
తిరుపతిలో మారిషస్ అధ్యక్షుడి ఆలయాల యాత్ర...
శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమలలో ధరమ్ బీర్ గోకుల్ పర్యటన ఇలా సాగింది..
తిరుపతి జిల్లాలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ రెండు రోజుల పర్యటన మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
రేణిగుంట విమానాశ్రయంలో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు స్వాగతం పలుకుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్
అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరిన మారిషస్ అధ్యక్షుడు శ్రీకాళహస్తికి చేరుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తిలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఆలయ ఈఓ టి. బాపిరెడ్డి స్వాగతించారు. అనంతరం శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో సంప్రదాయబద్ధంగా ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులచే తీర్థప్రసాదాలు అందజేశారు.

