BC Hostels | బీసీ హాస్టళ్లపై నిఘా : మంత్రి సవిత
x

BC Hostels | బీసీ హాస్టళ్లపై నిఘా : మంత్రి సవిత

బాలికలకు భద్రతతో కూడిన మెరుగైన విద్య అందిస్తాం. రూ. 25 కోట్లతో బీసీ హాస్టళ్లు ఆధునీకరిస్తున్నట్లు రాష్ట్రమంత్రి సవితమ్మ తెలిపారు.


రాష్ట్రంలోని అన్ని బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలు (Cc Cameras) ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) సంక్షేమం. జౌళీ శాఖ మంత్రి ఎస్. సవితమ్మ తెలిపారు. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 26 జిల్లాల్లో బీసీ భవన్ల (BC BHAVANS నిర్మాణం సాగిస్తామనే హామీని ఆమె పునరుద్ఘాటించారు.

వైసీపీ పాలనలో బీసీ సంక్షేమం, విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని మంత్రి సవితమ్మ విమర్శించారు. తిరుపతి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సవితమ్మ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత తిరుపతిలోని బీసీ హాస్టల్ ను సందర్శించి, విద్యార్థినులతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థల సమావేశంలో మాట్లాడిన మంత్రి సవితమ్మ ఆ తరువాత మీడియాతో కూడా మాట్లాడారు.


బీసీ హాస్టళ్లకు రూ. 25 కోట్లు

బీసీ హాస్టళ్లు 25 కోట్ల రూపాయలు మరమ్మతులకు కేటాయించామన్నారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండేలా హాస్టళ్లలలో ఇన్వర్టర్లతో పాటు విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణం తోపాటు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, విద్యార్థులను కంటకి రెప్పలా కాపాడుతున్నామని అన్నారు.
తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హాస్టళ్లను సందర్శించినప్పుడు... తీవ్రమైన సమస్యలను గుర్తించామన్నారు. విద్యార్థులకు డైట్ బిల్లులు కూడా రాలేదని వార్డెన్లు తెలిపారన్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి...డైట్ బకాయిలు చెల్లించా మన్నారు. ఇప్పుడు అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను కూడా గాలికి వదిలేశారన్నారు. హాస్టళ్ల మరమ్మతులకు రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని, చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని అన్నారు. రంగుల రెడ్డికి భవనాలకు రంగుల వేయడంపై ఉన్న శ్రద్ధ హాస్టళ్ల నిర్వహణపై చూపలేదని జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్ భవనాలకు రంగు..పేరు మార్చి...నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే బీసీ విద్యార్థులకు ఎంతో మేలు కలిగేదన్నారు. గత 5 ఏళ్లు బీసీలను అన్ని విధాలా అన్యాయం చేసి.. బీసీ ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బీసీల అభ్యున్నతికి టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.39 వేల కోట్లకు పైగా కేయించిందని మంత్రి సవితమ్మ చెప్పారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బీసీ భవన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ భవనాలన్నీ 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయన్నారు. తరవాత వచ్చిన వైఎస్. జగన్ ఆ భవనాల నిర్మాణాలు పట్టించుకోలేదన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవన్లతో పాటు కొత్త జిల్లాల్లోనూ నూతన భవనాలు నిర్మించనున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సీఎం ఎన్. చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందజేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను రూపొందించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు.
ఎడ్యుకేషన్ హబ్ గా తిరుపతి
తిరుపతి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని మంత్రి సవితమ్మ చెప్పారు. తిరుపతిలోని బీసీ బాలికల హాస్టల్ లో మంత్రి సవితమ్మ అమరజీవి పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్టల్ లోని అన్ని గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెనూపై వాకబు చేశారు. ఈ హాస్టల్ మరమ్మతులకు రూ. 8 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. మంత్రి వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీసీ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, కృష్ణ యాదవ్, ఎంప్లాయ్ అసోసియేషన్ అధ్యక్షుడు మునిబాలకుమార్, బీసీ వెల్ఫేర్ అధికారులు చంద్రశేఖర్, జ్యోత్స్న, లక్ష్మీనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More
Next Story