మళ్లీ జెండా ఎగరవేసిన టీడీపీ
పాతకోటలో టీడీపీ పాగా వేసింది. తద్వారా వైసీపీకి దెబ్బకొట్టింది. ఇంతకీ కడప జిల్లాలో ఏం జరిగింది?
మాజీ సీఎం వైఎస్. జగన్, ఆయన మేనమామ, మాజీ ఎమ్మెల్యేకి టీడీపీ ఊహించని దెబ్బకొట్టింది. వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీని టీడీపీ తన ఖాతాలోకి మళ్లించుకుంది. ఎట్టకేలకు కొన్ని సంవత్సారాల తరువాత టీడీపీ తన స్థానం పదిలపరుచుకుంది. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఆయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి చక్రం తిప్పారు. అయితే, ఈ మున్సిపాలిటీని ఇలాగే ఉంచాలా? మళ్లీ గ్రామ పంచాయితీగా మార్పు చేయించాలా? అనే మీమాంసలో పడింది. ఇదే అంశం చర్చకు తెచ్చారు.
రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. అందులో కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీ కూడా ఒకటి. ఈ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే అందులో 15 స్థానాల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. మరో ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది.
కమలాపురం నుంచి మాజీ సీఎం వైఎస్. జగన్ మేనమామ పీ. రవీంద్రనాథరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు తర్వాత అప్పటి ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. "కమలాపురం టీడీపీకి కంచుకోట లాంటిది. ఇక్కడే వైసీపీ జెండా ఎగరవేసింది. స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ వల్ల మెజారిటీ ప్రజలు తమ పక్షాన నిలిచారు" అని వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. కాగా, కమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ గా మార్పురి మేరీ వైసీపీ నుంచి ఎన్నికయ్యారు.. ఆ పార్టీకి మెజార్టీ మున్సిపల్ వార్డులు ఆ పార్టీ గెలుచుకుంది.
2024 ఎన్నికల్లో కమలాపురం నుంచి మూడోసారి పోటీ చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మేనమామ ఓటమి చెందారు. రాష్ట్రంలో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో..
అధికార పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ కోవలో కమలాపురం మున్సిపాలిటీలో కూడా వైసీపీ చైర్ పర్సన్ మార్పూరి మేరి తోపాటు ఐదుగురు టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహ రెడ్డి, ఆయన కొడుకు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పావులు కలిపారు. దీంతో కమలాపురం మున్సిపాలిటీలో బలాబలాలు తలకిందులయ్యాయి.
వైసీపీ నుంచి టీడీపీలోకి...
కమలాపురంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఆయన మేనమామ మాజీ ఎమ్మెల్యే పీ. రవీంద్రనాథరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, ఆయన తండ్రి నరసింహారెడ్డి ఈ వ్యూహం అమలు చేసినట్టు సమాచారం. కాగా, వైసీపీ నుంచి విజయం సాధించిన కమలాపురం చైర్ పర్సన్ మార్పురి మేరీ, కౌన్సిలర్లు షేక్ నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి టిడిపిలో చేరారు. వారిని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి తో పాటు ఆయన తండ్రి స్వాగతించారు. దీంతో మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను 15 మంది వైసీపీ నుంచి విజయం సాధిస్తే, ఐదుగురు టిడిపి కౌన్సిలర్లు గెలుపొందారు. వైసిపి నుంచి ఐదుగురు టిడిపిలోకి రావడం వల్ల అధికార పార్టీ బలం 10కి పెరిగింది. ఈ మున్సిపాలిటీలోని ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మునిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత 20 వార్డు కౌన్సిలర్ ప్రమీల గతంలో రాజీనామా చేశారు. దీనివల్ల మున్సిపాలిటీలో వైసిపి కౌన్సిలర్ల బలం 8 మందికి పడిపోయింది. దీంతో, చైర్మన్ మళ్లీ ఎన్నుకుంటారా? మార్పురి మేరీని కొనసాగిస్తారా అనేది ఒక ప్రశ్న. అయితే,
పంచాయతీనా.. మున్సిపాలిటీనా?
కమలాపురం చిన్నపాటి పట్టణం అయినా ఇది టీడీపీకి కంచుకోటగా ఉంది. వైసీపీ పాలనలో చేజారిన మున్సిపాలిటీని టీడీపీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇందుకు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, ఆయన తండ్రి కొత్త నరసింహారెడ్డి తమ పట్టు సాధించారు. పుత్త నరసింహారెడ్డి మాట్లాడుతూ,
"కమలాపురాన్ని అనవసరంగా మున్సిపాలిటీ చేశారు. పంచాయతీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. పనులు చేయగలిగాం" అని వ్యాఖ్యానించారు. "కమలాపురం పంచాయతీ గా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది" అని నరసింహారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "మున్సిపల్ జనరల్ బాడీ నిర్వహించి, దీనిపై తీర్మానం చేయిస్తాం" అని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే, కమలాపురం పట్టణాన్ని తమ ఆధీనంలో ఉంచుకునే దిశగా పంచాయతీగా మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాలి. ఇది సాధ్యమవుతుందా అనేది కూడా పరిశీలించాలి.
Next Story