సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన తరువాత శుద్ధ దశమిని సూర్యజయంతిని రథసప్తమిగా భావిస్తారు. రథం (పల్లకి) సప్తమి( ఏడు). నిర్వహించడం ఆనవాయితీ. దీనిని ఒక రోజు బ్రహ్మోత్సవంగా కూడా పరిగణిస్తారు. అందుకు కారణం ఏడు వాహనాలపై శ్రీనివాసుడిగా అవతరించిన శ్రీవేంకటేశ్వరస్వామి విహరిస్తారు. మంగళవారం ఉదయం 5.30 నుంచి ఎనిమిది గంటల వరకు (సూర్యోదయం 6.44 AM) సూర్య ప్రభ వాహనం ప్రారంభమైంది. రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
మంచు తెరలు తొలిగే వేళ...
ఆకాశాన కమ్ముకున్న మంచు తెరలు వీడలేదు. తూరుపున ఉదయించిన సూర్యుడి లేలేత కిరణాలు మంచు తుమ్మరెలను ఛేధించడానికి పోటీ పడుతున్నాయి.
దట్టమైన అడవి. చుట్టూ పరుచుకున్న కొండలు. మధ్యలో ఆలయం. భక్తులు విశ్వసించడమే కాదు. చారిత్రక పురాణాలు చెప్పే కలిగియుగ వైకుంఠ క్షేత్రం. మంగళవారం ఉదయం చలి గిలిగింతలు పెడుతోంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై ఆశీనులను చేశారు. శ్రీవారి ఆలయం మీదుగా కిరణాలు ప్రసరించగానే, సూర్యోదయం సంకేతాన్ని అర్చకులు అందించగానే వాహనమండపం వద్ద తెర తొలగింది. మలయప్పస్వామి ఉత్సవమూర్తుల పల్లకీని ఎత్తుకున్న వాహనబేరర్లు వాహనమండపం నుంచి వెలుపలికి రాగానే గోవిందనామ స్మరణలు మిన్నంటిన సన్నివేశం ఓ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించింది.
తిరుమలలో మినీబ్రహ్మోత్సవం కొద్దిసేపటి కిందటే (మంగళవారం ఉదయం ) ప్రారంభమైంది. సూర్య జయంతిని రథసప్తమిగా భావిస్తారు. అంటే కలియుగ వైకుంఠంగా ఉన్న తిరుమలలో రథసప్తమి సూర్యోదయంతో శ్రీదేవి, భూదేవి సమేతంగా సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో విహారానికి బయలుదేరడం ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవం ఉదయం 6.48 గంటలకు ప్రారంభమైంది.
తిరుమలలో ఎక్కువగా మంచుకురుస్తున్న వేళ కావడంతో సూర్యకిరణాలు తాకడం కాస్త ఆలస్యమైంది. సూర్యోదయం వేళ ఆ వాహనంపై అధిరోహించిన శ్రీవారు విహారంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారి పల్లకీసేవను చూడడానికి వచ్చిన యాత్రికులతో గ్యాలరీలు కిక్కిరిశాయి. వాహనసేవ ముందు కళాకారులు నృత్యాలతో నీరాజనం సమర్పించారు. ఈ వేడుక ఆద్యంతం కనువిందు చేసింది.
ఆయురారోగ్యప్రాప్తి
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి.
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జీ. భానుప్రకాష్ రెడ్డి, ఎన్. సదాశివరావు, శ్రీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
వైష్ణవ క్షేత్రాల్లో
తిరుమల శ్రీవారి ఆలయం మాత్రమే కాదు. శ్రీవైష్ణవ ఆలయాల వద్ద సూర్యజయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఉదయమే సూర్యప్రభ వాహనంపై ఆశీనులను చేసి, ఊరేగించారు. ఇలా రాత్రి చంద్రప్రభ వాహనం వరకు వివిధ అలంకరణల్లో ఊరేగించారు.
తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి తోపాటు తొమ్మిది ఆలయాలు, దేవుని కడప, ఒంటిమిట్ట కోదండరామాలయాల్లో కూడా సూర్యజయంతి (రథసప్తమి) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
వాహన సేవలు
ఉదయం 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం
9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం