
అన్నమయ్య, కడప జిల్లాల రగిలిన భావోద్వేగం...
ముఖ్యమంత్రి నిర్ణయంతో మా కల నెరవేరిందంటున్న రైల్వే కోడూరు ప్రాంత ప్రజలు
రాయలసీమలో పాక్షికంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ భావోద్వేగాలను రెచ్చగొట్టింది. ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయంగా కొందరికి జీవన్మరణ సమస్య సృష్టించింది. కడప జిల్లాలో రెండు కేంద్రాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురు కాగా, మరో మూడు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడింది. సుదీర్ఘకల సాకారం అయిందని రైల్వేకోడూరు ఎస్సీ నియోజకవర్గంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
" వైసిపి అధికారంలో ఉండగా జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది. దీనిని అధికారంలోకి రాగానే సరిదిద్దుతా" అని ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పదేపదే చెప్పారు. ప్రస్తుతం నిర్ణయం వల్ల అన్నమయ్య జిల్లాగా ఉన్న రాయచోటిని కడప జిల్లాలో కలపడం రాజకీయంగా ఇరకాటంలో పడేసింది.
రాయచోటి జిల్లాను కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైసిపి నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో విలీనం చేయడం వల్ల 50 ఏళ్ల కల నెరవేరిందని విశ్లేషకుడు తుంగ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
రాజంపేట జిల్లా కావాలి..
అన్నమయ్య పుట్టిన ఊరు తాళ్లపాక రాజంపేటకు సమీపంలో ఉంది. ఇది రెవిన్యూ డివిజన్ కూడా. బ్రిటిష్ కాలం నాటి రాజంపేట పార్లమెంటు కేంద్రంగా ఉన్న ఈ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఆందోళనలు ఒకపక్క సాగుతున్నాయి. ఈ పరిణామాలన్నింటిని సునితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మధ్యేమార్గంగా తీసుకున్న నిర్ణయం రాయచోటి, రాజంపేటలో వైసిపికి అస్త్రంగా మారింది. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు మాత్రం కాస్త ఊరట చెందుతున్నారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉండగా.. విభజిత ఏపీలో జిల్లాల పునర్విభజనప్రక్రియ జరిగింది.
"పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేస్తాను" అని 2019 ఎన్నికలకు ముందే ys జగన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే జిల్లాల విభజన ప్రక్రియ చేశారు. రాజంపేట పార్లమెంటు స్థానం, రెవెన్యూ డివిజన్ కేంద్రం కూడా. దీనిని కాదని కడప జిల్లాలో పూర్తిగా వెనుకబడి ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా 2022 ఏప్రిల్ 4 తేదీ ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న రాజంపేట తో పాటు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి డివిజన్ కేంద్రంలో కూడా నిరసనలు ఎక్కువ అయ్యాయి.
"తాళ్లపాక రాజంపేటకు సమీపంలో ఉంటే ఈ పట్టణాన్ని కాదని రాయచోటికి అన్నమయ్య పేరు పెట్టడం ఏమిటి" అని కూడా టిడిపి, అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు కూడా నిలదీశారు.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేసి దీని పరిధిలోకి రాజంపేట, రైల్వే కోడూరు, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాలను కలిపారు. ఆ తర్వాత కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అని ఆ పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
" మదనపల్లె జిల్లా సాధన సమితి" పేరుతో ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా, ఈ సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్, కొత్త జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి తో పాటు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు నిరసనలు సాగించారు. ఇప్పటికీ వారిపై కేసులు ఉన్నాయి.
బాబు మాట ఇచ్చారు..
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మదనపల్లి, రాయచోటి, రాజంపేట పట్టణాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు అంటే..
"రాయచోటిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంగా మార్పు చేసే అవకాశం లేదు. మదనపల్లి ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం, రాజంపేటకు కూడా అదే హోదా కల్పిస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు.
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికల హామీని అమలు చేయడానికి అడుగులు వేశారు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీ మేరకు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం ఈ ప్రాంతంలో ఆనంద వ్యక్తం అయింది.
"మా పోరాటం వృధా కాలేదు. ఎన్నికల హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం" అని మదనపల్లి జిల్లా సాధన సమితిలో కీలకంగా వ్యవహరించిన పీటీఎం శివప్రసాద్ వ్యాఖ్యానించారు.
నీలి నీడలు...
మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో రాయచోటి జిల్లా కేంద్రం పై నీటి నీడలో కమ్ముకున్నాయి. ఈ ప్రాంత ప్రజలు నిరసనలకు దిగడంతో పాటు, పట్టణ బాండ్ కూడా నిర్వహించారు. మరొక రాజంపేట ను జిల్లా కేంద్రం చేయాలని ఈ పట్టణంతో పాటు రైల్వే కోడూరులో నియోజకవర్గంలో కూడా నిరసనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
"రాయచోటి జిల్లా కేంద్రం యథాతధంగా ఉంచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. నా ప్రాణం ఉన్నంతవరకు ఇది రద్దు కాదు" అని రాయచోటి ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలను ఊరడించారు. ఇది పూర్తిగా విరుద్ధంగా మారడం, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తోపాటు టీడీపీపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఆందోళనల బాటతోొ వైసీపీ రంగంలోకి దిగింది.
"పాక్షికంగా చేస్తున్న జిల్లాల విభజనతో రాజంపేటకు న్యాయం చేయాలని" చిట్వేలి హెల్ప్ లైన్ సొసైటీ కన్వీనర్ ఇంతియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. రాజంపేట జిల్లా కేంద్రంగా సాధించుకునేందుకు నిరసనలు కొనసాగిస్తామని ఆయన చెబుతున్నారు.
చిట్వేల్ లో ప్రైవేట్ ప్రాక్టీషర్ గా పనిచేస్తున్న 72 సంవత్సరాల దొండ్లవాగు చంద్రశేఖర్ తన మనసులోని మాటను చెప్పారు.
"రైల్వే కోడూరు తిరుపతిలో కలిపే రోజు కోసం నిరీక్షించాం. ఒక వైద్యుడిగా నేను రోగులను వెంట తీసుకొని తిరుపతికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు రైల్వే కోడూరు తిరుపతి మధ్యలో కుక్కదొడ్డి వద్ద ఉన్న సరిహద్దు ఎప్పుడు చెరిగిపోతోందా? అని ప్రయాణంలో అనుకునేవాడిని. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది" అని డాక్టర్ చంద్రశేఖర్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తిరుపతిలోకి చేర్చడం ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గానికి మహర్దశ పట్టినట్టే లెక్క అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు..
మధ్యే మార్గంగా నిర్ణయం..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల జిల్లా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కొత్తగా ఏర్పాటు కానున్న మదనపల్లె జిల్లా కేంద్రం కూడా చిన్నదిగానే మారిపోతుంది. ఇవి ఇలా ఉంటే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని నిరసనలు కూడా మళ్లీ పెరిగాయి. ఈ పరిణామాలు అన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మధ్య మార్గంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోకి రాజంపేట ను చేర్చడం, రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంలో విలీనం చేసి భౌగోళికంగా జిల్లాల విస్తృతిని పెంచడానికి ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
ప్రాణత్యాగానికైనా సిద్ధం
రాయచోటి అన్నమయ్య జిల్లాను విధాతధంగా కొనసాగించే విధంగా చేయడానికి తన రాజకీయ భవిష్యత్తును కాదు, ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైసిపి అధికార ప్రతినిధి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.
ఆయన ఏమంటున్నారంటే..
"వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాం. దీనినీ యధాతధంగా కొనసాగించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు తీసుకున్నది రాజకీయ నిర్ణయమే. దీనిని పునసమీక్షించాలి" అని వైసిపి నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైల్వే కోడూరు కు ఊరట
ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గానికి ఒక విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఊరట కల్పించే నిర్ణయమే తీసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కలపాలనే నిర్ణయంపై సామాజిక విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ ఏమన్నారు అంటే..
"50 సంవత్సరాల కల నెరవేరింది. దీర్ఘకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉన్న విషయం చాలామందికి తెలియదు" అని తుంగా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
ఆహ్వానించతగినది..
రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో తిరుపతిలో మాత్రమే బ్రిటీషర్ల కాలం నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రమే బాలాజీ జిల్లా పేరుతో కొనసాగుతోంది. 1970లో ఒకసారి, 1989లో మరోసారి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిని బాలాజీ జిల్లాగా ఏర్పాటు చేసి విలీనం చేయడానికి సర్వే కూడా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలు, ఆదాయ వనరులపై కూడా సమాచారం అప్పట్లో సేకరించారు అని చిట్వేలి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దొడ్లబాగు శ్రీనివాసు గుర్తు చేశారు.
"రైల్వే కోడూరు నియోజకవర్గం కడప నుంచి విడిపోతుందనే బాధ ఉంది. తిరుపతి జిల్లాలో విలీనం చేయాలనే నిర్ణయం కూడా ఆహ్వానించదగ్గది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం మరింత వీలవుతుంది" డి. శ్రీనివాస్ విశ్లేషించారు
ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో పాక్షిక విభజన అనేది రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిసింది. శాస్త్రీయంగా విభజన ఉండాలనే మాటకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కట్టుబడ్డారని విషయం స్పష్టమైంది. రాజకీయంగా కొన్నిచోట్ల అనుకూల వాతావరణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రతికూలత రావడం సహజమే. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
Next Story

