తిరుమలలో కోరినన్ని లడ్లు కష్టమే?  దళారులకు పండుగే.. !
x

తిరుమలలో కోరినన్ని లడ్లు కష్టమే? దళారులకు పండుగే.. !

తిరుమలలో సామాన్య యాత్రికులకు ఇది చేదు వార్తే. ఇకపై కోరినన్ని లడ్లు దక్కే పరిస్థితి లేదు. ఈ నిర్ణయం మళ్లీ దళారులను ప్రోత్సహించే విధంగా ఉందనే విమర్శలు ప్రారంభమయ్యాయి.


తిరుమలలో ప్రస్తుతం టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బహిరంగంగా యాత్రికులకు కోరినన్ని లడ్లు విక్రయిస్తున్నారు. దీనివల్ల దళారులకు ఆస్కారం లేకుండా పోయింది. సామాన్య యాత్రికుడు తనకు అవసరమైన లడ్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ పద్ధతికి స్వస్తిచెప్పారు.
తిరుమలలో ఇక కోరినన్ని లడ్లు కోనుగోలుకు ఆస్కారం ఉండదు. దర్శనానికి వెళ్లని వారికి గురువారం నుంచి ఆధార్ కార్డుపై రెండు మాత్రమే లడ్లు విక్రయిస్తున్నారు. దర్శనం టికెట్ ఉన్న వారికి ఒక ఉచిత లడ్డుతో పాటు అదనంగా నాలుగు నుంచి ఆరు లడ్లు విక్రయించే పద్ధతిని గురువారం నుంచి అమలులోకి తీసుకుని వచ్చారు.


"లడ్డు ప్రసాదాల విక్రయాల్లో దళారులను కట్టడి చేయాలి. సామాన్య యాత్రికులకు పారదర్శకంగా విక్రయించాలి" అనే ఆలోచనతోనే ఈ నిర్ఱయం తీసుకున్నట్లు తిరుమల అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ప్రకటించారు.
టీటీడీ ఈఓ, తిరుమల జేఈఓ (ప్రస్తుతం అదనపు ఈఓ)గా నియమితులయ్యే వారు. తిరుమలలో దర్శనాలు, లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు నిత్యాన్నదానం వంటి కార్యక్రమాల్లో మార్పులు తీసుకుని రావడం ద్వారా తమ ప్రత్యేకత చాటుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ కోవలో చాలా మంది అధికారులు అమలు చేసిన సంస్కరణల ద్వారా స్థానికులే కాదు. యాత్రికులు కూడా వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే...

సిఫారసులకు చెల్లుచీటీ


తిరుమలలో దర్శన టికెట్లతో పాటు లడ్డు ప్రసాదాలకు కూడా కొందరు అధికారులకు సిఫారసు లేఖలు ఇచ్చే అధికారం ఉండేది. అప్పట్లో లడ్డు రూ.25కు విక్రయించే వారు. టీటీడీ పీఆర్ఓ, ఆలయ డిప్యూటీ ఈఓ, పేష్కార్ వంటి అధికారులు ఎల్పీటీ (లడ్డు పడి టికెట్) లేఖలు ఇచ్చే వారు. ఒక పడి అంతే ఐదు లడ్లు ఇచ్చేవారు. ఆ రోజుల్లో లడ్డు ప్రసాదం దొరకడం మరింత ప్రియంగా ఉండేది. దీంతో దళారులు ఎక్కువగా సొమ్ము చేసుకునే వారు. ఈ పరిస్థితిని సమీక్షించిన అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఈఓ డాక్టర్ కేవీ. రమణాచారితో పాటు పాలక మండలిలో సుదీర్ఘంగా చర్చించారు.
ధర పెంపుదలతో..
శ్రీవారి లడ్డు ప్రసాదాల బ్లాక్ మార్కెట్ ను అరికట్టి, దళారులకు అడ్డుకట్ట వేయడానికి లడ్డూ ధర రూ. 50కి పెంచారు. అంతేకాకుండా ఆలయ మాడవీధి సమీపంలోనే ఒకో భక్తుడికి నాలుగు లడ్లు మాత్రమే ఇవ్వడానికి నిర్ఱయం జరిగింది. కొన్ని రోజులు పరీశీలించిన తరువా పేద యాత్రకులు అన్ని లడ్డులూ కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని గ్రహించారు. దీంతో ఒకటి లేదా రెండు లడ్లు కూడా విక్రయించే వెసులుబాటు కల్పించారు. దీంతో అప్పటి నుంచి లడ్డు ప్రసాదం తిరుమలలో సామాన్య యాత్రికులకు కోరినన్ని తీసుకునే వెసులుబాటు కలిగింది.

పెద్ద లడ్డు, వడ కూడా


తిరుమల శ్రీవారికి సమర్పించే అనేక ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదం మినహా, మిగతావి సామాన్య యాత్రికులకు తెలియవు. ఆ పరిస్థితి నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా కల్యాణోత్సవం జరిపించే గృహస్తులకు మాత్రమే పరిమితమైన పెద్ద లడ్డు, వడ కూడా సామాన్య యాత్రికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చిన ఘనత 2004 నాటి పాలక మండలి, ఈఓకు మాత్రమే దక్కింది. ఇప్పుడేమైంది..

మళ్లీ పాత రోజులేనా..?
తిరుమలలో వ్యవహారాలు నిత్యం వినూత్నంగానే ఉంటాయి. గత ఐదేండ్లలో తిరుమల జరిగిన అనేక కార్యక్రమాలు నిత్యం వార్తల్లో నిలిచాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మార్పులకు శ్రీకారం చుట్టారు. జరిగిన అనేక కార్యక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ విషయం పక్కన ఉంచితే,
లడ్డు ప్రసాదాలు సామాన్యులకు మరింత ప్రియం అయ్యే వాతావరణంతో పాటు దళారుల రంగప్రవేశానికి మార్గం కల్పించినట్లు భావిస్తున్నారు. దర్శనానికి వెళ్లని వ్యక్తికి రేషన్ కార్డు ద్వారా రోజుకు రెండు లడ్లు మాత్రమే జారీకి నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఎస్డీ (సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు), రూ.300 టికెట్ ఉన్న వారికి ఉచిత లడ్డుతో పాటు అదనంగా నాలుగు నుంచి ఆరు లడ్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.
పారదర్శకం కోసమే..


కొన్ని రోజుల కిందటే తిరుమల అదనపు ఈఓగా బాధ్యతలు తీసుకున్న సీహెచ్ వెంకయ్య చౌదరి ఏమంటున్నారంటే..
శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే ఉద్దేశంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రకటించారు. "తిరుమలలో దళారుల బెడద తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది" అని వెంకయ్య చౌదరి గురువారం తిరుమల అన్నమయ్య భవన్ వద్ద మీడియాకు చెప్పారు.

"దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్ తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నాం" అని తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్‌లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన సూచించారు.
ఇదీ టీటీడీ నిర్ణయం
"తిరుమలలో సామాన్య భక్తుల ప్రయోజనాల కోసం గురువారం నుంచే ఈ పద్ధతి అమలులోకి తీసుకుని వచ్చాం" అని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రకటించారు.
- దర్శనం టోకెన్లు లేని భక్తులు గురువారం ఉదయం నుంచి లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు లడ్డూలు తీసుకోవచ్చు.
ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 48 నుంచి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు తీసుకోవచ్చు.
దర్శనం టికెట్లు ఉంటే...
దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు ఉన్న భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో మాదిరే నాలుగు నుంచి ఆరు లడ్డూలు అదనంగా కొనుక్కోవచ్చు. ఈ సంస్కరణలు తీసుకుని రావడానికి ప్రధాన కారణం, గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించిందని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వెల్లడించారు. దీంతో లడ్డులూ దళారులు అధికధరలకు విక్రయించకుండా, సామాన్యులకు మేలు చేయడానికే ఈ పద్ధతిని అరికట్టేందుకు గురువారం నుంచి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

"ప్రస్తుత ఓపెన్ మార్కెట్ వల్ల లడ్డు ప్రసాదాలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు" దీనిని టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి నివేదిక ఇచ్చింది" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
దర్యాప్తు చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎప్పుడు.. ఎక్కడా ఈ విషయాన్ని బహిర్గతం చేసిన దాఖలాలు లేవు. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే లడ్డు బ్లాక్ మార్కటింగ్ను గుర్తించామని తిరుమల అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు.
ఒకటి లేదా రెండు టికెట్ల విషయంలో పట్టుబడే దళారులను మీడియా ముందు హాజరుపెట్టడం, కోర్టుకు తీసుకుని వెళ్లడానికి అత్యుత్సాహం చూపించే టీటీడీ విజిలెన్స్ అధికారులు రూ. లక్షల లడ్లు బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంటే ఎలా చూస్తూ ఉండిపోయారనేది సమాధానం లేని ప్రశ్నే?

బ్లాక్ మార్కెట్ కు తోడ్పాటు..


లడ్డూలకు రేషనలైజేషన్ పెట్టడం అనేది "టీటీడీ బ్లాక్ మార్కెట్ కు తోడ్పాటు ఇవ్వడమే" అని టీటీడీ ఉద్యోగ, కార్మిక, సంఘాల గౌరవాధ్యక్షుడు కందారపు మురళి అభిప్రాయపడ్డారు.
"తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి చేసిన ప్రకటన సమంజసమైంది కాదు. భక్తుల మనోభావాలకు భిన్నమైందిగా ఉంది" అని మురళీ అభ్యంతరం తెలిపారు.
గతంలో కూడా ఈ రేషన్ విధానం కారణంగా విపరీతమైన బ్లాక్ మార్కెటింగ్ ఏర్పడిన విషయాన్ని యాజమాన్యం మరిచిపోయినట్టుంది. అని ఆయన గుర్తు చేశారు.
"ఇప్పటికే తిరుమల కొండపై దళారుల దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో క్యాబినెట్ సమావేశంలో ఓ మహిళా మంత్రి సీఎం ఎన్. చంద్రబాబుకు స్వయంగా ఫిర్యాదు చేసినా, ఆ దందాకి బలం చేకూర్చేటట్టుగా టీటీడీ యాజమాన్యం ప్రకటనలు చేయటం ఏ రకంగాను సమంజసం కాదు. తక్షణం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More
Next Story