
టీడీపీ నేతల్ని వేటకొడవళ్లతో వేటాడి వెంటాడి నరికి చంపారు!
'సీమ'లో రెండు ప్రదేశాల్లో ఇద్దరు హత్యకు గురయ్యారు. వేటకొడవళ్లతో పుంగనూరు, కర్నూలులో టీడీపీ నేతలను అంతం చేశారు.
నన్ను చంపాతారని పుంగనూరులో టీడీపీ నేత వీడియో విడుదల చేశారు. గంటలోపే ఆయన వైసీపీ మద్దతుదారుల చేతిలో హత్యకు గురయ్యారు. కర్నూలు కూడా టీడీపీ నేతను ఇలాగే చంపేశారు. దీంతో రాయలసీమలో ప్రతీకార రాజకీయాలకు తెరలేసింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే పుంగనూరులో హత్య జరిగిందని మృతుడి సంబంధీకులు మదనపల్లెలో రాస్తారోకోకు దిగారు. ఈ సంఘటనల వివరాల్లోకి వెళితే..
పుంగనూరులో ప్రత్యర్థులు తనను హత్య చేస్తారని టీపీడీ నేత కాగితి రామకృష్ణ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. గంటలోపే ఆయన హత్యకు గురికావడం సంచలనం రేకెత్తించింది. దీనికి పుంగనూరు సీఐ, ఎస్ఐ బాధ్యత వహించాలని రామకృష్ణ కుటుంబీకులు టీడీపీ నేతలతో కలిసి మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వద్ద రాస్తారోకోకు దిగారు. ఆ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన వైసీపీ మద్దతుదారులు కాగితి శ్రీరాములు, కొడుకు వెంకటరమణ, టీడీపీ మద్దతుదారులైన కాగితి రామకృష్ణ (55), ఆయన కొడుకు సురేష్(35) దాయదులు. వారి మధ్య పాత కక్షలు ఉన్నాయి. వారి మధ్య చాలా రోజులుగా ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం.
వీడియో విడుదల చేసిన గంటలోపే...
నేను టీడీపీ కార్యకర్తను అని కాగితి కృష్ణమనాయుడు, (రామకృష్ణ) దాయాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని శనివారం ఓ వీడియో విడుదల చేశారు. అందులో వైసీపీ ఓళ్లు.. ఎన్. గణపతి, ఎన్. మహేష్, కే. వెంకటరమణ, ఎన్. త్రిలోక ఈళ్లు నలుగురు చాలా దఫాలు నన్ను. నా కొడుకును యాడపడితే అక్కడ కొడతావుండారు. సీఎం చంద్రబాబు గెలిచినప్పుడు కూడా కేక్ కట్ చేస్తూ ఉంటే, నా భార్యపై దాడి చేశారు. పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. తెల్లవారిన తరువాత కూడా పోలీసులను పంపించలేదు. వైసీపీ వోళ్లు కంప్లైంట్ చేస్తే, పట్టించుకున్నాడు. సీఐ వైసీపీ వాళ్లకే మద్దతుగా ఉన్నాడు. అని ఆరోపించాడు.
ఈ వీడియో శనివారం ఉదయం విడుదల చేసినట్లు చెబుతున్నారు. కాగా, తన కొడుకు సురేశ్ తో కలిసి కాగితి రామకృష్ణ రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అదే సమయంలో వేట కొడవలి తీసుకుని వచ్చిన వెంకటరమణ దాడి చేశాడు. రామకృష్ణ, ఆయన కొడుకు సురేశ్ తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు గుమిగూడేలోపు కత్తితో దాడి చేసిన వెంకటరమణ అక్కడి నింపాదిగా వెళ్లిపోయాడని సమాచారం.
వేటకొడవలితో జరిగిన దాడిలో రక్తపుమడుగులో పడి ఉన్న కాగితి రామకృష్ణ, ఆయన కొడుకు సురేష్ ను మదనపల్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. మార్గమధ్యలోని కలికిరి వద్ద రైతు రామకృష్ణ మృతి చెందాడు. దాడిలో గాయపడిన బాధితుడు సురేష్ మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బంధువుల రాస్తారోకో...
ప్రత్యర్థుల దాడి నుంచి రామకృష్ణను కాపాడడంలో పుంగనూరు సీఐ, ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆయన బంధువులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వద్ద రాస్తారోకోకు దిగారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో ఉద్రక్తితకు దారి తీసింది.
ఆధిపత్య పోరుతో కర్నూలులో..
కర్నూలు జిల్లాలో మళ్లీ హత్య జరిగింది. ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ మద్దతుదారుడు హత్యకు గురైనట్లు కనిపిస్తోంది. కర్నూలు నగరంలో మాజీ కార్పొరేటర్ పై కత్తులతో దాడి చేసి, పంచడం సంచలనంగా మారింది.
కర్నూలు నగరం శరీన్ నగర్ కు చెందిన మాజీ కార్పేరేటర్ కోశపోగు సంజన్ననుశుక్రవారం రాత్రి అదే కాలనీలో నరికి చంపారు.
కర్నులు నగరానికి చెందిన సంజన్న సీపీఎం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, కార్పొరేటర్ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కాటసాని రాంభూపాల్ రెడ్డితో విబేధించి, టీడీపీలో చేరారు. అదే కాలనీలో బైరెడ్డి వర్గీయుడు అయిన రౌడీషీటర్ వడ్డె రామాంజనేయుడు అలియాస్ వడ్డె అంజి కూడా ఉంటున్నాడు. ఈయనతో సంజన్న మధ్య వైరుధ్యం ఉందని సమాచారం. రెండువర్గాలు కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో శుక్రవారం రాత్రి సంజన్న కాలనీలోని ఆలయంలో పూజ అనంతరం ఇంటికి తిరిగి వెళుతున్నారు. అదే సమయంలో దుండగులు కత్తులతో సంజన్నపై దాడి చేసి, హతమార్చారని చెబుతున్నారు. గమనించిన స్థానికులు సంజన్నను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సంజన్న మరణించారని ధృవీకరించారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆస్పత్రికి చేరుకోవడం, కాలనీలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. సంజన్న హత్యకు వడ్డె అంజీ కారణమని, ఆయన వాహనంపై సంజన్న వర్గీయులు దాడికి దిగడంతో మరింత ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటనపై కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పరిస్థితి చేయి దాటకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.
Next Story