
పుష్పాలంకరణలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, పక్కనే భోగశ్రీనివాసుడి విగ్రహం (ఫైల్)
వేంకటేశా! ఏమిటయా, నీ 'అష్ట' మహిమ!
శ్రీవారి సేవలో తరిస్తున్న పుష్పం, పత్రం. అలంకరణ వెనుక కథ ఇదీ..
శ్రీవారు తన వక్షస్థలంపై స్ధానం కల్పించిన శ్రీదేవి, భూదేవికి ఒకటిన్నర మూర పొడవు ఉన్న పూలమాలలతో అలంకరించడం ఆనవాయితీ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. శ్రీవారికి నిర్వహించే అనేక సేవల్లో పుష్ప కైంకర్యం కూడా అత్యంత ప్రియమైంది. శ్రీవారి సేవలో యాత్రికులే కాదు పుష్పాలు, పత్రాలు కూడా తరిస్తుంటాయి. రోజూ 12 రకాల పువ్వులు, ఆరు రకాల పత్రాలతో తయారు చేసే 8 పూలదండలను శ్రీవారి మూలవిరాట్టును సర్వాంగ సుందరంగా అలంకరించడానికి వేద పండితులు ప్రధాన పాత్ర పోషిస్తే, ఆ పూలదండలు తయారు చేయడంలో టిటిడి గార్డెన్ విభాగం సిబ్బంది కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తిరుమలలో మూలవిరాట్టుకు రోజుకు రెండు పూలతో అలంకరిస్తుంటారు. ఉదయ పూలమాలలతో అలంకరించే సమయాన్ని తోమాలసేవగా నిర్వహిస్తారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే పుష్పకైంకర్యం అత్యంత పవిత్రమైనదని చిరువాయి మొళి ( Chiruvai Moli ) అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా ప్రస్తావించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకార ప్రియుడుగా పేరు. రోజుకు 121 కిలోల వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలను అలంకరిస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీవారి మూలవిరాట్టు తోపాటు భోగ శ్రీనివాసమూర్తిని కూడా అలంకరించే పూలమాలలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
300 కిలోల పుష్పాలతో హారాలు
తిరుమల శ్రీవారి విగ్రహాన్ని, ఆయన పాదాల చెంత ఉన్న భోగ శ్రీనివాసమూర్తి ని కూడా ఆపాదమస్తకం అలంకరించడానికి రోజు 300 కిలోల పుష్పాలు, పత్రాలతో తయారు చేసిన పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తూ ఉంటారు. దీంతో తిరుమల శ్రీవారి అలంకరణలో పుష్పాలు పత్రాలు కూడా తరిస్తూ ఉన్నాయని ఇక్కడి దృశ్యాలు మనకు వివరిస్తాయి. రోజు 8 రకాల పుష్ప మాలలు తయారు చేయడానికి తిరుమల లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో 50 మంది పనిచేస్తుంటారు. శ్రీవారి సేవకులు కూడా వారికి సహాయకారిగా హారాల తయారీలో సేవలు అందిస్తుంటారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ సంపంగి ప్రాకారంలో ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ చెప్పారు.
"ఈ ఏడాది 60 మెట్రిక్ టన్నుల పువ్వులు ఆలయం తో పాటు యాత్రికులను ఆకట్టుకునే విధంగా పర్ణశాల తరహాలో తీర్చిదిద్దాం" అని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
"శ్రీవారి మూలవిరాట్టు, భోగ శ్రీనివాసమూర్తి, ఉత్సవ విగ్రహాల అలంకరణకు దేశీయంగా అందుబాటులో ఉన్న పుష్పాలు పత్రాలు వాడుతున్నాం" అని ఈవో అనిల్ కుమార్ సింఘాలు వెల్లడించారు. తిరుమల ఉద్యానవనంలో పండించే పువ్వులతో పాటు సువాసన వెదజల్లే పత్రాలను కూడా వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఎలాంటి పువ్వులంటే..
"శ్రీనివాసుడి విగ్రహం అలంకరణకు సీజన్ ను బట్టి పువ్వులు వినియోగిస్తామని, ఇందులో 12 రకాల పువ్వులు, ఆరు రకాల పత్రాలు ఉన్నాయి" అని టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు చెప్పారు. వేసవికాలంలో మల్లె పువ్వులు, ఆగష్టు నుంచి మార్చి వరకు చామంతి పూలు, కార్తీకమాసం, ధనుర్మాసంలో పన్నీరు ఆకు, బిల్ప పత్రాలు ఎక్కువగా వినియోగిస్తామని శ్రీనివాసులు వివరించారు.
శ్రీవారి నిత్య సేవల కోసం పూలమాలల తయారీకి లిల్లీ, మానుసంపంగి, రోజా పువ్వులు, మల్లెలు, కనకాంబరం, తామర, కలువపూలు, మొగిలిరేకులు, వృక్షిపూలు ( తిరుపతిలో సాగు చేసే నూరువరకాల పువ్వులు) గన్నేరు, రోజా పువ్వులు వినియోగిస్తారు. అలాగే తులిసి ఆకులు, మరువం, దవణం, కదిరిపచ్చ, పన్నీరు ఆకు, బిల్వ పత్రాలు పూల మాలలను అందంగా తయారు చేయడానికి వాడుతుంటారు.
శ్రీవారి నిత్య కల్యాణం, వసంతోత్సవం, ఊరేగింపులతో పాటు ఉత్సవాల కోసం ప్రత్యేకంగా పూల అరలో తయారు చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఉంది. పుష్ప కైంకర్యానికి 12 రకాల పువ్వులు, ఆరు రకాల సువానసతో కూడిన పత్రాలతో పూలమాలలు ఆ పూల అరలో సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా టీటీడీ గార్డెన్ విభాగం సిబ్బంది 50 మంది సిబ్బంది ఉన్నారు. రోజూ ఉదయం, సాయంత్రం శ్రీవారికి నిర్వహించే తోమాలసేవ, (పుష్ప కైంకర్యం) కోసం సిద్ధం చేసిన పూలమాలలు కొత్త వెదురుబుట్టలో ఉంచుకునే జీయర్ స్వాములు తలపై పెట్టుకుని మంగళవయిద్యాల మధ్యఊరేగింపుగా వచ్చి ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణతో సన్నిధానంలోకి చేరాక విమాన వేంకటేశ్వరుడు ఉన్న ఆనంద నిలయం ఉన్న ఆలయాన్ని చుట్టకుని వచ్చిన శ్రీవారి సన్నిధిలో సమర్పించడం ఆనవాయిగా పాటిస్తున్నారు.
శ్రీవారిని అలంకరించే హారాల దిట్టం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పుష్పాలంకరణ చేయడంలో ఆలయ పండితులకు నేర్పరితనం ఉంది. స్వామివారికి అలంకరించే పూలమాలలను తయారు చేయడంలో కూడా టీటీడీ ఉద్యానవన శాఖ సిబ్బంది కూడా అంతే ప్రత్యేకత చాటుకుంటారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో రకమైన పూలహారం తయారు చేయడంలో ఇక్కడ పువ్వులు హారంగా అల్లడంలో ఆ సిబ్బంది అందవేసిన చెయ్యి.
శ్రీవారి ప్రసాదాల తయారీకి దిట్టం (ముడిసరుకుల కొలతలు) ఎలా ఉంటుందో. పుష్పాలంకరణకు కూడా అదే దిట్టం అమలు చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఆపాదమస్తకం అలంకరించే పూలమాలలకు స్థిరమైన పేర్లు ఉన్నాయి.
తిరుమల శ్రీవారి నిలువెత్తు విగ్రహాన్ని పుష్పాలు పత్తరాలతో అల్లిన పూలమాలల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీవారి మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలన్నీ తీసివేసి కేవలం పుష్పాలతో మాత్రమే తయారుచేసిన పూలమాలల అలంకరణలో శ్రీవారి దివ్య మంగళ స్వరూపం యాత్రికులకు దర్శనమిస్తుంది. శ్రీవారిని అలంకరించే పుష్పమాలలో ప్రధానమైనది.
"శ్రీవారి విగ్రహంతో పాటు ఆనందనిలయంలోని విగ్రహాల అలంకరణకు రోజూ 300 కిలోల పుష్పాలు, పత్రాలు వినియోగిస్తాం. ఏడాదికి 250 టన్నుల నుంచి 300 టన్నులు పువ్వులు, సువాసనతో కూడినపత్రాలు వినియోగిస్తున్నాం" అని టీటీడీ గార్డన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
1. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం శిరస్సుపై అలంకరించిన కిరీటం నుంచి భుజాల వరకు ఒక దండను అలంకరిస్తారు. 8 మూరల పొడవు ఉండే ఈ పూలమాలను శిఖామని దండగ పిలుస్తారు.
2. సాలి గ్రామ మాల: శ్రీవారి విగ్రహం భుజాల నుంచి పాదాల వరకు వేలాడుతూ ఉండే సాలిగ్రామాల మాలలకు ఆనుకొని ఈ పూల దండలు అలంకరిస్తారు. నాలుగు మూరలు పొడవు ఉండే రెండు పూలదండలు ఈ విధంగా విగ్రహానికి అలంకరిస్తారు.
3. కంఠసరి పూలమాల: ఇది మూడున్నర మూరలు పొడవు ఉంటుంది. మెడ నుంచి భుజాల వరకు రెండు పొరలుగా ఈ పూలమాల అలంకరిస్తారు.
4. మహాలక్ష్మి విగ్రహానికి... శ్రీవారి మూలవిరాట్ లో వక్షస్థలంపై శ్రీదేవి, భూదేవి ప్రతిమలు సహజంగా కనిపిస్తాయి. మూడున్నర మూరలు పొడవు ఉండే రెండు పూలమాలలను అమ్మవార్ల ను పరిచించే విధంగా రెండు దండలు పలకరిస్తారు.
5. శంకు చక్రాలు: శ్రీవారి ఒక చేతిలో శంఖు, మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఒక మూర పొడవు ఉండే రెండు దండలను శంఖుచక్రాలకు వేర్వేరుగా అలంకరిస్తారు.
6. కఠారిసరం: శ్రీవారి మూల విరాట్టులో నాభి( బొడ్డు) వద్ద ఉన్న నందకఖడ్గానికి ఒక పూలదండ అలంకరిస్తారు. ఇది రెండు మూరల పొడవు ఉంటుంది.
7. తాళవములు: శ్రీవారి మూలవిరాట్టు లో ప్రతి పార్శ్వాన్ని పూలదండలతో అలంకరించడం ద్వారా కనువిందైన దర్శనం కల్పించడానికి అర్చకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తాళవములు అంటే రెండు మోచేతులు, నడుము నుంచి మోకాళ్ళ పై వరకు, మోకాలి నుంచి పాదాలను స్పర్శించే విధంగా వేలాడే మూడు దండలు ఇక్కడ అలంకరిస్తారు.
ఇందులో ఒక దండ మూడు మూరలు, మరో పూల హారం మూడున్నర మూరలు, ఇంకొకటి 4 మూరలు పొడవు ఉండే విధంగా పూల హారాలు తయారు చేయడానికి టీటీడీ గార్డెన్ విభాగం సిబ్బంది కొలతల్లో ఏమాత్రం తేడా రాకుండా నిబద్ధతగా ప్రమాణాలు పాటించడంలో శ్రద్ధ తీసుకుంటారు.
8. తిరువడి దండలు: ఒక మూర పొడవు ఉండే ఈ దండలు కూడా ప్రత్యేకత ఉంది. స్వామివారి విగ్రహం పాదాల చుట్టూ అలంకరించడానికి రెండు హారాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు.
నేత్ర దర్శనం
తిరుమల శ్రీవారు ఎలాంటి అలంకరణ లేకుండా గురువారం ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఆరోజు స్వామి వారి సన్నిధిలోనే కాదు. పూలంగి సేవగా పరిగణించే ఆరోజును శ్రీవారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి కేవలం పూలమాలలతో మాత్రమే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ పూల హారాలు తయారు చేయడానికి టిటిడిలో ప్రత్యేక విభాగమే పనిచేస్తుంది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమయానికి తగినట్టు శ్రీవారి విగ్రహం, ఆనందనిలయంలో ఉన్న వివిధ ఉత్సవ విగ్రహాలకు కూడా పూలమాలను తయారుచేసి అందించడానికి ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఉన్నారు.
తిరుమలలోని గార్డెన్ విభాగం వద్ద ఈ పూలమాలలు తయారు చేస్తారు ఇందుకోసం 50 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారని టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
"శ్రీవారి తో పాటు భోగ శ్రీనివాసమూర్తి, ఆలయంలోని ఉత్సవ మూర్తులకు కూడా పూలమాలలు తయారు చేయడంలో సిబ్బంది నిష్ణాతులు. దీనికోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన టైం టేబుల్ ప్రకారం పూల హారాలు తయారవుతాయి" అని శ్రీనివాసులు చెప్పారు. పూల మాలలు తయారు చేయడంలో 15 మంది మహిళలు, 35 మంది పురుషులు ఈ పనులు చేస్తున్నారని ఆయన చెప్పారు. రోజు 8 పూలహారాలు తయారు చేయడానికి 300 కిలోల 12 రకాల పువ్వులు, ఆరు రకాల సువాసన వెదజల్లే పత్రాలను వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు.
" రోజువారి పూల హారాలు తయారు చేయడానికి 300 కిలోలు వినియోగిస్తుంటే బ్రహ్మోత్సవాల సమయంలో అదనంగా మరో మూడు వందల కిలోలు పువ్వులు పత్రాలు వాడుతాం" అని గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు వివరించారు.
ఆనంద నిలయం.. భోగ శ్రీనివాసుడు..
తిరుమల శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ తర్వాత భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీవారి విగ్రహానికి ఎడమ పాదం వద్ద చిన్న విగ్రహం కనిపిస్తుంది. అదే భోగ శ్రీనివాసడి విగ్రహం. క్రీస్తుశకం 614 వ సంవత్సరం జేష్ఠ మాసంలో పల్లవ రాణి సామవాయి పేరు 18 అంగుళాల పొడవు ఉన్న భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి కానుకగా సమర్పించినట్లు చరిత్ర. దీనికి సంబంధించిన శాసనం ఆలయ మొదటి ప్రకారం లోని విమాన వెంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడ పైన ఇప్పటికీ కనిపిస్తుంది. ఆగమ శాస్త్ర ప్రకారం భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి, శ్రీమనవాల్ పెరుమాళ్ అని కూడా సంబోధిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రోజు రాత్రి 12 గంటల తర్వాత పవళింపు సేవ, వేకువజామున మూడున్నర గంటల ప్రాంతంలో సుప్రభాత సేవ నిర్వహించడం అనవాయితీ. శ్రీవారి పాదాల చెంత ఉన్న భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి ఈ సేవలు నిత్యం నిర్వహిస్తూ ఉంటారు. శ్రీవారి మూల విరాట్ తో పాటు భోగ శ్రీనివాసమూర్తిని అలంకరించడానికి కూడా ఒక పూదండ తయారుచేసి అలంకరిస్తారు. ఆలయంలో కొలువు నిర్వహించే సందర్భంలో పూజలు అందించే కొలువు శ్రీనివాసమూర్తికి మరో దండ అలంకరిస్తారు.
ఉత్సవమూర్తులకు
తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. అందులో ఊంజల్ సేవతోపాటు కల్యాణోత్సవం కూడా అత్యంత ప్రధానమైనది. ఈ సేవల కోసం ఉత్సవం మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగించడం మనవాయితీ.
బ్రహ్మోత్సవాల సమయంలో కూడా వాహన సేవలో శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి వారి విగ్రహాలను ప్రత్యేక అలంకరణలో నిర్వహించే ఊరేగింపును గ్యాలరీలోని భక్తులు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ మూడు విగ్రహాలకు మూడు దండలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.
1. శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తికి మరో మూడు పూల దండలు
2. శ్రీ సీత రామ లక్ష్మణ విగ్రహాల అలంకరణ కోసం మరో మూడు పూల దండలు.
3. శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణుని విగ్రహాల అలంకరణకు రెండు పూలదండలు.
4. విశిష్ట పర్వదినాల్లో అంటే బ్రహ్మోత్సవం ముగింపు రోజు, అర్థ బ్రహ్మోత్సవంగా భావించే రథసప్తమి అంటే సూర్య జయంతి రోజు శ్రీవారు సప్త వాహనాలపై విహరిస్తారు. ఈ రెండు సందర్భాల్లో చక్ర తాళ్వార్ కు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఉండే చక్ర తల్వార్ విగ్రహానికి ఒక దండ అలంకరిస్తారు.
5. అనంత గరుడ విశ్వక్సేనులకు రెండు పూల దండలు.
6.సుగ్రీవ అంగద హనుమంతుని విగ్రహాలకు మూడు పూల దండలు.
7. ఆలయంలో ఉన్న ఇతర విగ్రహమూర్తులకు నిత్యం అలంకరించే పూలదండలు తయారీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
ద్వార పాలకులు
తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఇద్దరు ద్వార పాలకులు ఉంటారు. జయవిజయులుగా పేరున్న ఆ విగ్రహాలకు రెండు పూలదండలు అలంకరిస్తారు.
8.గరుడ అల్బార్ కు ఒక పూలదండ
9.వరదరాజ స్వామి వారికి ఒక పూలదండ
9. శ్రీవారి ఆలయంలో పాత పోటు అంటే స్వామివారికి సమర్పించడానికి ప్రసాదాలు తయారు చేసే ప్రదేశంలో ఉన్న ఒకలమాత విగ్రహానికి ఒక పూలదండ.
10.భగవత్రామానుజులు విగ్రహానికి రెండు పూల దండలు.
11. శ్రీవారి ఆలయానికి ఎడమ పక్కన ఉన్న యోగ నరసింహస్వామి వారికి ఒక పూలదండ
12.విశ్వక్సేనుల విగ్రహానికి ఒక దండ.
13.శ్రీవారి పోటు ఉన్న తాయారు విగ్రహానికి ఒక దండ.
14.శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వేడి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ఒక దండ
15.శ్రీవారి క్షేత్రం అధిపతి అయిన శ్రీవరాహ స్వామి ఆలయంలో విగ్రహాలకు మూడు దండలు.
16శ్రీవారి కోనేరు గట్టుపై ఉన్న ఆంజనేయ స్వామికి ఒక దండ (ఆదివారం మాత్రమే) అలంకరించడానికి ప్రత్యేకంగా తయారు చేస్తారు.
బ్రహ్మెత్సవాలు, ఇతర విశేష పర్వదినాలకు విదేశాలు అంటే యూకే, బ్యాంకాక్ నుంచి కూడా పుష్పాలు టీటీడీతో పాటు దాతలు కానుకగా సమర్పిస్తారు. విదేశాల నుంచి తీసుకుని తెప్పించే పుష్పాలు బెంగళూరులోని టీటీడీ సమాచార కేంద్రానికి చేరతాయని గార్డెన్ విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో తిరుమలకు తీసుకుని రావడం ద్వారా సుమారు 50 మందికి పైగానే అలంకరణలో నిష్ణాతులైన వారు శ్రీవారి ఆలయాన్ని, యాత్రికుల కోసం దేవతామూర్తులను పోలిన విగ్రహాలను తయారు చేస్తారని ఆయన వివరించారు. ఆలయం పరిసర ప్రాంతాల అలంకరణకు 60 టన్నుల పుష్పాలు వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Next Story