తిరుపతి జిల్లాలో రెండు రోజులు మారిషస్ అధ్యక్షుడి ఆధ్యాత్మిక పర్యటన..
x

తిరుపతి జిల్లాలో రెండు రోజులు మారిషస్ అధ్యక్షుడి ఆధ్యాత్మిక పర్యటన..

6 నుంచి తిరుమల,శ్రీకాళహస్తి క్షేత్రాల సందర్శన.


తిరుపతి జిల్లాలో మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జిసిఎస్కే ఈ నెల ఆరో తేదీ నుంచి రెండు రోజులు పర్యటించనున్నారు. జిల్లా అధికారులు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ రాష్ట్ర పర్యటనలో ఉన్నారు.

తిరుపతి జిల్లాలో పర్యటనకు ఆరో తేదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మరుసటి రోజు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారికంగా మనిట్ టు మినట్ కార్యక్రమం జారీ చేయలేదు.

జిల్లాలో మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ (ఎ.ఎస్.ఎల్) అధికారుల సమన్వయ సమావేశం, భద్రతా ఏర్పాట్లపై ఆదివారం జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య (ఇంచార్జి), ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు అధికారులతో సమీక్షించారు.


తిరుపతి జిల్లా ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాస రావు, నాగభూషణ రావు, వెంకటరాముడు, శ్రీకాళహస్తి ఆర్‌డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్‌ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, ఐబీ అధికారి శిరీషా, డీఎస్పీలు రామకృష్ణాచారి, చంద్రశేఖర్, భక్తవత్సలం, రామకృష్ణ, చిరంజీవి, ప్రసాద్, రాంబాబు, అంకారావు, వెంకటనారాయణ, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్, డీఐపీఆర్ఓ గురుస్వామి చెట్టి, రేణిగుంట తహశీల్దార్ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


"మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ ఈ నెల ఆరో తేదీ నుంచి రెండు రోజులు తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలి" అని ఇంచార్జి జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య స్పష్టం చేశారు.

"వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేయాలి. సేఫ్ రూమ్, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, అవసరమైన రక్త గ్రూపులు, మందులు అందుబాటులో ఉంచండి" అని ఇంచార్జి జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖులకు అందించే ఆహారాన్ని నిబంధనల మేరకు పరీక్షించాలని ఆదేశించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. కాన్వాయ్ వాహనాలు మంచి కండీషన్‌లో ఉండేలా ముందుగానే పరిశీలించాలని సూచించారు. ప్రోటోకాల్ అంశాలు, కేటాయించిన విధుల్లో అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎస్ఓకు సూచించారు.
జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు కట్టుదిట్టంగా ఉండాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More
Next Story