టెక్నాలజీ ఆధారిత ఆధ్యాత్మిక సేవలు ప్రపంచానికే ఆదర్శం
x

టెక్నాలజీ ఆధారిత ఆధ్యాత్మిక సేవలు ప్రపంచానికే ఆదర్శం

ఆధ్యాత్మిక పర్యాటకంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఆలయ పాలనా వ్యవస్థ ఆధునీకరణలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.


వాట్సాప్ తో ఆలయాల సేవలు. డ్రోన్ నిఘా వంటి సాంకేతిక ఆధారితంగా ఆధ్యాత్మిక సంప్రదాయాలు కాపాడుతున్నాం. ఆలయాల పాలనా వ్యవస్థను ఆధునీకరించడంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

తిరుపతి ఆషా కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ & ఎక్స్‌పో (ITCX) 2025 ముగింపు కార్యక్రమంలో బుధవారం సాయంత్రం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. సానుకూల నాయకత్వం, పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలగడం ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు తీాసుకు రాగలరనేందుకు నిదర్శనం అన్నారు.

ఆలయ సేవలో దార్శనికులు
యాత్రికులకు తగిన సదుపాయాలు కల్పించడంలో మాజీ సీఎం ఎన్టీరామారావు తరువాత సీఎం చంద్రబాబు అమలు చేసిన పథకాలు కార్యక్రమాలను మంత్రి నారా లోకేష్ అంతర్జాతీయ ప్రతినిధుల వేదికపై ఆవిష్కరించారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వర నిత్య అన్నదాన పథకాన్ని 1985 ఏప్రిల్ 6న ఎన్టీ రామారావు కోటి రూపాయల కార్పస్‌ ఫండ్ తో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రోజుకు రెండు వేల మంది యాత్రికల కోసం ప్రారంభించిన ఈ పథకం వల్ల ఇపుడు ప్రతివారం సాధారణ రోజుల్లో 1,59,500, వారాంతాల్లో 2,.05 లక్షల మందికి భోజనాలను టిటిడి అందిస్తోందని వివరించారు. ఈ పథకంలో కార్పస్ ఫండ్ రెండు వేల కోట్లకు పెరిగిందన్నారు.
ప్రాణదానం : 2001 నవంబర్ లో సీఎం చంద్రబాబు ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటుచేశారు. ఔట్ పేషెంట్/ఇన్ పేషెంట్ చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు, భోజనం సదుపాయాలను ఈ ట్రస్ట్ అందిస్తోంది. ప్రస్తుతం రూ.440 కోట్లతో ఈ ట్రస్ట్ విస్తృతమైన సేవలు అందిస్తోంది. 588 గ్రామీణ వైద్య శిబిరాల ద్వారా 1,80,466 మందికి, 212 ఎపిలెప్సీ క్లినిక్‌ల ద్వారా 1,38,066 మందికి, ప్రత్యేక క్లినిక్‌ల ద్వారా 57,610 మంది రోగులకు, 8,500 మంది క్యాన్సర్ రోగులకు సర్జరీలు చేయడం ద్వారా ప్రాణదాన ట్రస్ట్ విస్తృత ఆరోగ్యసేవలు అందించింది.
ఆధ్యాత్మిక పర్యాటకంలో అగ్రగామి
ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామిగా ఉందని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. ఆయన ఏమన్నారంటే...
"గ్లోబల్ టెంపుల్ మేనేజ్‌మెంట్ లీడర్‌లు, విధాన రూపకర్తలు, నిపుణులను ఒకచోట చేర్చడంలో ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుంది. ప్రయాగ్‌ రాజ్ త్రివేణి సంగమం వద్ద జరిగిన పవిత్ర మహా కుంభమేళాకు హాజరైనందుకు నేను ఎంతో ఆనందించాను. ఈ రోజు తిరుపతిలోని ఆలయాల మహా కుంభ్ లో పాలుపంచుకోవడం ఆనందంగా భావిస్తున్నాను" అని అన్నారు.
"దేవాలయాలు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా అందిపుచ్చుకోవడంలో ముందున్నాయనడానికి ITCX నిదర్శనం. ఆధ్యాత్మిక పర్యాటకం, టెంపుల్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది" అని చెప్పారు.
"తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏటా 36-40 మిలియన్ల మంది యాత్రికులు సందర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 27,105 దేవాలయాలకు నిలయంగా ఉంది. ఆలయ సంరక్షణ, ఆధునీకరణ, భక్తుల విశ్వాసాన్ని పెంపొందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. ITCX అనేది దేవాలయాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రపంచ సమాజం. భారతదేశ ఆలయ ఆర్థిక వ్యవస్థ 5-6 లక్షల కోట్ల రూపాయల అంచనా విలువతో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు ITCX 2025 మద్దతు ఇస్తుంది, ఆలయాల స్థిరమైన వృద్ధి, ఆలయ పర్యావరణ వ్యవస్థ సాధికారతపై దృష్టి సారిస్తుంది. 'వసుధైవ కుటుంబం' (ప్రపంచం ఒకే కుటుంబం) తత్వాన్ని స్వీకరించి, ఆలయ నిర్వహణలో ప్రపంచ సహకారాన్ని ITCX ప్రోత్సహిస్తుంది" అని అభిలషించారు.
వాట్సాప్, డ్రోన్ల వినియోగం
వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలయాల సేవలను మెరుగుపరచడం, భక్తులకు ఆలయ ప్రవేశాన్ని సులభతరం చేయడం , మరింత సౌకర్యవంతంగా చేయడం మా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటిగా ఎంచుకున్నాం. అని మంత్రి లోకేష్ భవిష్యత్తును ఆవిష్కరించారు.
"దర్శనం, టిక్కెట్ బుకింగ్‌లు, ఆలయ సేవల కోసం క్యూలలో వేచి ఉండే కష్టాలు ఇకపై ఉండరాదన్నది మా ఉద్దేశం. అందుకే మేము ఆలయ సేవల కోసం వాట్సాప్‌ను వన్-స్టాప్ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగిస్తున్నాం" అని వాట్సప్ సేవల ప్రయోజనాలు వివరించారు. భక్తులు ఇప్పుడు వారి ఆలయ టిక్కెట్‌లను నేరుగా WhatsApp ద్వారా బుక్ చేసుకోవచ్చు, ఆచారాల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. వారి మొబైల్ ఫోన్‌ల నుండి రియల్ టైమ్ సేవలను అందుకోవచ్చు. ఎటువంటి అవాంతరాలు లేకుండా భక్తులకు ఆలయాలను చేరువ చేయడమే మా లక్ష్యం. యాత్రికుల భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం డ్రోన్ నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన దేవాలయాలను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతున్నందున వారి భద్రత చాలా ముఖ్యం. బ్రహ్మోత్సవాలు, పెద్ద ఆలయ ఉత్సవాల సమయంలో నిర్వహణ సవాలుగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కీలకమైన పుణ్యక్షేత్రాలలో డ్రోన్ ఆధారిత నిఘాను ప్రవేశపెట్టాం. డ్రోన్లు క్రౌడ్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రమాదాలను నివారిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడంలో అధికారులకు సహాయపడతున్నాయి అని ఆయన వివరించారు.
సాంకేతికత వచ్చినా.. నడిపేది దేవుడే..
సంస్కృతిని కాపాడుకోవాలని చెబుతూ, మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..
"హిందూ ధర్మం, సనాతన ధర్మం. మానవ సేవే మాధవ సేవ. సాటి మ‌నుషుల‌కు, స‌మాజానికి సేవ చేస్తే, ఆ దేవుడికి సేవ చేసిన‌ట్టేనని హిందూ ధ‌ర్మం చెబుతోంది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి" అన్నారు.
"ప్రపంచం మొత్తం మన వైపు చూస్తోంది. సంస్కృతిలో ఆలయాలు, పండుగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవన విధానం. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చినా మానవ సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడే. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా వారి ప్రయోగం సక్సెస్ కావాలని చెంగాలమ్మ ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంలోనో ముందు రోజు పూజలు చేస్తారు. నమ్మకం మాత్రమే గాక ఇదొక నిజం" అని దేవుడి శక్తి గొప్పదని అన్నారు.
అర్చకుల సంక్షేమం మా కర్తవ్యం
సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలయాల పరిపాలనను మెరుగుపరచడానికి సిబ్బంది, భక్తుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారనే విషయాన్ని గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన హామీ మేరకు అర్చకుల పారితోషికం నెలకు 10 వేల నుంచి 15 వేలకు పెంచామన్నారు. పరిమిత ఆదాయం ఉన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద నెలకు ఐదు వేల నుంచి 10 వేల రూపాయల వరకు సాయం అందిస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో వైదిక సంప్రదాయాలను నిలబెట్టేందుకు వైదిక కమిటీలు ఏర్పాటు చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాల పునర్నిర్మాణం కోసం పునరుద్ధరణ, పరిరక్షణ కమిటీలు ఏర్పాటుచేశారు. ప్రధాన దేవాలయాల ద్వారా నిరుద్యోగ వేద పండితులకు నెలకు ₹3వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను చేర్చేందుకు ఎండోమెంట్స్ చట్టం సవరణ చేశారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ధార్మిక పరిషత్‌లను బలోపేతం చేస్తున్నారని వివరించారు.
రూ.134 కోట్లతో ఆలయాల అభివృద్ధి
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల వ్యవధిలో 73 దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణ కోసం 134 కోట్ల రూపాయాలు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి లోకేష్ ప్రస్తావించారు. దేవాలయాల్లో పరిశుభ్రత కోసం యాంత్రిక పారిశుద్ధ్య పద్ధతులను అమలు చేస్తున్నారు. ఆలయాల్లో సేవలను మెరుగుపరచడానికి IVRS ఉపయోగించి వినూత్న ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్ ఏర్పాటుచేశారు. భారతదేశంలోని దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు, అవి మన సాంస్కృతిక జీవనాధారాలు. విభిన్న ఆధ్యాత్మిక సమూహాలు. తమ ఆలోచనలను పంచుకోవడానికి, ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, బలమైన ఆలయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ITCX 2025 ఒక వేదికగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అని ఆయన ఆకాంక్షించారు.
Read More
Next Story