సీమలో కూటమి ప్రభంజనం.. అక్కడే ప్రమాణ స్వీకారం
రాయలసీమ జిల్లాల్లో టిడిపి కూటమి ప్రభంజనం స్పష్టించేలా కనిపిస్తోంది. ఈనెల 9వ తేదీన టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాయలసీమ జిల్లాల్లో టిడిపి కూటమి ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఫలితాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం పదవిని అలంకరించబోతున్నారు. ఇందుకోసం ఈనెల తొమ్మిదో తేదీ అమరావతి వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మేరకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మూడు స్థానాల్లో స్వల్పంగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో టిడిపి కూటమి అభ్యర్థులు భారీగా గెలవబోతున్నారని సంకేతాలు వెల్లడవుతున్న ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఫలితాలు టిడిపి కూటమికి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడవుతుంది.
ఇప్పటికి వరకు నిలబడిన ఫలితాల్లో రాయలసీమ జిల్లాల్లో 44 స్థానాల్లో టిడిపి, 8 శాసనసభ స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి లీడ్‌లో ఉంది. ఎన్టీఆర్ కృష్ణ జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాలో టిడిపి క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది. రాయలసీమ ప్రాంతానికే చెందిన కడప జిల్లా పులివెందుల నుంచి అధికార వైఎస్ఆర్సిపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య కంటే వ్యక్తుల మధ్య ఈ సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి.
రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మూడో సార్వత్రిక ఇది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఆ రెండు ఎన్నికల్లో కూడా రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కోసారి ఒక పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు విలక్షతను చాటుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ మార్పు కోరుకున్న ఓటర్లు టిడిపి కూటమి పక్షానందించినట్లు వెల్లడవుతున్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం తో పాటు నెల్లూరు జిల్లాలో జిల్లాలో 62 శాసనసభ స్థానాలు ఉన్నాయి. రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఇప్పటివరకు... 49 స్థానాల్లో టిడిపి కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. 12 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి అభ్యర్థులు స్వల్పంగా ఆధిక్యతలో ఉన్నారు
జిల్లాల్లో పరిస్థితి
అనంతపురం జిల్లాలో ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి మినహా మిగతా 13 నియోజకవర్గాల్లో టిడిపి ప్రభంజనం కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో కూడా ఊహించని విధంగా అదే ఫలితాలు లభిస్తున్నాయి. ముందుగానే ఊహించినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కడప జిల్లా జమ్మలమడుగులో బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీనియర్ నేత, నంద్యాల వరదరాజులు రెడ్డి, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లో పుట్టా సుధాకర్ యాదవ్ ఆదిత్యంలో గెలుపు దిశగా పయనిస్తున్నారు. 14 శాసనసభ స్థానాలు ఉన్న కర్నూలు జిల్లాలో కూడా టిడిపి కూటమి ప్రభంజనం కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి అసెంబ్లీ స్థానంలో ఆయన సోదరుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి లీడ్ లో ఉంటే, మిగతా 12 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే విజయం దిశగా దూసుకుపోతున్నారు.
గత ఎన్నికల్లో..
2019 ఎన్నికల్లో కడప జిల్లాలో పదికి పది, నెల్లూరు జిల్లాలో పదికి పది, అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో 12, కర్నూలు జిల్లాలో 14 స్థానాలను వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో కుప్పంలో ఎన్. చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ మాత్రమే టిడిపి అభ్యర్థులుగా గెలుపొందారు. నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలను గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందారు.
ప్రస్తుత ఫలితాల సరళి
2024 ఎన్నికల విడుదల పడుతున్న వేళ గత పరిస్థితి పూర్తిగా తిరగబడింది. రాయలసీమ జిల్లాలోని 52 స్థానాల్లో 44 చోట్ల టిడిపి, 8 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది సీట్లలో మాత్రమే లీడ్ లో ఉంది. నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో టిడిపి కూటమి, నాలుగు చోట్ల వైఎస్ఆర్సిపి అభ్యర్థులు లీడ్ లో వున్నారు. ఈ ప్రభంజనం మరింతగా కొనసాగి, అంచనాలను మించిన స్థాయిలో టిడిపి కూటమి రాయలసీమలోనే కాకుండా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ప్రభంజనం కొనసాగిస్తుందని రీతిలో ఫలితాలు కనిపిస్తున్నాయి.