ఉన్న కర్ణాటక పరిధిలోని కోలార్, వడ్డిపల్లి, చింతామణి, రాయల్పాడు టమాటా మార్కెట్ పరిధిలో కూడా దిగుబడి తక్కువగా ఉన్న కారణంగా మదనపల్లె మార్కెట్ నుంచి రవాణా అవుతోంది. దీనివల్ల దిగుబడి తక్కువ కావడం వల్ల ధరలు పెరగడానికి ఆస్కారం ఏర్పడింది.
దీనిపై మదనపల్లె టమాట మార్కెట్ కమిటీ కార్యదర్శి తుంబూరు అభిలాష్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, "అంచనా మేరకు 1500 టన్నుల దిగుబడి రావాలి. ప్రస్తుతం దిగుబడి తక్కవ అయింది. అందుకే గురువారం 600 నుంచి 700 టన్నుల వరకు వచ్చాయి" అని చెప్పారు. నాలుగు రోజులుగా ధరలు స్ధిరంగా ఉన్నాయి. మార్కెట్లోనే వ్యాపారులు కిలో రూ. 80 నుంచి 85 కు కొనుగోలు చేస్తున్నారు" అని అభిలాష్ వివరించారు. ఈ ధరల ప్రభావం ఇంకొన్ని రోజులు కొనసాగు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశంలో మార్కెట్లపై ప్రభావం
మదనపల్లె మార్కెట్ యార్డ్ నుంచి టమాటాలు కొనుగోలు చేయడానికి ఒరిస్సా, ఛత్తీస్గడ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు వస్తూ ఉంటారు. గత రెండేళ్లుగా ఒడిస్సా ఛత్తీస్గఢ్లో కూడా ఈ ప్రాంతం నుంచి తీసుకువెళ్లిన రైతులు కూలీలతో టమాటా పంట సాగుకు శ్రీకారం చుట్టారు. అందువల్ల ఆ రాష్ట్రాల నుంచి మినహా, మిగతా ప్రాంతాల నుంచి మదనపల్లి మార్కెట్ కు వచ్చే వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి రవాణా చేస్తుంటారు. ఏడాదిలోని రెండో సీజన్లో ఇది సర్వసాధారణం ఆ పరిస్థితి ఇంకా ప్రారంభం కాలేదు. ఆ ప్రాంత వ్యాపారులు మదనపల్లె మార్కెట్ కు వస్తే ధరలు ఆకాశాన్ని అంటే అవకాశాలు లేకపోలేదని మదనపల్లి మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే..
గత ఏడాది రికార్డు
మదనపల్లి మార్కెట్ 27 ఏళ్ల చరిత్రలో ఆల్ టైం రికార్డ్ నమోదయింది. అంటే ఉత్పత్తి గణనీయంగా వచ్చినప్పటికీ రైతుకు, వ్యాపారులకు ఇబ్బంది లేని రీతిలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది అందులో భాగంగా. క్రితం మదనపల్లె మార్కెట్ చరిత్రలో మొదటిసారి 1500 మెట్రిక్ టన్నుల చొప్పున టమాటాను మార్కెట్కు తీసుకువచ్చారు. 1993లో మార్కెట్ కమిటీలు టమాటా కొనుగోలు అమ్మకాలు ప్రారంభమైన నాటి నుంచి ఇంత భారీ స్థాయిలో సరుకు రావడం అనేది ఓ రికార్డు అని మార్కెట్ వర్గాలే చెప్పాయి. భారీగా వచ్చిన సరుకును రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడులోనే కాంచీపురం, ఆరణి, కుంభకోణం తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలోనే వచ్చిన వ్యాపారులు మదనపల్లి మార్కెట్లో కొనుగోలు చేశారు. ఆ సందర్భంలో మొదటి రకం టమాటా కిలో రూ. 4.80 నుంచి ఆరు, రెండో రకం టమాటా మూడు నుంచి రు. 4.60 ధర పలికింది. భారీగానే వచ్చిన సరుకు నిలువ ఉంచని విధంగా... ఏరోజు కారోజు దూర ప్రాంతాలకు రవాణా చేయడం వల్ల, రైతులకు మేలు జరిగిందనేది వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల మాట
మరో రికార్డ్..
మదనపల్లె మార్కెట్ చరిత్రలో మరో రికార్డ్ కూడా గత ఏడాది నమోదయింది. మదనపల్లెకు వచ్చిన సరుకు తక్కువగా ఉండటం వల్ల గత ఏడాది సీజన్ మధ్యలోని కిలో టమాట రు. 140 నుంచి 160 వరకు పలికింది. ఇతర ప్రాంతాల్లోని బహిరంగ మార్కెట్లకు వచ్చేసరికి ఆ ధర రూ. కిలో రూ. 200 అయ్యింది. దీంతో ప్రభుత్వ వ్యవసాయ శాఖ రూ. వందకు కొనుగోలు చేసి రూ. 50కి రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల అటు రైతులు, వినియోగదారులకు మేలు జరిగింది. ప్రస్తుతం కూడా అదే పద్ధతిని అనుసరిస్తుండడం వల్ల వినియోగదారులకు కాస్త ఊరట దొరుకుతోంది.
Read More
Next Story