
తమిళనాడులోని శ్రీరంగం వద్ద ఉన్న శ్రీరంగనాథఆలయం వద్ద పట్టువస్త్రాలతో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు
తమిళనాడులోని శ్రీరంగనాథుడికి శ్రీవారి పట్టువస్త్రాలు
ఆధ్యాత్మిక అనుబంధం గొప్పదని వ్యాఖ్యానించిన టీటీడీ చైర్మన్
దేశంలోని శ్రీవైష్ణవాలయాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తోంది. వైష్ణవ క్షేత్రాలకు కేంద్రమైన తమిళనాడులోని శ్రీరంగం వద్ద ఉన్న శ్రీరంగనాథస్వామివారి ఆలయంతో మరింత బలమైన బంధం ఉంది.
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవక్షేత్రం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారికి సోమవారం టిటిడి చైర్మన్ బీఆర్. నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి.శివరామన్, ప్రధానార్చకులు సుందరభట్టర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ ఆచారం..
2006వ సంవత్సరం కైశిక ఏకాదశిని పురస్కరించుకుని శ్రీరంగం ఆలయానికి టిటిడి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
"ఈ ఆచారం, సంప్రదాయం కొనసాగింపుగా పట్టువస్త్రాలు సమర్పించాను" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు.
ఊరేగింపుగా వెళ్లి...
తిరుమల నుంచి తీసుకుని వెళ్లిన పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను చైర్మన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story

