వలస పక్షుల ప్రేమాయణానికి కేంద్రంగా మారిన నేలపట్టు..
x

వలస పక్షుల ప్రేమాయణానికి కేంద్రంగా మారిన నేలపట్టు..

రేపటి నుంచి నేలపట్టు, సూళ్లూరుపేట వద్ద రెండు రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్-2026


ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవంగా మార్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద రేపటి నుంచి (10వ తేదీ) నుంచి రెండు రోజుల పాటు పక్షుల పండగ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూళ్లూరుపేట జెడ్పీ హైస్కూల్ లో రెండు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్- 2026 (Flamingo Festival) రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఈ ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ కు నేలపట్టు పక్షుల అభయారణ్యం, ఆటకానితిప్ప, బివి. పాలెం పాయింట్ తోపాటు అదనంగా ఉబ్బలమడుగు జలపాతం సందర్శన, ఇరుక్కందీవి ( Irukkam Island) వద్దకు పడవలో ప్రయాణం సందర్శకులకు వింత అనుభూతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏపీ టూరిజం శాఖ తిరుపతి నుంచి నేలపట్టుకు టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంచింది.
"జిల్లాలో సుమారు 42 శాతం అడవులు, జలపాతాలు ఉన్నాయి. ట్రెక్కింగ్ రూట్ ప్రమోట్ చేయడానికి ఈ ఏడాది ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కందీవి సందర్శనను ఫ్లెమింగో ఫెస్టివల్ లో భాగం చేశాం" అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ తెలిపారు.
"నేలపట్టు, అటకానిదిబ్బ, బివి పాల్యం వద్ద బోటింగ్, సూళ్లూరుపేటలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆటల పోటీలు కూడా నిర్వహిస్తాం" అని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
దేవతా పక్షులు

నేలపట్టు పక్షుల అభయారణ్యంలోని విలక్షణ, పర్యావరణ వైవిధ్యంతో నిండి ఉంటుంది. ఇక్కడికి విదేశీ గ్రేపెలికాన్ పక్షులు, కార్మోనెట్ బిల్ పక్షులు(నీటి కాకులు), స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు విడిది కోసం వస్తుంటాయి. సుదూర విదేశీ ప్రాంతాల నుంచి వచ్చే ఈ పక్షులు వాటి సంతతిని పెంచుకోవడమే కాదు. వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు, సముద్ర నీటి నుంచి తీసుకువచ్చి అందించి వాటిని పెంచి స్విమ్మింగ్ Swimming), ఫ్లయింగ్ (Flying) నేర్పించి అనంతరం మార్చి, ఏప్రిల్ మాసాలలో వాటి స్వంత ప్రాంతాలకి తిరిగి వెళ్ళిపోతాయి. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి, విజ్ఞానం కోసం నేలపట్టు అభయారణ్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
నేలపట్టు ఎక్కడ ఉంది..?
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలోని నేలపట్టు విదేశీ పక్షులకు నిలయం. ఈ గ్రామం వద్ద చెరువులేనే కాకుండా, పులికాట్ సరస్సు విస్తరించిన నీటి పరీవాహక ప్రాంతంలో కూడా విదేశీ పక్షుల సందడి ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో విదేశీ పక్షులు వేల మైళ్లు ప్రయాణించి, ఆహారం సంతానోత్పత్తి కోసం వచ్చే పెలికాన్ పక్షులకు దక్షిణ ఆసియాలోని అతి పెద్దదిగా నేలపట్టు విడిది కేంద్రంగా మారింది.
దొరవారిసత్రం మండలంలో ఆ పక్షులను దేవతాపక్షులుగా భావిస్తారు. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే సైబీరియన్ పక్షులు (Siberian birds ) తరలివస్తాయి. శీతాకాలం ముగిసే వరకు అక్కడే విడిది చేస్తాయి. ఆ పక్షులను వేటాడితే అధికారులు కాదు. ఆ గ్రామ ప్రజలే సహించరు. ఆ పక్షుల కారణంగానే పంటలతో పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. మేము సుభిక్షంగా ఉంటామని ఆ గ్రామాల ప్రజలు విదేశీ వలస పక్షులను అంతగా ప్రేమిస్తారు.
2001 నుంచి పక్షుల పండుగ
నేలపట్టు, పులికాట్ సరస్సు వద్దకు విడిదికి వచ్చే విదేశీ పక్షుల సందడి నేపథ్యంలో పక్షుల పండుగ 2001 నుంచి ప్రారంభమైంది. ఇక్కడికి వస్తున్న పక్షులు, పరిశోధనలు, పక్షి ప్రేమికులు, ఔత్సాహికుల ఉత్సాహం వంటి కథనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ ప్రదేశాలు పర్యాటకానికి కూడా అనుకూలంగా మలచడం ద్వారా ఆహ్లాదంగా సేద తీరడానికి అనువైన వాతావరణాన్ని కూడా కల్పించారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ పండుగ అటకెక్కింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2024 నుంచి ఉత్సవాలకు ఊపిరి పోశారు.
2026 పక్షుల పండుగ ఇలా...

ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో దాదాపు 404 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాలు, నేలపట్టు వద్దకు శీతాకాలంలో వేల కిలోమీటర్లు ప్రయాణించే విదేశీపక్షులు వలవ వస్తుంటాయి. దక్షిణాసియాలోనే పెలికాన్ పక్షులకు ఈ ప్రాంతం ప్రధాన ఆవాసంగా మారింది.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు తీరంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమాలు ఇలా..

1. సూళ్లూరుపేట జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉత్సవం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీసిటీ, శ్రీహరికోట, చేనేత కళాకారుల, ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేటలో సాంప్రదాయ వంటల పోటీలు నిర్వహించనున్నారు. సాహస కార్యక్రమాలు కూడా ఉంటాయి. నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకానితిప్ప, బీవీ.పాళ్యం, తోపాటు ఉబ్బలమడుగు, ఇరుక్కోం దీవిలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
2. శ్రీసిటీలో జీవవైవిద్యం, పచ్చదనం, పరిరక్షణ అంశాలపై బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్ షాప్.
3. ఫ్లెమింగ్ ఫెస్టివల్ లో మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా బీవీ. పాలెం వద్ద పడవలో విహారం. పారా గైడ్లింగ్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి సాహసక్రీడలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
4. మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా పడవలో ప్రయాణానికి రూ. 30, ఇరుక్కుం దీవికి పడవలో వెళ్లి రావడానికి వంద రూపాయలు టికెట్ చెల్లించాలి.
"బీవీ. పాలెం వద్ద పడవ ప్రయాణం, సాహస క్రీడల నిర్వహణలో భద్రతా ఏర్పాట్లు చేశాం. పర్యాటకుల కోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య 40 పడవలు పులికాట్ సదస్సులో విహరించడానికి అందుబాటులో ఉంటాయి. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పడవలో గజ ఈతగాళ్లు కూడా అందుబాటులో ఉంచాం" అని టూరిజం ఆర్ డి రమణ ప్రసాద్ తెలిపారు.
"ఫ్లెమింగ్ ఫెస్టివల్ నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద సీపీ కెమెరాలు, డ్రోన్ నిఘా ఉంటుంది" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ . సుబ్బారాయుడు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఉచిత రవాణా..
5. విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించారు. రోజుకు మూడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ ఖర్చుతోనే అన్ని కార్యక్రమాలు చూసే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ డాక్టర్. వి. వెంకటేశ్వర్ తెలిపారు. సందర్శకుల కోసం నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ. పాలెం వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు.
ఆ పక్షులు ఇక్కడికే ఎందుకు వస్తాయంటే..
నేల పట్టు సమీపంలోని నీటిలో 'కరుప్, నీర్' (Karup, Neer ) కంటి తో పాటు అనేక రకాల పేర్లతో పిలిచే "బేరింగ్ టోనియా యాక్యు టాంగ్యులా" (Baringtonia accipitrula ) శాస్త్రీయనామంతో ఉన్న మొక్కలు పుష్కలంగా పెరుగుతాయి. ఇవి దాదాపు నీటిలో సగభాగం మునిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న బురద మట్టి ఈ చెట్లకు బాగా సరిపోతుంది. నీటిలోని చేపలకు ఆహారం బాగా దొరుకుతుంది. మత్స్య సంపదకు లోటు ఉండదు కాబట్టే పక్షులు సుధీర తీరాల నుంచి నేల పట్టుకు తరలి వస్తాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. నేలపట్టు ప్రాంతం విదేశీ పక్షులకు నిలయంగా మారడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో గూడబాతులకు సంతానోత్పత్తికి కేంద్రంగా ప్రసిద్ధి చెందినట్లు గుర్తించారు. అంతేకాకుండా నత్త గుల్ల కొంగ, నీటి కాకి, తెల్ల కంకణాయి, శబరి కొంగ లాంటి అంతరిస్తున్న జాతులకు కూడా ఈ సంతాన ఉత్పత్తి కేంద్రంగా మారినట్లు గుర్తించారు.
వెంకటగిరి డి ఎఫ్ ఓ, శ్రీకాంత్ ఏమంటున్నారంటే..
"నేలపట్టు పక్షుల అభయారణ్యం సుమారు 460 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ పర్యావరణ వైవిధ్య కారణాలు అనుకూలంగా ఉండడం వల్లే విదేశీ పక్షులు వస్తున్నాయి. గ్రే పెలికాన్, కార్మోనెట్ బిల్ పక్షులు (నీటి కాకులు), స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ వంటి అరుదైన పక్షులకు నేలపట్టు అభయారణ్యం విడిది కేంద్రంగా మారింది" అని డీఎఫ్ఓ హారిక విశ్లేషించారు. గ్రే పెలికాన్ పక్షులు దేవత పక్షులుగా పరిగణిస్తారని ఆయన వివరించారు.
ఇదే సీజన్
నేలపట్టు పక్షుల విడిది కేంద్రానికి, బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటిక్ ఆ ప్రాంతాల నుంచి కూడా శీతాకాలంలో పక్షులు వలస వస్తుంటాయి. నేల పట్టుకు చేరుకునే ఫ్లెమింగోతోపాటు పెలికాన్, సైబీరియన్ కొంగలతో పాటు విదేశీ పక్షులను ఈ ప్రాంతంలో విశిష్ట అతిథులుగా భావిస్తారు. నేలపట్టు తో పాటు పులికాట్ సరస్సు విస్తరించిన ప్రదేశానికి ప్రతి సంవత్సరం విదేశీ పక్షులు రావడం అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ మధ్య కాలానికి ఎక్కువ విదేశీ పక్షుల సందడి డిసెంబర్ నెల నాటికి ఎక్కువ సందడి పెరుగుతుంది. వలస వచ్చిన పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో గుడ్లు పెట్టే ఈ పక్షులు డిసెంబర్ 2 లేదా మూడో వారంలో పిల్లల ఉత్పత్తికి అనుకూలంగా మార్చుకుంటాయని పక్షుల పరిశోధకులు చేసిన పరిశీలనలో వెళ్లడైంది. పొదిగిన పిల్లలకు తల్లి పక్షి ఈతకొట్టడం ఎగరడం ఆహారాన్ని సంపాదించుకోవడం వంటి విద్యలు కూడా నేర్పిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.
పరిశోధన కేంద్రం

పక్షి ప్రేమికులకు నేలపట్టు ఓ పరిశోధనా కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది. అటవీ శాఖ పర్యవేక్షణలో ఉండే ఈ ప్రదేశం వద్ద వాచ్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. పగలే కాదు రాత్రిళ్ళు కూడా పక్షుల జాడలను, కదలికలను ఫోటోలు తీసుకోవడానికి కూడా ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, పక్షుల ప్రేమికులు ఇక్కడికి కి పడుతుంటారు. నేలపట్టు వద్ద ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. పక్షులపై పరిశోధన చేయడానికి వచ్చే వారికి ఈ కేంద్రం చక్కగా ఉపయోగపడుతోంది.
శ్రీసిటీలో జీవవైవిధ్యం, పచ్చదనం పరిరక్షణ అంశాలపై బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ -ముంబై (Bombay Natural History Society - Mumbai ) ద్వారా రెండు రోజుల వర్క్ షాప్ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ తెలిపారు.
నేలపట్టు వద్ద పర్యాటకుల కోసం చేసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, ఎస్పీ సుబ్బరాయుడు, అటవీశాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు.
అదనపు ఆకర్షణ
ఈ ఏడాది ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐల్యాండ్ లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రధాన ఆకర్షణ అని సూళ్లూరుపేట ఎమ్మెల్మే నెలవల విజయశ్రీ తెలిపారు. సందర్శకులను రద్దీ అంచనా వేసి బోటింగ్ కు అనువుగా పడవల సంఖ్య పెంచడానికి శ్రద్ధ తీసుకుంటామన్నారు.
"బివి. పాలెం రిసార్ట్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్ తోపాటు పారా గ్లైడింగ్ ఈసారి ప్రత్యేకత. అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశాం" అని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు.
ఏపీ టూరిజం ప్యాకేజీ
ఫ్లెమింగో ఫెస్టివల్ లో పర్యాటకుల కోసం ఏపీ టూరిజం శాఖ (AP Tourism Department ) తిరుపతి నుంచి టూర్ ప్యాకేజీ అమలు చేస్తోంది. ఈ నెల పదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు తిరుపతిలో బయలుదేరే బస్సు సాయంత్రం తిరిగి చేరకుంటుందని పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
సందర్శనీయ స్థలాలు
1. నేలపట్టు,2. అటకానితిప్ప, 3. సూళ్లూరుపేట ఫ్లెమిండ్ షెస్టివల్ కేంద్రం, 4. చెంగాళమ్మ గుడి, 5. శ్రీసిటీ, 6. బీవీ. పాళెం (బోటింగ్ కేంద్రం)లో సందర్శనకు తీసుకుని వెళతారు.
"నాన్ ఏసీ బస్సులో ప్రయాణానికి ఒకరికి రూ. 500 టికెట్. గైడ్ కూడా అందుబాటులో ఉంటారు" అని పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఏపీ టూరిజం బస్సులు తిరుపతి నగరంలోని టీటీడీ శ్రీనివాసం సముదాయం, విష్ణునివాసం నుంచి బయలుదేరుతాయని, వివరాలకు 0877 2289123, 98480 07033 నంబర్లలో సంప్రదించాలని పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు సూచించారు.


Read More
Next Story