ఆ ఎమ్మెల్యే నిర్ణయం..   ఓ ఆదర్శ సంతకమే..
x

ఆ ఎమ్మెల్యే నిర్ణయం.. ఓ ఆదర్శ సంతకమే..

ఆమె కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే. పేద పిల్లల కోసం ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. జనం కూడా దన్నుగా నిలిచారు. ఆమె రైతుపక్షపాతిగా నిలిచారు. ఇంతకీ ఆమె ఏమి చేశారు?


సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వాలు కొలువుదీరాయి. విజేతలైన తమ ప్రజాప్రతినిధుల వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాన్యులు కూడా పెద్ద వస్తున్నారు. ఖాళీ చేతులతో వెళ్లడం బాగోదని శాలువలు, బొకేలు తీసుకుని వెళ్లడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.




’దయచేసి ఫ్లవర్ బొకేలు, శాలువలు తీసుకురావద్దు. పిల్లల కోసం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకుని రండి‘ అని

అనంతపురం జిల్లా శింగనమల రిజర్వుడు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారు శ్రావణిశ్రీ కోరారు. హోర్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆమెను అభినందించడానికి వచ్చే వారి ఆలోచనల్లో కూడా మార్పు కనిపిస్తోంది. తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే ఇంత గొప్పగా ఆలోచన చేశారని అభినందిస్తూ, కొందరు ఆమె సూచనను పాటిస్తున్నారు.



సహకారం
ముస్లింలు కొందరు తమ వంతుగా నోట్ పుస్తకాలు అందించారు. ఇది మంచి శుభపరిణామం కూడా అని చాలా మంది అభినందిస్తున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన వేళ ఎమ్మెల్యే శ్రావణి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ’శాలువలు, ఫ్లవర్ బొకేలకు బదులు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందించండి‘ అని సూచన చేసినట్లు కనిపిస్తోంది. వాటన్నింటినీ పోగు చేసిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు పంచిపెట్టే ఆలోచనతో ఆదర్శ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే కూడా ఇదే పద్ధతి పాటించారు. ఇదిలావుండగా,
రైతుల కోసం..
పదవి హోదా కాదు. బాధ్యత అనే మాటను అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సార్థకం చేస్తూ, ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాంను పరిశీలించారు. దెబ్బతిన్న 1,2, 13, 14 రేడియల్ గేట్ల మరమ్మతులపై అధికారులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏర్పాటు చేసిన జసరేటర్ కూడా మరమ్మతుకు గురైందని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిడ్ పెన్నార్, పెనకకచర్ల డ్యాం గేట్ల మరమ్మతుకు రూ. 5.3 కోట్ల అంచనాలతో అధికారులు నివేదించినా గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలుసుకుని ఆవేదన చెందారు. వర్షాకాలం లోపే మరమ్మతు చేయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి. అవసరమైన నిధుల కోసం మంత్రితో మాట్లాడి, రైతులకు ఇబ్బంది లేకుండా, సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.
అక్క, తమ్మడి సహకారంతో...
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనంతరపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్ధానాలను టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అందులో శింగనమల స్థానం నుంచి బండారు శ్రావణిశ్రీ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు. 2024 ఎన్నికల పోలింగ్ గడువు సమీపించే పది రోజులకు ముందు శ్రావణిశ్రీ వడదెబ్బకు గురయ్యారు. కదలలేని స్థితిలో ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైనా, ప్రచారం వేగవంతం చేశారు. అదే సమయంలో శ్రావణిశ్రీ అక్క కిన్నెర, ఆమె తమ్ముడు రంగప్రవేశం చేశారు. తన చెల్లెలు శ్రావణిశ్రీ ప్రచారంలో లేరనే లోటు కనిపించకుండా పార్టీ శ్రేణులతో మమేకం అయ్యారు. ప్రజలతో కలవడం ద్వారా ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై ఎనిమిది వేల ఓట్ల మెజారీటీ విజయం సాధించడానికి శ్రమించారు. ఆ విజయాన్ని పంచుకోవడానికి వస్తున్న వారితో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ నివాసం కూడా సందడిగా మారింది. వారంతా ఆమె సూచనకు గౌరవం ఇస్తూ, నోట్ పుస్తకాలు పెన్నులు తీసుకుని వస్తుండడం కనిపిస్తోంది. ప్రజాజీవనంలో ఉండే వ్యక్తులు ఆదర్శాలు పాటించాలి అని చెప్పడానికి ఇది కూడా ఓ ఉదాహరణ.


గత ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో...
2019 ఎన్నికల తరువాత చిత్తూరు జిల్లాలో కూడా అదే తరహాలో మొదటిసారి గెలుపొందిన ఓ ఎమ్మెల్యే కూడా ఆదర్శంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూధనరెడ్డి విజయం సాధించారు. తనను కలవడానికి వచ్చే అభిమానులు, నాయకులు శాలువలు తీసుకుని రావద్దని సూచిస్తూ, నోట్ పుస్తకాలు, పెన్నులు, విద్యా సామగ్రి తీసుకుని రావాలని కోరారు. దీంతో 8000 నోట్ పుస్తకాలు, 15 వేల పెన్నులు, పెన్సిల్ సెట్లు, డిక్షనరీలు 500, డ్రాయింగ్ కిట్స్ 40, 100 పాకెట్ల స్కెచ్ పెన్నులు, క్రయోన్స్ 100 సెట్లు, ప్యాడ్లు 150, బలపాలు 200 బాక్సులు అందాయి. అదే సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు వాటన్నింటిని మాజీ ఎమ్మల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి రెడ్డి ద్వారా పంచిపెట్టడం ద్వారా దాతల సహకారాన్ని సద్వినియోగం చేశారు. అదే ఏడాది 2,800 పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరయ్యే కిట్లు కూడా ఆయన పంపిణీ చేశారు. 2014 ఎన్నికలు, 2014 ఎన్నికల్లో బియ్యపు మధుసూధనరెడ్డి టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డిపై విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఏదిఏమైనా ప్రజాజీవనంలో ఉండే నేతలు ఆదర్శంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
Read More
Next Story