![Farmer dies | పందుల కోసం తీసిన కరెంటుకు రైతు బలి Farmer dies | పందుల కోసం తీసిన కరెంటుకు రైతు బలి](https://andhrapradesh.thefederal.com/h-upload/2024/12/14/498366-whatsapp-image-2024-12-14-at-21735-pm.webp)
Farmer dies | పందుల కోసం తీసిన కరెంటుకు రైతు బలి
వన్యమృగాల కోసం తీసిన కరెంటు తీగలకు ఓ రైతు మరణించాడు. బాధ్యుడైన ఓ అధికారం చల్లగా జారుకున్నాడు?
అడవిపందుల నుంచి పంటలు కాపాడుకోవాలనే ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నం రైతు ప్రాణాలు తీసింది. పొలం చుట్టూ తీసిన విద్యుత్తు వైర్లలో ప్రవహిస్తున్న కరెంటు షాక్ తగిలి ఓ రైతు మరణించాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. రాయచోటి ట్రాన్స్ కో ఏడీఈ చాంద్ బాషా కూడా మాట్లాడారు. జరిగిన సంఘటనను నిర్ధారించారు.
గ్రామస్తుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లా (కడప) కేంద్రమైన రాయచోటి సుండుపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన వావిలోడ్డుబిడికి సమీపంలో రెడ్డిచెరువు వద్ద రైతు మూడే వెంకటరమణ నాయక్(45) చెపపిల్లలు పెంచుతున్నాడు. అక్కడికి సమీపంలోనే మాచిరెడ్డిగారిపల్లి గ్రామం వావిలొడ్డు బిడికి సమీపంలోని రెడ్డిచెరువు వద్ద చిన్నబిడికికి చెందిన అన్నమయ్య జిల్లా పారామెడికల్ అధికారి రవినాయక్ పొలం ఉంది. ఆ పొలంలో వేరుశనగ పంటను సాగుచేసిన డాక్టర్ రవినాయక్ అడవిపందుల బెదడ ఎక్కువగా ఉండడంతో పొలం చుట్టూ కరెంటు తీగెలు తీశాడని సమాచారం.
ఈ విషయం తెలియక
వావిలొడ్డుబిడికీకి చెందిన మూడే వెంకటరమణ నాయక్ రెడ్డి చెరువులో రూ.4 లక్షల ఖర్చు చేసి చేప పిల్లలు వదిలాడు. పింఛానది నుంచి కాలువలకు నీరు విడుదల చేశారు. దీంతో కొత్తనీరు రావడం వల్ల చేపలు పింఛా ప్రాజెక్టులోకి వెళ్లిపోతాయని ఆందోళన చెందాడు. ఈ ఆందోళనలో చెరువు వద్దకు పరుగులుదీస్తుండగా, డాక్టర్ రవినాయక్ అడవి పందుల కోసం తీసిన విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు.
ఆ సంఘటన జరిగిన సమయంలో పొలంలోనే ఉన్న యజమాని డాక్టర్ రవి నాయక్ ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. రాయచోటికి వెళ్లిపోయిన ఆయన.. తాను డ్యూటీలో ఉన్నట్లు వేలిముద్ర వేయడం ద్వారా గుట్టుచప్పుడు కాకుండా కూర్చొన్నట్లు అధికారుల సమాచారం. కాగా,
విద్యుత్ వైర్లు తగిలి చనిపోయిన మూడే వెంకటరమణ నాయక్ కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని విద్యుత్ వైర్లు తగిలి చనిపోవడంతో ఇక మాకు దిక్కెవరంటూ భార్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ సంఘటనపై ట్రాన్స్ కో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డీఈ యుగంధర్ 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు. "సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లి వావిలోడ్డుబిడికి వద్ద విద్యుత్ షాక్ తో రైతు మరణించిన విషయం వాస్తవమే" అని నిర్ధారించారు. ఆ మండల ఏఈ వ్యక్తిగత పనిమీద వెళ్లడం వల్ల మరో అధికారిని అక్కడికి పంపించామన్నారు. పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు.
Next Story