ముప్పు ఉండకపోవచ్చు...?
x

ముప్పు ఉండకపోవచ్చు...?

మా హక్కులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదనీ ముస్లిం సంఘాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆదుకుంటారనే విశ్వాసం ఉందన్నారు. కేంద్రం నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉంటాయనే ప్రధాని మాటల్లో తేటతెల్లమైందని అంటున్నారు.


" కేంద్రంలో బిజెపి స్వతంత్రంగా అధికారంలోకి రాలేదు. ఆ పార్టీకి కూటమిలోని భాగస్వామ్య పక్షాల సహకారం అవసరం. అందువల్ల ముస్లిం వ్యతిరేక చట్టాలు అమలయ్యే అవకాశం లేదు" అని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్ భీమా వ్యక్తం చేశారు. ఆయన ఈ మాట ఎందుకు అన్నారంటే..

" కేంద్రంలో అధికారంలోకి రాగానే మతప్రాతిపదిక రిజర్వేషన్ రద్దు చేస్తాం. యుసిసి, ఎన్ఆర్, సిఏఏ సి అమలు చేస్తాం" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ముస్లింలను ఆత్మ రక్షణలో పడేశాయి.
" దేశంలో ముస్లింలు అధిక సంఖ్యలో పిల్లలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్కు అధికారమిస్తే, దేశ సంపదను ముస్లిం చొరబాటు దారులకు పంచి పెడుతుందని, అక్కాచెల్లెళ్ళ మంగళసూత్రాలు కూడా తెంచి వారికి ఇస్తుంది" అనీ ప్రధాని నరేంద్రమోదీ మాటలు మరింత కాకరేపాయి.
ఇందుకు ప్రధానంగా వారి అభిప్రాయం మేరకు దేశ జనాభాలో 13.4 శాతం ముస్లింలు ఉన్నారు. ఇండోనేషియా పాకిస్తాన్ తర్వాత దేశంలో మూడో స్థానంలో ముస్లింలు ఉన్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కలు 2015లో ప్రచురించారు. ఆ లెక్కన 36,17,713 మంది ముస్లిం జనాభా ఉన్నారు. దేశంలో ముస్లింల సగటు జనాభా 14.2. కంటే రాష్ట్రంలో తక్కువగా 7.33 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023- 24 డేటా ఇంకా ప్రాసెస్ లో ఉన్నట్లు అధికారిక వెబ్సైట్ చెబుతోంది. ఆ ప్రకారం హిందువులు 88.46 శాతం, ముస్లింలు 9.5, క్రైస్తవులు 1.34, సిక్కులు 0.05, బౌద్ధులు 0.04, ఇతరులు 0.01 శాతం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎసిసి, సీఐఏ, ఎన్ఆర్సి తప్పక అమలు చేస్తామని బిజెపి అగ్ర నాయకులు ప్రకటించారు. ఈ పరిణామాలు గణాంకల నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు చుట్టూ పరిభ్రమించాయి. కేంద్రంలోని బిజెపితో జనసేన ద్వారా రాష్ట్రంలో టిడిపి కూటమిగా ఏర్పడింది. ఇదే విధంగా భావించిన వైఎస్ఆర్సిపి "టిడిపికి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లు అవుతుంది" అని ప్రచారం ముమ్మరంగా సాగించింది. ఈ విషయంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ముస్లిం మైనార్టీ వర్గాలు ఆత్మరక్షణలో పడ్డాయి. అయితే..
" ముస్లిం హక్కులకు భంగం కలగనివ్వను. వాటిని కాపాడుతా" అని టిడిపి అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు ప్రచారంలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ల అంశంలో ఎంత ఖర్చైనా భరించి న్యాయవాదులను ఏర్పాటు చేయిస్తా అని గట్టి హామీ ఇచ్చారు. అదృష్టవశాత్తు గత ఎన్నికల మాదిరి కేంద్రంలో బిజెపి స్వతహాగా మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పక్షాలపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ముస్లిం మైనార్టీ వర్గాలకు ఊరట కల్పించాయి. ఇదే అంశంపై ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. " మ హక్కులు కాపాడతారని నమ్మకంతోనే ఈ ప్రాంతంలో మైనారిటీలు టిడిపికి అండగా నిలిచారు. సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పక్షాన చేరడానికి టిడిపి అధినేత పురాలోచన చేయాలి" అని ఆయన సూచించారు.
"రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతా" అని తాజా మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పినప్పటికీ, ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ముస్లింలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి చర్యలు తీసుకుంటాను" అని మాత్రం హామీ ఇవ్వలేకపోయారు. అని అమర ముస్లిం నేత సాదక్ వలి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా..
2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 543 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 241 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272 అవసరం. దీంతో అనివార్యంగా, ఎన్డీఏ భాగస్వామి పక్షాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీలో 16 స్థానాలు సాధించిన టిడిపి, జనసేన రెండు, బీహార్ లో నితీష్ కుమార్ సారధ్యంలోని జెడియు 12 ఎంపీ స్థానాలతో కింగ్ మేకర్లుగా మారారు. మిగతా భాగస్వామి పక్షాలైన శివసేన ఏడు, లోక్ జనశక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) 5, రాష్ట్రీయ లోక్దళ్, జనతా సెక్యులర్ రెండేసి సీట్లు, మిగతా కొన్ని పార్టీలు ఒక్కొక్క సీటు సాధించాయి. బిజెపి సొంతంగా మెజార్టీ సాధించలేని స్థితిలో ఆ పార్టీలపైనే ఆధారపడాల్సిన అని వారమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో...
మారిన మోదీ స్వరం
ఎన్నికల ఫలితాల అనంతరం రెండు రోజులు కిందట ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరిగింది. కింగ్ మేకర్ గా మారిన టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించారు. ఇందుకు ఎన్డీఏ భాగస్వామి పక్షాల ఎంపీలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. " ఇక నిర్ణయాలు ఏకగ్రీవంగా చేస్తాం. ఎన్డీఏస్ పూర్తికి అనుగుణంగా పని చేస్తాం" అని ఎన్డీఏ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తామని చెప్పకనే చెప్పారు.






ఈ భేటీలో ఎక్కడ ముస్లిం రిజర్వేషన్ బిల్లు, ఎన్ ఆర్ సి, సిఏఏ, యూసీసీ వంటి చట్టాల ప్రస్తావన ఏమాత్రం తీసుకురాలేదు. ఈ భేటీ, బిజెపి నేతల ఆ మాటల్లో మారిన స్వరం కనిపిస్తోంది అని మైనారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. దీనిపై ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, " ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలు అమలు కానివ్వకుండా, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అడ్డుగోడగా నిలుస్తారని నమ్మకం ఉంది" అని ధీమా వ్యక్తం చేశారు. "ఎన్డీఏ కూటమిలో కొత్త ధర్మాన్ని పాటిస్తారు. పాటించి తీరాలి కూడా.. దీనిని అనుసరింప చేయించడంలో చంద్రబాబు మేధావితనం, చతురత ప్రదర్శిస్తారు" అనే సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.
"ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని నమ్మకం మాకు ఉంది. ఎన్డీఏ పోతుధర్మం పాటిస్తారు. కాబట్టి తాత్కాలికంగా ఇబ్బంది లేదు" అని ఖలీల్ స్పష్టం చేశారు.


Read More
Next Story