
Adulterated alcohol | మాజీ మంత్రి జోగికి రిమాండ్..
తంబళ్లపల్లె కోర్టులో హాజరుపెట్టిన పోలీసులు. వైసీపీ నేతల హడావిడి.
నకిలీ మద్యం కేసు (Adulterated liquor case )లో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఆయన తమ్ముడు రామును చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నెల్లూరు జిల్లా జైలు నుంచి పీటీ వారెంట్పై వారిద్దరినీ తీసుకుని వచ్చారు. మదనపల్లె సబ్ జైలుకు తరలిస్తే, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎదురవుతాయనే భావనతో కోర్టు అనుమతితో మళ్లీ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
భారీగా వచ్చిన వైసీపీ నేతలు
తంబళ్లపల్లెకు మాజీ మంత్రి జోగి రమేశ్ ను కోర్టుకు తీసుకుని వస్తున్నారనే సమాచారం తెలియడంతో వైసీపీ (YSR CP) నాయకులు, కార్యకర్తలు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, మదనపల్లె వైసీపీ ఇన్ చార్జి నిస్సార్ అహ్మత్ తోపాటు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు రిమాండ్ విధించిన తరువాత కోర్డు నుంచి వెలుపలికి వచ్చే సమయంలో ఎక్సైజ్, సివిల్ పోలీసులు భారీగా మోహరించారు. సాయుధ భద్రత మధ్య బయటికి వస్తున్న జోగి రమేష్ తో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి కరచాలనం చేయడంలో కాస్త తొపులాట జరిగింది.
"అన్నా ఏం కాదులే. ధైర్యంగా ఉండు. నీవెంట మేమున్నాం" అని మాజీ మంత్రి జోగి రమేష్ కు ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ధైర్యం చెప్పారు. అదే సమయంలో కార్యకర్తలు కూడా ముందుకు దూసుకుని రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎవరినీ దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. జోగి రమేష్ కూడా ఆసక్తి చూపించలేదు.
కేసు ఇదీ..
2026 అక్టోబర్ 3వ తేదీ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు వద్ద ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి చేశార. దాదాపు 1.75 కోట్ల మద్యం సీసాలు, 40 స్పిరిట్ క్యాన్లతోపాటు తరలించడానికి సిద్ధంగా ఉన్న17, 224 మద్యం బాటిల్లు, ఖాళీ సీసాలు, వివిధ బ్రాండ్ల లేబుళ్లు కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్ చార్జి దాసార్లపల్లె జయచంద్రారెడ్డి, పీటీఎం ప్రాంతానికి చెందిన కట్టా సురేంద్రనాయుడు తోపాటు 21 మందిపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన రోజే 13 మందిని అరెస్టు చేసినట్లు రాయచోటి ఎక్సైజ్ అధికారి జితేంద్ర వెల్లడించారు. ఆ తరువాత ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్న బాట్లింగ్ యూనిట్ ను పోలీసులు గుర్తించిన తరువాత నకిలీ మద్యం సీన్ మొత్తం మారిపోయింది.
జనార్థనరావు అరెస్టుతో..
నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో విజయవాడకు చెందిన అద్దెపల్లె జనార్థనరావును ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన తంబళ్లపల్లె టీడీపీ మాజీ నేత దాసార్లపల్లె జయచంద్రారెడ్డి క్లాస్ మేట్ కూడా. జనార్థనరావు అరెస్టు తరువాత నకిలీ మద్యం కేసు మలుపు తిరిగింది. గతంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ తో జనార్థనరావుకు ఉన్న అనుబంధాన్ని తెరమీదకు తెచ్చారు. నకిలీమద్యం కేసులో జనార్థనరావు చెప్పిన అంశాలతో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన తమ్ముడు జోగి రామును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అన్నదమ్ములిద్దరు ఏ-18, ఏ-19 నిందితులుగా ఉన్నారు. వారిద్దరి ఈ నెల ఒకటో తేదీ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
Next Story

