సీఎం కోటలో టిడిపి పాగా
x

సీఎం కోటలో టిడిపి పాగా

వైఎస్ఆర్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సొంత జిల్లాలో సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో వైఎస్ఆర్సిపి కోట బీటలు వారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకే కాదు, వైయస్సార్ బ్రాండ్, ప్రతిష్టకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే పులివెందల అసెంబ్లీ స్థానం సహా మూడు నియోజకవర్గాల్లో ఆ మాత్రమే వైఎస్ఆర్సిపి గెలిచింది. మిగతా ఏడు స్థానాల్లో టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇది ఊహించని పరిణామంగానే కాకుండా, వైయస్ఆర్సీపీకి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సరాఘాతంగా పరిణమించాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అడ్డాలో టిడిపి కూటమి ప్రభంజనం సృష్టించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవడం ద్వారా వైఎస్ఆర్సిపి తిరుగులేని పార్టీగా ఏర్పడింది. ప్రస్తుతం అందుకు విరుద్ధమైన ఫలితాలతో ఆ పార్టీ శ్రేణులే కాకుండా సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా దిమ్మెర పోయే విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చారని భావిస్తున్నారు.

తగ్గిన మెజారిటీ..

కడప జిల్లాలో వైయస్సార్ కుటుంబానికి అత్యంత ఆదరణ ఉంది. నాలుగు దశాబ్దాలకు పైగానే వైయస్సార్ కుటుంబం పులివెందులలో రాజకీయ చక్రం తిప్పుతోంది. ఇక్కడి నుంచి వారి కుటుంబీకులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. మూడోసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ భారీగా తగ్గింది. సుమారు 41 ఓట్ల మెజారిటీకి పడిపోయింది. 2014 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయనకు 75, 243 ఓట్ల మెజారిటీ లభించింది. 2019 ఎన్నికల్లో 90,110 భారీ మెజార్టీ దక్కింది.

ఈ ఎన్నికల్లో ఆయనకు ఇంటిపేరు ఎక్కువ కావడం, ప్రత్యర్థిగా పోటీ చేసిన టిడిపి అభ్యర్థి బీటెక్ రవికి తోడు, సొంత చెల్లెలు కడప పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓట్ల చీలికకు కారణమయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ తగ్గడానికి కారణమని భావిస్తున్నారు. దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్ మరణం తర్వాత 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో.. వైయస్సార్ సతీమణి, సీఎం వైయస్ జగన్ తల్లి వైఎస్. విజయమ్మ 81,373 ఓట్ల మెజార్టీ సాధించారు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో తిరగబడిన రాజకీయ పరిస్థితులు, సీఎం వైయస్ జగన్ మోనార్క్ నిర్ణయాలు, అసంతృప్తిని పట్టించుకోకపోవడం, నాయకులను కలవకపోవడం వంటి అనేక అంశాలు పులివెందులనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ అసంతృప్తి నీ పసిగట్టడంలో వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని మాటలు కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ కారణాల నేపథ్యంలోనే కడప జిల్లాలో ఊహించని చేదు ఫలితాలు రుచి చూడాల్సిన అనివార్యమైన పరిస్థితిని కల్పించుకున్నారని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా బద్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గెలుపొందారు. రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. ఈ రెండు స్థానాల్లో పొత్తులకు ముందు ఆ తర్వాత కూడా టిడిపికి అనుకూల వాతావరణం ఉందనే మాటలు వినిపించాయి. బిజెపితో సీట్ల సర్దుబాటు వ్యవహారం వల్ల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపి తీసుకున్న నిర్ణయాలు వారికి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయని అక్కడి రాజకీయ వాతావరణం, ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అర్థం అవుతుంది.

సీఎం కోటలో కూటమి కేతనం

దశాబ్దాల కాలం నుంచి కడప జిల్లా వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోటగా ఓటర్లు అండగా నిలుస్తుంటారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి ప్రధానంగా వైఎస్ కుటుంబానికి కడప జిల్లా ఓటర్లు గట్టిగా ఎదురు తిరిగారని పరిస్థితి చెప్పకనే చెబుతోంది. 2004, 2009 ఆ తర్వాత జరిగే ఎన్నికల తో పాటు 2019లో కూడా కడప జిల్లాలోని పదికి పది స్థానాలను ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత వైఎస్ఆర్సిపి దక్కించుకొని ప్రతిపక్షాలకు సవాల్ గా నిలిచేది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడింది. విశ్లేషకులు కూడా ఊహించని విధంగా ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో ఏడు చోట్ల టిడిపి కూటమి విజయకేతనం ఎగురవేసింది. అందులో జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి సి ఆదినారాయణ రెడ్డి ద్వారా ఆ పార్టీ పాగా వేయించ గలిగింది. అలాగే టిడిపికి ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు స్థానంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అరవ శ్రీధర్ గెలుపొందారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హ్యాట్రిక్ మిస్సయ్యారు.

రాయచోటి అసెంబ్లీ స్థానంలో ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తో పోటీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హోరాహోరీగా శ్రమించారు. ఓట్ల లెక్కింపులో నువ్వా నేనా అనే విధంగా మెజారిటీ వారిద్దరితో దోబూచులాడింది. చివరికి టిడిపి అభ్యర్థి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానంలో రాజకీయ కురువృద్ధుడు సీనియర్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి (82) ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై భారీ మెజారిటీతో గెలుపొందారు. మైదుకూరు అసెంబ్లీ స్థానంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి పై టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ విజయకేతనం ఎగురవేశారు. కమలాపురం అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై టిడిపి అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి విజయం సాధించారు. కడప శాసనసభ స్థానం నుంచి డిప్యూటీ సీఎం షేక్ అంజాద్ బాషాపై టిడిపి అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి విజయం సాధించి రికార్డు సృష్టించారు.

కడప పార్లమెంటు స్థానం నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్. అవినాష్ రెడ్డికి టిడిపి అభ్యర్థి సి. భూపేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఆయనకు మెజారిటీ స్వల్పంగానే తప్పినప్పటికీ, ఆయనపై పోటీ చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈమె విజయం మెజారిటీపై రాజకీయ పరిశీలకుల అంచనాలు ఏమాత్రం చేరుకోలేకపోయారు.

మొత్తానికి నాలుగు దశాబ్దాల పరిస్థితిని పరిశీలిస్తే కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే అంచనా వేస్తున్నారు.

ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతుండగానే కూటమి విజయం ఖరారు అయిపోయింది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన అనంతరం తాడేపల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. " ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఆప్యాయత ఏమైందో అర్థం కాలేదో.." నిర్వేదానికి గురయ్యారు. "తల్లులు, పిల్లల అభిమానం ఏమైందో" అని అమ్మబడి పథకాన్ని ఆయన పరీక్షంగా గుర్తు చేశారు. 45 ఏళ్లకే, ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చిన అంశాలను ఆయన పరీక్షంగా గుర్తు చేస్తూ, అక్కాచెల్లెళ్ల ఓట్లు ఏమయ్యాయో కూడా తెలియడం లేదు" అని ఆయన బాధాతప్త హృదయంతో మాట్లాడారు.

మొత్తానికి నాలుగు అంశాల ప్రాతిపదికగానే వైఎస్సార్ సీపీకి ఘోర ఫలితాలు చెవి చూడక తప్పలేదనే విషయం స్పష్టం అవుతుంది. అందులో ప్రధానంగా అంతులేని ధీమావిశ్వాసం. నాయకులు పార్టీ శ్రేణుల్లో ఒకవర్గంలో నీ గూడంగా ఉన్న అసంతృప్తి పసిగట్ట లేకపోయారని భావన వ్యక్తం అవుతుంది. దీనికి తోడు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాననే విషయం పక్కకు ఉంచేయడం, కొత్త ప్రాజెక్టులు తీసుకురా కోగా.. సేద్యపు నీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని విషయంతో పాటు, రిజిస్ట్రేషన్ సైకిల్ డేట్ మార్పు పెద్ద దెబ్బతీసిందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి కూడా పెను సవాళ్లు స్వాగతిస్తున్నాయని భావన కూడా వ్యక్తం అవుతోంది.

Read More
Next Story