చిన్నారి స్వరంలో రాయలసీమ నీటి ఆకాంక్ష..
x

చిన్నారి స్వరంలో రాయలసీమ నీటి ఆకాంక్ష..

రాయలసీమ నీటి హక్కుల కోసం చైతన్య గీతం..


రాయలసీమ నీటి హక్కులపై ఆడియో పాటను ఆవిష్కరణ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి

రాయలసీమ సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ప్రజలను మరింత చైతన్యవంతులను చేయడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక చైతన్య గీతాన్ని ఆవిష్కరించింది. రెండేళ్లుగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవాల్లో పాల్గొంటున్న ఏడు సంవత్సరాల బాలుడు “యువన్” ఈ ఆడియో పాటను విడుదల చేశారు.

నంద్యాల సమితి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆ సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితి కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ.. ఈ పాట రాయలసీమ సమాజంలో మరింత చైతన్యాన్ని కలిగించి, సాగునీటి హక్కుల సాధన దిశగా ప్రజలకు ప్రేరణనిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. గత 14 సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసిన కార్యక్రమాలను వివరించారు.‌ ప్రజా చైతన్యమే లక్ష్యంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టి రాయలసీమలో సాగునీటి ఉద్యమానికి బలమైన పునాది వేసిందనితెలిపారు.‌

ఈ ఉద్యమ స్ఫూర్తితో గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలకు పాలనా అనుమతులు సాధించడంతో పాటు, పులికనుమ ప్రాజెక్టు సత్వర నిర్మాణం చేయించడంలోనూ, శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా కృష్ణా నది యాజమాన్య బోర్డు రూల్ కర్వ్ సాధించడంలో సమితి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టుల అనుమతుల కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక ఉద్యమాలు నిర్వహించడం వలన ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుండి అనుమతులు లభించాయని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం ఉద్యమాలు కొనసాగిస్తున్న సమితి, రాయలసీమకు 30 రోజుల్లో 120 టీఎంసీల నీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ – బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను అడ్డుకునే దిశగా సమితి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు.
రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా చట్టబద్ధంగా 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందన్న విషయాన్ని వీరు గుర్తు చేశారు. ప్రభుత్వం దృష్టి సారిస్తే ఒకటి, రెండు సంవత్సరాల్లోనే పూర్తిస్థాయిలో సాగునీరు అందించవచ్చని వీరు స్పష్టం చేశారు. కానీ పాలకులు ఈ నిర్మాణాలను నిర్లక్ష్యం చేస్తూ, “గోదావరి–బనకచర్ల” పేరుతో లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గత 70 ఏళ్లుగా కొనసాగుతున్న మోసాలనే కొనసాగిస్తున్నారని వీరు విమర్శించారు
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు యర్రం శంకర రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి చిరుకూరి వెంకటేశ్వర నాయుడు, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు, కార్యవర్గ సభ్యులు సౌదాగర్ కాశిం మియా, కొమ్మా శ్రీహరి, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్, న్యాయవాది అసదుల్లా మియా, జానోజాగో మెహబూబ్ భాష, మహమ్మద్ పర్వీజ్, మనోజ్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ లక్ష్మయ్య, సిద్దం శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story