శ్రీవారి ఆలయ పరివట్టం ఎవరిష్టం వారిది..
x

శ్రీవారి ఆలయ 'పరివట్టం' ఎవరిష్టం వారిది..

వైసీపీకి దొరికిన మరో అస్త్రం. భూమనకు బీజేపీ నేత కౌంటర్. ఇంతకీ ఏమి జరిగిందంటే..


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే ఆచారాలు మరోసారి రచ్చకు తెచ్చారు. టిడిపి కూటమి నేతలు, వైసిపి మధ్య పరివట్టం అస్త్రంగా మారింది.

తండ్రికి కర్మక్రియలు నిర్వహిస్తున్న టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరికి పరివట్టం కట్డి, శ్రీవారి ప్రసాదాలు అందించడం ద్వారా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహరించిన తీరు తిరుమల ఆగమ శాస్త్రానికి విరుద్ధం గా ఉందని వైసిపి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు.

టీవీ5లో ప్రసారమైన వీడియో ప్రదర్శించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, పక్కన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్

"మీరు మాత్రం తక్కువ తిన్నారా? గతంలో మీరు చేసింది కూడా ఇదే కదా" అని బిజెపి నేత, టిటిడి పాలకమండలి సభ్యుడు జి భాను ప్రకాష్ రెడ్డి ఎదురుదాడికి దిగారు.
తిరుమల ఆచారాల వ్యవహారంలో నువ్వంటే నువ్వు అనే రీతిలో అపచారాలకు పాల్పడుతున్నారని టిడిపి కూటమి నాయకులు, వైసిపి నేత మధ్య తాజాగా మాటల యుద్ధం ప్రారంభమైంది.
విషయం ఏమిటంటే
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య తండ్రి చలమయ్య తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ప్రభుత్వానికి సమాచారం అందించి స్వగ్రామానికి వెళ్లారు. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. టిటిడి ఉద్యోగులు, పాలకమండలి కూడా సంతాపం ప్రకటించింది.
వివాదం ఏమిటి
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తండ్రి కర్మక్రియలు సోమవారం నిర్వహించారు. స్వగ్రామం లో తండ్రి శ్రద్దకర్మలు జరిగాయి. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు తోపాటు తిరుమల శ్రీవారి ఆలయ బొక్కసం (ఆభరణాల ఖజానా) ఇంచార్జ్ గురు గురు రాజస్వామి తో పాటు వేద పండితులకు కూడా వెళ్లారు.
తండ్రి చలమయ్య కర్మక్రియలు జరుగుతుండగా ఆయన చిత్రపటం ముందే వెంకయ్యచౌదరికి పరివట్టం కట్టారు. శాలువా కప్పి తీర్థప్రసాదాలు అందించారు. దీనిపై టిటిడి మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆక్షేపణ చెప్పారు.
"శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలకు అపకీర్తి ఆపాదించారు. టీటీడీ చైర్మన్ హోదాకు అర్థం పరమార్థం తెలియని వ్యక్తి బిఆర్ నాయుడు" అని భూమన వ్యాఖ్యానించారు.
"తిరుమల శ్రీవారికి నిత్యం అలంకరించడానికి అవసరమైన తిరువాభరణాలు అందించడంలో బొక్కసం ప్రధానమైంది. దీని సంరక్షకుడుగా ఉన్న టీటీడీ ఉద్యోగి గురురాజస్వామి శ్రీవారి ప్రసాదాలు తీసుకుని వెళ్లి ఇవ్వడం తోపాటు వేదఆశీర్వచనం అందించడం దారుణం" అని భూమా కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పరివట్టం అంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో పరివట్టం కట్టడం అనేది ఒక కీలకమైన సంప్రదాయ ఆచారం. తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు, ప్రధానంగా బ్రహ్మోత్సవాల్లో ఈ సంప్రదాయం ఆచరిస్తారు. తిరుమల ఆలయ పెద్ద జీయర్ స్వామి, బ్రహ్మోత్సవాల సమయంలో పెద్దగా వ్యవహరించే టీటీడీ ఈవో లేదా చైర్మన్, ప్రధాన పీఠాధిపతులు మఠాధిపతులకు ఈ గౌరవం దక్కుతుంది. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి, వేద ఆశీర్వచనం అందించే రంగనాయకుల మండపంలో జీయర్ స్వాములు లేదా, మఠాధిపతులు, బ్రహ్మోత్సవ వేళ టీటీడీ ఈవోకు పరివట్టం కడతారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందిస్తుండగా ఒక పట్టు వస్త్రాన్ని ఆ ప్రముఖ వ్యక్తి తలకు రుమాలుగా చుడతారు. ఈ కైంకర్యం ఆలయ అంతర్భాగంలోని నిర్వహించడం ఓ ఆచారంగా వస్తోంది. ఇదిలావుంటే..
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య కర్మ క్రియలకు వెళ్లిన టిటిడి అధికారులు, వేద పండితులు చేసిన తీరుపై భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటున్నారంటే..
"శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ద్రోహం చేస్తున్నారు. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారు. నాయుడు పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి దేశం లేదు కానీ ఆయన ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. తండ్రి కర్మ క్రియల్లో వెంకయ్య చౌదరికి పవిత్ర భాగవత వస్త్రాన్ని కప్పడం. పరివట్టం కట్టి, లడ్డు ప్రసాదాలు వెంకయ్య చౌదరికి అందించారు. ఈ పద్ధతులు ఎక్కడ అనుసరించాలనే విషయం కూడా టిటిడి చైర్మన్ నాయుడుకు తెలియడం లేదు" అని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరేం తక్కువ తిన్నారా..
టిటిడి మాజీ చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి ప్రస్తావించిన అంశాలపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, టిటిడి పాలకమండలి సభ్యుడు జీ. భాను ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

"వైసిపి అధికారంలో ఉండగా మీరు మాత్రం తక్కువ చేశారా? ఆ రోజు మీరు చేస్తే సంప్రదాయం. మేము చేస్తే అపచారమా"? అని భానుప్రకాష్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
అప్పుడు ఏం జరిగింది?
అది 2022 సంవత్సరం..
వైసీపీ ప్రభుత్వంలో టిటిడి అదనపు ఈఓగా ఏవీ ధర్మారెడ్డి పనిచేశారు. ఆయన కొడుకు చంద్రమౌళి రెడ్డి (28)కి చెన్నైలో వివాహం నిశ్చయమైంది. 2023 జనవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. చెన్నైలో శుభలేఖలు పంచుతూ ఉండగా టీటీడీ అదనపు మాజీ ఈఓ ధర్మారెడ్డి కొడుకు చంద్రమౌళికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు చంద్రమౌళి కన్నుమూశారు.
చెన్నై నుంచి స్వగ్రామం కర్నూలు జిల్లా గ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయనను వైసిపి చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పలువురు ప్రముఖులు వేరువేరుగా వెళ్లి పరామర్శించారు. ఇదిలా ఉంటే..
ధర్మారెడ్డి కొడుకు చంద్రమౌళి కర్మక్రియల రోజు టీటీడీ నుంచి కూడా అధికారులు సిబ్బంది చాలామంది వెళ్లారు.
"ఆ సమయంలో కొడుకు చంద్రమౌళి ఫోటో ఎదురుగా నివాళులర్పిస్తుంటే, ఆ సమయంలో టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. దశదినకర్మల్లో టీటీడీ వేద పండితులు ధర్మారెడ్డికి పరివట్టం కట్టడం. శాలువ కప్పడం ఏ ధర్మశాస్త్రానికి నిదర్శనం" అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి నిలదీశారు.
ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఒకటి అర్థమవుతుంది. తిరుమల ఆచార వ్యవహారాలు ఆలయానికే పరిమితం చేయడం లేదు. తమకు నచ్చిన రీతిలో ఎవరికి తగినట్లు వారు అనుసరిస్తున్నారు అనే విషయం స్పష్టం అవుతుంది.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఎదురుదాడి ఎలా ఉందంటే..
"ఆ రోజు మీరు కొడుకు కర్మ క్రియలను నిర్వహిస్తున్న ధర్మారెడ్డికి పరివట్టం కట్టారు. ఈ రోజు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కట్టారు. ఇందులో తప్పేముంది. మీరు మేము ఒకటే" అన్నట్లుగానే బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి మాటలు చెప్పకనే చెబుతున్నాయి.
Read More
Next Story