సోమిరెడ్డి లక్ష్యం నెరవేరిందబ్బా...
x

సోమిరెడ్డి లక్ష్యం నెరవేరిందబ్బా...

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి లక్ష్యం నెరవేరింది. చిరకాల రాజకీయ ప్రత్యర్ధిపై నాలుగు సార్లు ఓటమి చెందిన ఆయన ఎట్టకేలకు ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు.


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి 15,994 ఓట్ల మెజారిటీతో చంద్రమోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. గత నెల 13వ తేదీ జరిగిన పోలింగ్ ఈవీఎంలోని ఓట్లను మంగళవారం లెక్కించారు. మంత్రిగా కూడా పని చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 2004 నుంచి 2019 ఎన్నికల వరకు జరిగిన ఎన్నికల్లో వరుస ఓటముకు చవిచూశారు. సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆరు సార్లు పోటీ చేశారు. రెండుసార్లు ఆయన గెలిచారు. గడచిన నాలుగు ఎన్నికలలో రెండుసార్లు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అంతకుముందు ఆదాల ప్రభాకరరెడ్డి చేతిలో రెండుసార్లు ఓడిపోయారు.

సోమిరెడ్డిని వెంటాడిన ఓటములు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థులుగా 1985లో ఎదురు రామకృష్ణారెడ్డి, 1989 లో చిత్తూరు వెంకట కృష్ణారెడ్డి విజయం సాధించారు. 1994లో సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రత్యర్థి పై 35, 080 ఓట్లు, 1999లో 45, 486 ఓటుతో రెండుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో 60, 476 ఓట్లు, 63476 ఓట్ల తేడాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు. 2014 లో 80,299 ఓట్లు, 2019లో 83, 299 భారీ ఓట్ల తేడాతో వరుసగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని 2019 ఎన్నికల్లో పోటీ చేయించేందుకు టిడిపి అధినేత మంత్రి పదవికి రాజీనామా చేయించారు. ఆ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో ఉన్న ఎమ్మెల్సీ పదవి పోయింది. ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవలేకపోయారు.

ఎట్టకేలకు సోమిరెడ్డి గెలిచారు..

సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేశారు. గత రెండు ఎన్నికల్లో కూడా ఓడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదే ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించారు. వరుస ఓటములతో ఆయన ఏమాత్రం కుంగిపోకున్నా, ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్ల రూపంలో అదృష్ట దేవత ఆయనను కనికరించడంతో విజయం దక్కింది. మొదటి మూడు, నాలుగు రౌండ్ల వరకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధిక్యత దిశగా సాగారు. ఆ తర్వాత జరిగిన మిగతా రౌండ్లలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విజయం వైపు అడుగులు వేయించిన ఓటర్లు, ఎట్టకేలకు ఆయన శాసనసభలో అడుగు పెట్టే విధంగా తీర్పు ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ఏ సెగ్మెంట్లో లేని విధంగా సర్వేపల్లి నుంచి పోటీ చేసిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల తూటాల తూటాలు పేలాయి. ఎవరికి ఎవరు తీసుకుని విధంగా వారిద్దరు అవినీతి ఆరోపణలతో రాజకీయాన్ని వేడెక్కించారు. అయితే నాలుగు ఎన్నికల్లో వరుసగా ఓటమి చూసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సానుభూతి పవనాలు పనిచేయడంతోపాటు అధికార పార్టీ నాయకుల సహజ వనరుల దోపిడీ, వారికి వత్తాసు పలికిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుసరించిన విధానాలే అధికార పార్టీకి శాపమైనట్లు వాతావరణం కనిపిస్తోంది. ఇదే అంశాలపై సోమిరెడ్డి, కాకాని మధ్య అవినీతి ఆరోపణలు సంధించుకుంటూ రోడ్డున పడ్డారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కావాలనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిరకాల స్వప్నాన్ని సర్వేపల్లి ఓటర్లు సాకారం చేశారు.

కాకాణికి తప్పని ఓటమి

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామానికి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి 2006 లో శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జడ్పీ చైర్మన్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2011 లో వైయస్ఆర్ సీపీలో చేరారు. 2015 నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022 ఏప్రిల్ 11 నుంచి సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు.

Read More
Next Story