
తిరుమల నడకమార్గంలో.. యాత్రికుల భద్రత, ఆరోగ్యంపై ఫోకస్
ఏడో మైలు వద్ద ఆరోగ్యకేంద్రం ఎందుకు ఏర్పాటు చేశారంటే..
తిరుమల నడకదారిలో వెళ్లే యాత్రికుల ఆరోగ్యం కోసం టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఏడో మైలు వద్ద ఏడో మైలు వద్ద ఆదివారం ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ప్రారంభించారు
తిరుపతి నగరం అలిపిరి మెట్ల మార్గంలో రోజూ కనీసం 25 వేల నుంచి 30 వేల మంది యాత్రికులు తిరుమలకు నడకమార్గంలో వెళుతుంటారు. తిరుమలకు ఈ మార్గంలో వెళ్లాలంటే ఏడుకొండల్లో 3,550 మెట్లు ఎక్కాలి. మార్గమధ్యలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్దకు చేరగానే అలసట నుంచి సేదదీరడానికి యాత్రికులు కొంతసేపు సేదదీరుతారు.
"యాత్రికుల ఆరోగ్య భద్రత కోసం తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేశాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాకు చెప్పారు. నడక మార్గంలో వచ్చే యాత్రికులకు ఆరోగ్యపరంగా ఇబ్బందికి గురైతే, వెంటనే చికిత్స చేయడంతో పాటు అత్యవసరమైతే వారిని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
ఏడో మైలు కీలకం
తిరుమల నుంచి మొదటి ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో, అలిపిరి నుంచి తిరుమల వెళ్లే మార్గంలో ఏడో మైలు అనేది కీలక ప్రదేశం. అలిపిరి నుంచి ఏడో మైలు వరకు 2,600 మెట్లు ఎక్కితే అక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి చేరగానే విశ్రాంతి తీసుకునేందుకు పురాతన ఎనిమిది స్తంభాల విశ్రాంతి మండపం తోపాటు, టీటీడీ నిర్మించిన హాలు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రదేశం దాటిన తరువాత తిరుమలకు సులువుగా నడిచి వెళ్లడం సాధ్యం అవుతుంది.
యాత్రికులకు భద్రత
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు భౌగోళికంగా కూడా ప్రత్యేక ప్రదేశంగా గుర్తింపు ఉంది. అలిపిరి నుంచి నడిచి వచ్చే యాత్రికులు కాసేపు సేదదీరడానికి అనువైన ప్రదేశం. ఏనుగులు, చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉండడం వల్ల టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగం కూడా ఇక్కడ ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. చిరుతల దాడిలో ఒక బాలిక మరణిస్తే, మరో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీంతో నిత్యం ఇక్కడ భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు.
ఆస్పత్రి ఏర్పాటుతో..
అలిపిరి నుంచి నడకమార్గంలో వచ్చే యాత్రికులు అలసటకు గురవుతుంటారు. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురైతే వెంటనే చికిత్స చేయడానికి మొదటిఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు
"అత్యవసర పరిస్థితిలో యాత్రికులకు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. యాత్రికుల భద్రత తోపాటు వారి ఆరోగ్య రక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం" అని చైర్మన్ నాయుడు చెప్పారు. శ్రీవారిమెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడకమార్గంలో ఆధునిక సౌకర్యాలతో ప్రాథమిక చికిత్స కేంద్రం మేలు చేస్తుందని అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి చెప్పారు. ఈ మార్గంలో రోజూ 20వేల నుంచి 30వేల మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు. దిగువ ఘాట్ రోడ్డులో ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉండటంతో వాహనదారులకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.కుసుమ కుమారి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.కుసుమ కుమారి, వీజీఓ రాంకుమార్, అశ్వనీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story

