
Kadapa | గండికోట రహస్యం: వైష్ణవి ఊపిరి తీసిన మూడో హస్తం ఎవరిది?
విచారణకు సిద్ధమని ఆమె అన్న అంటున్నారు. ప్రేమికుడు కాదని పోలీసులు నిర్ధారించారు.
కడప జిల్లా గండికోట వద్ద ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య కేసు మిస్టరీ వీడలేదు. ప్రేమికుడి పాత్ర లేదని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. మృతురాలు వైష్ణవి పెదనాన్న కొడుకు సురేష్ వైపే అన్ని వేళ్లు చూపిస్తుంటే..
"నేను ఏ విచారణకైనా సిద్ధం. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తా" అని సురేష్ చెబుతున్నాడు.
ఇంతకీ ఇంటర్ విద్యార్థిని వైష్ణవిని చంపిన అదృశ్య హస్తం ఎవరిది? వారిని ప్రేరేపించిన వారు ఎవరు?
"ఈ విషయంలో కీలక ఆధారాలు దొరికాయి" అని డీఐజీ కోయ ప్రవీణ్ చెబుతున్నారు.
గండికోటలో ఏమి జరిగింది?
కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని హనుమనగుత్తి గ్రామానికి చెందిన వైష్ణవికి తన పక్కింటి యువకుడు లోకేష్ తో ప్రేమలో పడింది. మందలించినా, ఫలితం లేక, జీవనాన్ని ప్రొద్దుటూరుకు మార్చారు. వైష్ణవి ప్రస్తుతం ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.
లోకేష్ తో కలిసి ఆమె జమ్మలమడుగు సమీపంలోని గండికోట పర్యాటక కేంద్రానికి వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె పెదనాన్న కొడుకు, పోలీసులు గాలింపు చర్యలకు దిగారు.
సోమవారం ఉదయం
ఉదయం 8. 38 గంటలు
లోకేష్ తో కలిసి వైష్ణవి బైక్ లో వెళుతున్న దృశ్యం గండికోటకు రెండు కిలోమీటర్లకు ముందే ఉన్న చెక్ పోస్ట్ లోని సీసీ టీవీలో రికార్డు అయింది.
ఉదయం 10. 37 గంటలకు లోకేష్ ఒక్కడే బైక్లో తిరిగి రావడం సీసీటీవీ లో నమోదైంది.
మంగళవారం ఉదయం
వైష్ణవి మృతదేహం ముళ్లపొదల్లో కనిపించింది. దీంతో లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేశారు. పోస్టుమార్టం నివేదికలో
"మధ్యాహ్నం 12 గంటల వరకు సజీవంగానే ఉంది" అని వైద్యులు స్పష్టం చేశారని డీఐజీ కోయ ప్రవీణ్ ఈ విషయం చెబుతూ, వైష్ణవి హత్యలో ఆమె ప్రేమికుడు లోకేష్ పాత్ర లేదని నిర్ధారించారు.
"నా సొంత చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. నేను ఏమి అనలేదు. మా బాబాయ్ కూతురు చనిపోయిన బాధలో మేముంటే ఈ నిందలు వేధిస్తున్నాయి" అని సురేష్ ఆవేదన చెందారు.
ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతోంది?
Next Story