అదానీ పోర్టు వద్ద టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి వీరంగం
కృష్ణపట్నం పోర్టు వద్ద సెక్యూరిటీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే..
నెల్లూరు జిల్లా అదాని కృష్ణపట్నం పోర్టు వద్ద సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. ఇక్కడి నుంచి తరలించిన కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలని మాట్లాడేందుకు వెళ్లిన సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అంతేకాకుండా అక్కడ నానా హంగామా సృష్టించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో కూడా ఆక్వా ఉత్పత్తులు, ఈ జిల్లాకు సరిహద్దులోని తడ, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం వద్ద ఉన్నశ్రీసిటీ సెల్ఫ్ ఎక్స్పోర్ట్ జోన్ (Self Export Zone-SEZ)లో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు నిలయం. వీటన్నిటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వద్ద అదానీ కృష్ణపట్నం పోర్టు వద్ద కంటైనర్ టెర్మినల్ ఉపయోగంగా ఉండేది. ఈ టెర్మినల్ పాయింట్ తమిళనాడులోని చెన్నై నగరం సమీపంలో ఉన్న పోర్టుకు అదాని సంస్థ తరలించింది. దీంతో జిల్లాలోని ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోర్టు అధికారులతో మాట్లాడడానికి అఖిలపక్ష నాయకులు, అనుచరులతో కలిసి వెళ్లారు. అనుమతి లేకుండా అనుమతించబోమని అడ్డు చెప్పిన సెక్యూరిటీ సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడికి దిగడంతో కొంతసేపు రగడ జరిగింది.
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు, సీఐటీయూ నాయకులను కూడా అక్కడి అదానీ కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. మీడియాను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వాహనం దిగిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విధుల్లో ఉన్న సెక్యూరిటీ అధికారిపై దాడికి దిగారు. "పోర్టు లోపలికి వెళ్ళాలి అంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి" అని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యేతో పాటు మిగతా నాయకులు కూడా సూచించారు. మీడియా ప్రతినిధుల వాహనాలకు అడ్డుగా నిలబడిన సెక్యూరిటీ గార్డులను ఎమ్మెల్యే సోమిరెడ్డి పక్కకు తోసేశారు. దీంతో అక్కడి సిబ్బంది అంతా గుమిగూడారు. వీరితో మాట్లాడాలని వెలుపలికి వచ్చిన పోర్టు సీఈవో పరిస్థితి గమనించి లోపలికి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సోమిరెడ్డిని చేసిన పోలీసులు శాంతింపచేశారు.
అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, "దశాబ్దాల కల కృష్ణపట్నం ఓడరేవును అదానీ యాజమాన్యం దెబ్బతిసింది" అని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని వేలాది మంది ఆక్వా రైతుల ఇబ్బంది ఏర్పడింది. "ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేయడానికి కూడా కష్టమైపోయింది" అని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు, సీఐటీయూ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు , ఇంకొందరు నాయకులతో మాట్లాడడానికి పోర్టు సీఈవో కార్యాలయంలోకి పిలిపించారని తెలిసింది. అప్పుడు కూడా, ఎమ్మెల్యే సోమిరెడ్డి గట్టిగా కేకలు వేస్తూ, పరుషంగా మాట్లాడటంతో సీఈఓ లోపలికి వెళ్లిపోయారని ఆ ప్రాంత మీడియా ప్రతినిధుల ద్వారా తెలిసింది.
గతంలో కూడా ఇంతే..
"సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి ఇదే తరహాలో దాడికి చేశారు" అని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి గతంలో ఆరోపించారు. సోమిరెడ్డి వ్యవహారం వల్లనే కృష్ణపట్టణం నుంచి కంటైనర్ టెర్మినల్ (Terminal) తరలించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. "వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కంటైనర్ టెర్మినల్ చెన్నై ప్రాంతానికి తరలించడం" గమనించదగిన విషయం.
ఈ పరిణామాలపై నెల్లూరు జిల్లా సీనియర్ జర్నలిస్టులు కొన్ని విషయాలను గుర్తు చేశారు. "దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కృష్ణ పట్టణం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఉపాధి కల్పిస్తుంది" అని వివరించారు.. "కూటమి అధికారంలోకి రాగానే దీనిని సాధిస్తామని కూడా ఎన్నికల వేళ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి హామీ" ఇచ్చిన విషయం కూడా ప్రస్తావిస్తున్నారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంటే, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూడా మమేకమైంది. సంప్రదింపుల ద్వారా సున్నితమైన సమస్యను పరిష్కరించే అవకాశం టిడిపి నేతల చేతుల్లోనే వుంది. "కేంద్ర ప్రభుత్వం లో తమ మంత్రుల ద్వారా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చించడం వల్ల ప్రయోజనం" ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. సామరస్య వాతావరణంలో పరిష్కారమయ్యే ఈ సమస్యపై ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా పరిశ్రమ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతి, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి కోసం కృష్ణపట్నం ఓడరేవులో కంటైనర్ టెర్మినల్ సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగితే సాధ్యం కాగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోని నెల్లూరు జిల్లా టిడిపి నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
Next Story