
Mahashivratri Brahmasavam |మాఘమాసం వచ్చింది.. శివరాత్రిని తెచ్చింది
జ్యోతిర్లింగం, శైవక్షేత్రాల్లో సందడి మొదలైంది. శ్రీశైలం, కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సీఎం మొదటిసారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
మాఘమాసంలో వివాహాలు చేయడానికి మంచి ముహూర్తంగా పండితులు నిర్ణయించారు. ఈ మాసంలో పెళ్లిళ్లు జరిగితే మంచిదని భావిస్తారు. ఆదిదంపతులైన పార్వతీ, పరమేశ్వరులకు ప్రీతిపాత్రమైంది. దీంతో శైవాలయాలకు భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రధానమైనవి శ్రీకాళహస్తి, శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు కొలువైన ఆధ్యాత్మిక కేంద్రాలు కావడం గమనార్హం. మహాశివరాత్రి సందర్భంగా ఇదే మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మార్చి నెల ప్రారంభం వరకు ఈ క్షేత్రాలకు యాత్రికులు పోటెత్తుతారు. దీంతో ఈ ఆలయాల వద్ద ఏర్పాట్లకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 26 తేదీ మహాశివరాత్రి పర్వదినంగా పండితులు నిర్ణయించారు. చతుర్దశి తిథిలో ఉదయం 11.08 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8.45 గంటలకు ముగుస్తుంది. 26వ తేదీ ఉదయం నుంచి ఉపవాసంతో, అదే రోజు రాత్రి జాగారం చేయడం ద్వారా లింగోద్భవ దర్శనం చేసుకునే భక్తులు మరుసటి రోజు ఉదయం 6.48 గంటల నుంచి 8.54 గంటల మధ్య ఉపవాసం విరమించాలని పండితులు సూచిస్తున్నారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు ప్రధాన ఆలయాల్లో కూడా మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, తిరుపతి నగరంలో టీటీడీ ఆధీనంలోని కపిలేశ్వరస్వామి ఆలయాల్లో ( Kapileshwara Temple Tirupati ) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో (Srisailam) 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా (తిరుపతి జిల్లా) శ్రీకాళహస్తి ( Srikalahasti )లో 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 13 రోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
మొదటిసారి రానున్న సీఎం
తిరుమల మినహా మిగతా ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్రహ్మోత్సవాల వేళ దేవాదాయ శాఖ (Endowment Department) మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం సీఎం చంద్రబాబు శ్రీకాళహస్తిలోని ముక్కంటీశ్వరుడికి, నంద్యాల జిల్లా శ్రీశైలంలో జ్యోతిర్లింగ క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తిలో యాత్రికుల కోసం..
"శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది" అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తిలో ముక్కంటీశ్వరుడి దర్శనానికి వచ్చే యాత్రికులకు "ప్రత్యేకంగా ఓ లడ్డూ ప్రసాదం అందివ్వాలి" అని నిర్ణయించినట్లు మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా దర్శనానికి వచ్చే "మహిళా యాత్రికులకు 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు గాజులు, అమ్మవారి కుంకుమ, ప్రసాదం, జాకెట్ సారె గా అందించాలని కూడా నిర్ణయించాం" అని మంత్రి రామనారాయణ రెడ్డి వివరించారు.
లింగోద్భవ దర్శనం
అన్ని ఆలయాల మాదిరే శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో కూడా ఓ ప్రత్యేకత ఉంది. బంగారు తాపడం చేసిన రేకు శివలింగంపై ఉంటుంది. మహాశివరాత్రి రోజు ఈ లింగానికి వెనుక గోడపై మహాశివుడు దర్శనం ఉంటుంది. దీనినే "లింగోద్భవ దర్శనం"గా పరిగణిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. దీంతో సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీలకు ప్రత్యేక సమయాలు కేటాయించాలని కూడా ఆయన ఆదేశించారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో ఈ క్షేత్రం కిక్కిరిసిపోతుంది. అందువల్ల ఇబ్బందులకు ఆస్కారం లేకుండా డ్రోన్ ద్వారా నిఘాతో పాటు 350 నుంచి 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి రామనారాయణ రెడ్డి ఆదేశించారు. దీంతో
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఈ పాటికే శ్రీకాళహస్తిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక సూచనలు చేశారు.
శ్రీశైలంలో..
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీతో ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. 11 రోజులు సాగే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో శ్రీశైలం క్షేత్రం మరింత రద్దీగా మారుతుంది. దీంతో దర్శన వేళల్లో కూడా మార్పులకు ఆస్కారం ఉంటుందని ఆయన చెబుతున్నారు.
తిరుపతిలో...
నగరంలోనే శేషాచల అడవులకు దిగువన ఉన్న కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు (ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి అంకురార్పణతో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ప్రకృతి రమణీయతలోని ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యద్దీపాలతో అలంకరించిన దేవతామూర్తుల చిత్తరువులు కనువిందు చేస్తున్నాయి. కొండలకు దిగువన, ఆలయానికి చెంత ఉన్న పుష్కరిణికి మరింత సోయగం తీసుకుని వచ్చారు.
అంకురార్పణ అంటే..
ఆలయానికి సమీపంలోని పుట్ట నుంచి మంగళవారం రాత్రి మట్టి సేకరించే మట్టి పాలకల్లో వేస్తారు. అందులో నవధాన్యాలు నాటుతారు. ఆ ధాన్యాలకు మొలక వచ్చే వరకు నీరు పోస్తారు. మొలకలు ఎంతబాగా వస్తే, అంతచక్కగా, ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని విశ్వసిస్తారు. అంకురార్పణ తరువాత మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లు.
బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజూ ఉదయం ఏడు గంటల నుంచి 9వరకు, రాత్రి ఏడు గంటల నుంచి 9వ వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. దేవేరులతో కలిసి కపిలేశ్వరుడు పల్లకీపై ఆశీనులై తిరుపతిలోని కేటీ. రోడ్, వినాయక్ క్వార్టర్స్, అలిపిరి బైపాస్ రోడ్డులో విహరిస్తే, తిరిగి కపిలతీర్థం చేరుకుంటారు.
ఫిబ్రవరి 19 : ఉదయం ధ్వజారోహణం చేయడం ద్వారా కపిలేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు.
రాత్రి : హంసవాహనం
ఫిబ్రవరి 20:
ఉదయం : సూర్యప్రభ వాహనం
రాత్రి : చంద్రప్రభ వాహనం
ఫిబ్రవరి 21:
ఉదయం : భూతవాహనం
రాత్రి : సింహ వాహనం
ఫిబ్రవరి 22:
ఉదయం : మకర వాహనం
రాత్రి : శేషవాహనం
ఫిబ్రవరి 23:
ఉదయం : చిరుచ్చి వాహనం
రాత్రి : అధికార నందివాహనం
ఫిబ్రవరి 24:
ఉదయం : వ్యాఘ్ర వాహనం
రాత్రి : గజవాహనం
ఫిబ్రవరి 25:
ఉదయం : కల్పవృక్ష వాహనం
రాత్రి : అశ్వవాహనం
ఫిబ్రవరి 26:
ఉదయం : రథోత్సవం
రాత్రి : నంది వాహనం
ఫిబ్రవరి 27:
ఉదయం : పురుషామృగవాహనం
రాత్రి : కల్యాణోత్సవం
ఫిబ్రవరి 28:
ఉదయం : త్రిశూల వాహనం
రాత్రి : ధ్వజారోహణం
ఈ ఉత్సవాలతో పాటు కపిలేశ్వరాలయంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రోజూ వాహన సేవల ముందు కళాకారుల కోలాటాలు, భవజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
Next Story