మద్దతు ధర సరే... అమలుకు అధికారులేరీ..?
మామిడి రైతులను ఆదుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మినహా, పర్యవేక్షణకు పల్ఫ్ పరిశ్రమల వద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు.
ప్రకృతి పగబట్టింది. దిగుబడి గణనీయంగా తగ్గింది. ధరలు దిగజారాయి. ఇవన్నీ వెరసి మామిడి తోటలు సాగు చేసిన రైతులకు కడగండ్లు మిగిల్చాయి. రైతుల కోసం ప్రభుత్వం స్పందించింది. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో పర్యవేక్షించే సిబ్బంది లేరు.
"తోతాపురి రకం టన్ను మామిడికాయలు రూ. 30 వేలకు కొనుగోలు చేయండి"
అని జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు, ప్రధాన మామిడి కాయల మండీల యజమానులకు తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రవీణ్ కుమార్, షన్మోహన్ ఆదేశించారు. ఇలా.. మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. పూత దశకు రాకముందే, తోటలను కాపాడుకోవడానికి రైతులు సస్యరక్షణ చర్యల కోసం ఖర్చు చేసిన మొత్తం కూడా దక్కని స్థితి ఏర్పడింది.
బోసిపోయిన రైల్వే కోడూరు మామిడి మార్కెట్
"వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి, పూతదశలో ప్రకృతి కరుణిస్తే హెక్టారుకు నాలుగు టన్నుల మామిడికాయల దిగుబడి వస్తుంది. ఆ లెక్కన గత ఏడాది 12.5 లక్షల టన్నుల మామిడి దిగుబడి ఊహించని విధంగా పెరిగింది. ఈ ఏడాది అందులో 1/3 వంతు కూడా లేదు. గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు నెల వరకు ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల మామిడి దిగుబడి తగ్గింది." అని చిత్తూరు జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరెడ్డి ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల హెక్టార్లు, తిరుపతి జిల్లాలో 1.37 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నట్లు ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. ఎకరాకు సగటున 35 నుంచి 40 టన్నులకు కనీసం రెండు టన్నులు కూడా దిగబడి దక్కని పరిస్థితి ఏర్పడింది. గిట్టుబాటు ధర అటుంచి, తోటల్లో సస్యరక్షణకు ఖర్చు చేసిన సొమ్ము కూడా దక్కని స్ధితిలో కన్నీటి పర్యంతం అవుతున్నారు.
"నేను 12 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశా. సుమారు 40 టన్నులకు కనీసం రెండు టన్నుల దిగుబడి కూడా రాలేదు. తోటల సస్యరక్షణకు పెట్టిన ఖర్చులు కూడా రాలేదు‘ అని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం విడపనపల్లెకు చెందిన కే. చిన్నప్ప ఆవేదన చెందారు.
ఈ పరిస్థితుల్లో రాష్ర్టంలో ప్రభుత్వం మారడం కూడా రైతులకు కలసి వచ్చింది. జిల్లాలోని ప్రధాన మామిడి మార్కెట్లతో పాటు పల్ఫ్ పరిశ్రమలు పాకాల, పూతలపట్టు, బంగారుపాళెం, చిత్తూరు, రేణిగుంట, పుత్తూరుతో పాటు గల్లా ఫుడ్స్ వంటివి దాదాపు 55 గుజ్జు తీసే పరిశ్రమలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న రైతులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీని ఆశ్రయించారు. స్పందించిన ఆయన సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లడం ద్వారా మద్దతు ధర ప్రకటించడానికి చొరవ తీసుకున్నారు.
"పల్ఫ్ పరిశ్రమల యజమానులు టన్ను మామిడి రూ. 30 వేలకు కొనుగోలు చేయకుంటే.. పరిశ్రమల వద్ద ధర్నాకు దిగుతా" అని కూడా హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉంది.
పరిశ్రమలే దిక్కు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్ఫ్ పరిశ్రమలు 57 వరకు ఉన్నాయి. మామిడి దిగుబడి తగ్గినే నేపథ్యంలో చాలా పరిశ్రమలు టమాటా ప్రాసెసింగ్ చేస్తున్నాయి. ఈ పరిశ్రమల్లో రెండు రకాలు ఉన్నాయి. అందులో క్యానింగ్ (టిన్స్ ల నింపడం) పరిశ్రమలు ఏడు పనిచేయడం లేదు. అసెటిక్ పరిశ్రమలు (పెద్ద బాక్సుల్లో నింపడం) 50 వరకు ఉంటే, అదులో సగానికి పైగా పరిశ్రమలు టమాటా, ఇతర గుజ్జు తీస్తున్నాయి. మామిడి కాయలు కొనుగోలు చేస్తున్న పరిశ్రమల్లో.. జైన్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం టన్ను మామిడి రూ. 27 వేలకు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మిగతి పరిశ్రమల్లో చాలా వరకు మామిడి గుజ్జు తీయడం తగ్గించాయనే సమాధానం వస్తోంది.
పూతలపట్టు సమీపంలోని శ్రీసన్నిధి ఫుడ్స్ పరిశ్రమ ప్రతినిధి వరుణ్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. ’గంటకు ఏడు టన్నుల కాయలు ప్రాసెసింగ్ సామర్థ్యం ఉందని, ఆ లెక్కన రోజుకు దాదాపు 144 టన్నులు ప్రాసెసింగ్ చేయడం సాధ్యం అవుతుంది‘ అని చెప్పారు. మామిడి దిగుబడి తగ్గిన కారణంగా మిగతా ఉత్పత్తులపై పరిశ్రమలు దృష్టి సారించాయని ఆయన వివరించారు.
"దిగుబడి అధికంగా ఉన్నప్పుడు కిలో మామిడి రూ. పదికి కొనడానికే పరిశ్రమల యజమానులు ఇబ్బంది పడతారు. ప్రస్తుతం 30కి కొనడం అంటే, ఇబ్బందికరమే" అనేది వరుణ్ విశ్లేషణ. ఎందుకంటే.. "కిలో మామిడి కాయలు ప్రాసెసింగ్ చేయడానికి రూ. 40 వరకు ఖర్చు వస్తుంది" అనేది ఆయన వివరణ. పరిశ్రమల యాజమాన్యాలు నష్టపోకూడదు. అలాగని రైతులు ఎంతమాత్రం నష్టాలు చవిచూడకుండా చర్యలు తీసుకోవడం స్వాగతించతగిన విషయం అని అన్నారు.
"మా పరిశ్రమలో 400 టన్నుల ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం రోజుకు కనీసం వంద నుంచి 120 టన్నులు కూడా రావడం లేదు. రైతులకు నష్టం లేని విధంగానే ధర ఇస్తున్నాం" అని బంగారుపాళెం సమీపంలోని శ్రీని ఫుడ్ పార్క్ మేనేజర్ రాజు తెలిపారు.
సరే.. యంత్రంగా ఎక్కడ?
జిల్లాలో టన్ను మామిడి కాయలు రూ. 30 వేలకు కొనుగోలు చేయాలని రైతులకు రాష్ర్ట ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ స్పందన స్వాగతించతగిన విషయం. అయితే, ఫ్యాక్టరీలు, మామడి కాయల మండీలకు ప్రసిద్ధి చెందిన తిరుపతి, పాకాల సమీపంలోని దామచర్ల, బంగారుపాళెం, పలమనేరుతో పాటు పల్ఫ్ పరిశ్రమల వద్ద పర్యవేక్షక యంత్రాంగాన్ని నియమించలేదు. రైతులకు మేలు చేయాలని మాత్రమే ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తిరుపతి విభజిత జిల్లా ఉద్యానవన శాఖాధికారి దశరధరామిరెడ్డి ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, "జిల్లాలోని ఆరు పరిశ్రమలు చిత్తూరు జిల్లాలోని 30 పరిశ్రమల వద్ద యజమానులు ఆదేశాలు అమలు చేస్తున్నారు" అని తెలిపారు. ఆ పరిశ్రమల వద్ద అధికారిక ప్రతినిధిని నియమించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Next Story