తిరుపతి బాలోత్సవం తెచ్చిన  జానపద జాతర
x
తిరుపతి గంగజాతరను ప్రదర్శించిన విద్యార్థినులు

'తిరుపతి బాలోత్సవం' తెచ్చిన జానపద జాతర

200 స్కూళ్ల నుంచి 11 వేల మంది విద్యార్థుల హాజరు.


జానపద, ఆధ్మాత్మిక, పౌరాణిక, జానపద కళలతో విద్యార్థులు కనువిందు చేశారు. చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో చాతుర్యాన్ని ప్రదర్శించారు. బాలల దినోత్సవం నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమాలు పల్లె పదాలు, గ్రామీణ పండుగలు కనువిందు చేయడానికి తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల వేదికగా నిలిచింది.


తిరుపతి బాలోత్సవం పేరిట ఈ సంవత్సరం కూడా నాల్గవసారి కూడా రెండు రోజుల పిల్లల పండుగ శనివారం ఉదయం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు. చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా ఉన్నాయంటూ అభినందించారు.

చిన్నపిల్లల ప్రదర్శనను ప్రోత్సాహిస్తున్న కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

"విద్యార్థులకు చదువులతో పాటు కళలు, క్రీడల్లో కూడా ప్రవీణ్యం ఉంటుంది" వారిలోని ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయని కలెక్టర్ వేంకటేశ్వర్ అన్నారు. నిత్యం చదువులకే పరిమితం కాకుండా, వారిలో ఉన్న ప్రతిభకు తగినట్లు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.

"తిరుపతి బాలోత్సవం గొప్పగా ఉంది. ఇన్ని వేల మందిని ఒకచోటికి తీసుకుని రావడం ఒక ఎత్తు. వారిలోని ప్రతిభకు పదును పెడుతున్నారు" అని తిరుపతి బాలోత్సవం నిర్వాహకులను కలెక్టర్ వేంకటేశ్వర్ అభినందించారు. ఈ తరహా కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అందించే విధంగా సహకారం అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

200 స్కూళ్ల నుంచి.. 11 వేల మంది విద్యార్థులు
తిరుపతి బాలోత్సవం వ్యవస్థాపకుడు మల్లారపు నాగార్జున మాట్లాడుతూ, నాల్గవసారి తిరుపతిలో ఈ వేడుక నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి తిరుపతి జిల్లాలోని 200 పాఠశాలల నుంచి 11 వేల మంది విద్యార్థులు అనేక రకాల పోటీల్లో పొల్గొనడానికి వచ్చారన్నారు.
"విద్యార్థులను మార్కులు, ర్యాంకుల ఒత్తిడి నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సాంస్కృతిక కళారూపాలు దోహదం చేస్తాయి" అని మల్లారపు నాగార్జున చెప్పారు. విద్యార్థుల సృజనాత్మకతకు పదును పెడితే విద్యార్థులను మానసికంగా బలవంతులను చేయాలనే తిరుపతి బాలోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జానపద జాతర

తిరుపతి అంటేనే జానపద కళారూపాలకు నిలయం. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులే కాదు. కళాకారులు కూడా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. తిరుపతి బలోత్సవం నేపథ్యంలో గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీ ఆవరణ కళలు, బాల కళాకారులతో నిండిపోయింది. బాలల జానపద, సాంస్కృతిక వైభవంతో పాటు ఆధ్మాత్మకత, మేథస్సును చూడడానికి రెండు కళ్లు చాలవన్నంతగా కళకళలాడుతోంది.

తిరుమల నుంచి సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి తిరుపతికి దిగివచ్చాడా అనే విధంగా బాలికలు శ్రీవారి వేషధారణతో కదులుతుండగా, చుట్టూ నాట్యంతో ఇంకొందరు బాలికలు నాట్యనీరాజం సమర్పించడం కనువిందుగా సాగింది.
జాతరమ్మ జాతరో..

తిరుపతి గంగమ్మ జాతర మరోసారి గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో కనిపించింది. గంగమ్మ వేషధారణలో పూనకంతో ఊగిపోతుంటే శాంతించని వేడుకుంటూ బాలికలు ప్రదర్శించిన సన్నివేశం ఆకట్టుకుంది.

ఇంకొన్ని వేదికలపై మాటలు కూడా సరిగా పలకలేని చిన్నారులు పద్యాలు, భగవద్గీత శ్లోకాలు పఠిస్తూ, అశ్చర్యానికి గురి చేశారు.

నేను చెట్టును. నన్ను కాపాడితే.. మిమ్మలను ఆదుకుంటా అని సందేశం ఇచ్చే విధంగా ఓ బాలిక ప్రదర్శించిన సన్నివేశం పిల్లలనే కాదు. పెద్దలను కూడా ఆలోచనలో పడేసింది.

ఈ కార్యక్రమానికి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేశ్ నాథ్ లింగుట్ల, కాకినాడు పిల్లల పండుగ కార్యదర్శి ఎస్.ఎస్.ఆర్. జగన్నాథరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జె. విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్.జీఎస్. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సత్యనారాయణ, కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్టు చైర్మన్ పిసి. రాయలు కూడా మాట్లాడారు.



Read More
Next Story